తలవంచి లోకాన్ని జయించే విశ్వాసి...

8 Apr, 2018 01:16 IST|Sakshi

తుఫాను వస్తుంది, రెండు మూడు రోజుల్లో సమసిపోతుంది. కానీ దాని విధ్వంసక శక్తిని ఎదురాడి నిలదొక్కుకున్న మహావృక్షాలు ఎన్నో ఏళ్ళపాటు నిలిచిపోతాయి. యాకోబు కుమారుల్లో ఒకడైన యోసేపు జీవితం అంతా తుఫానుమయమే. సద్వర్తనుడు, భక్తిపరుడు, తాము చేసే తప్పుడు పనుల సమాచారమంతా తండ్రికి ఎప్పటికప్పుడు తెలియజేస్తున్న యోసేపంటే అతని అన్నలందరికీ ఈర‡్ష్య, ద్వేషం. పైగా తండ్రి యాకోబు అతన్ని బాగా ప్రేమిస్తున్నాడన్న కారణంగా పీకలదాకా యోసేపంటే కోపం. యోసేపునకు సొంత అన్నలే కనిపించని బద్ధ శత్రువులయ్యారు. అందులోను ఏ విశ్వాసి పట్లనైతే దేవునికి ప్రత్యేకమైన తలంపులు, సంకల్పాలున్నాయో ఆ విశ్వాసికి చుట్టూ శత్రువులుంటారు.

యాకోబు కుమారులందరిలోకి యోసేపు పట్ల దేవునికి అద్భుతమైన దైవసంకల్పాలున్నాయి. ఆ కారణంగానే అతని జీవితం తుఫానులమయమైంది. అన్నలు అతన్ని ఈజిప్తు దేశవాసులకు బానిసగా అమ్మేసి, అతన్ని అడవిలో క్రూరమృగమేదో చీల్చి తినేసిందని తండ్రికి అబద్ధం చెప్పారు. తప్పుడు ఆరోపణపై అతను జైలుకెళ్లాడు. కానీ దేవుని కృపవల్ల ఇలాంటి ప్రతి తుఫానూ అతన్ని పైమెట్టుకెక్కించే ఆశీర్వాదంగా దైవ హస్తం మార్చింది.

అప్పటి మధ్యప్రాచ్య దేశాలన్నింటినీభయంకరమైన కరువు ఎన్నోయేళ్లపాటు కబళించబోతోందని దైవ ప్రేరేపణతో ఫరోకు తెలియజెప్పి, ఆ కరువునెట్లా ఎదుర్కోవాలో కూడా ఒక పథకాన్ని రూపొందించి ఇవ్వగా, దాన్ని అమలుచేసేందుకు ఈజిప్టు దేశానికి ప్రధానమంత్రి గా యోసేపు నియమించబడ్డాడు. బానిసగా ఉన్నా, జైలులో ఉన్నా, ప్రధానమంత్రి అయినా, ఎక్కడున్నా యోసేపు దేవునికి ఎంతో విధేయుడై బతికాడు, అదే అతని విజయరహస్యం.

ఒక బానిస చివరికి ఆ దేశానికే ప్రధానమంత్రి కావడం నిజంగానే ఒక అసాధారణ ఉదంతం. అయితే దేవుని సంకల్పాల నెరవేర్పుకోసం నిరంతరం శ్రమించే విశ్వాసి బానిసలాంటి దీనస్థితిలో లేకున్నా, ప్రధానమంత్రిలాంటి అత్యున్నత పదవిలో లేకున్నా, ప్రశాంతభరిత జీవితాన్ని ఆస్వాదిస్తూ వందలాదిమందికి మేలుచేసే పరిస్థితుల్లోనే దేవుడు పెడతాడు. అయితే దేవుని పట్ల విధేయతే ఫలభరితమైన జీవితానికి బలమైన పునాది.

నోబెల్‌ బహుమతి పొందేంత జ్ఞానమున్నా దేవుడు మనల్ని వాడుకోవడానికి అది ఏమాత్రం పనికి రాదు. ఒక్కోసారి మహావృక్షాలు తుఫాను తాకిడికి నేలకూలితే. గాలికి తలవంచే బలహీనమైన వరిచేను తుఫానును తట్టుకోవడం చూస్తుంటాము. దేవునికి ఎంతగా తలవంచితే విశ్వాసి అంతగా బలవంతుడవుతాడు, ఆ విధేయతే అతన్ని లోకానికి అద్భుతమైన ఆశీర్వాదంగా మార్చుతుంది.

– రెవ.డా.టి.ఎ.ప్రభు కిరణ్‌

మరిన్ని వార్తలు