కరువు తాకని దాతృత్వం ఆమెది...

6 May, 2018 00:32 IST|Sakshi

షోమ్రోనులో భయంకరమైన కరువు తాండవిస్తున్న రోజులవి. దేవుని ఆదేశంతో ఏలియా ప్రవక్త సారెపతు ఊరికి వెళ్ళాడు. అక్కడ ఊరి వెలుపల ఎదురైన ఒక విధవరాలిని  మంచి నీళ్లడిగాడు. కరువులో గుక్కెడు మంచినీళ్లు కూడా బంగారం కన్నా విలువైనవైనా,  ఆమె మంచినీళ్లివ్వబోతుంటే, ఒక చిన్న రొట్టె కూడా చేసి ఇవ్వమన్నాడు. ఆమె ఇవ్వననలేదు కానీ, తనకు, తన కొడుక్కు సరిపడా కొంచెం పిండి, కొంచెం నూనె మాత్రం ఉన్నాయని, వాటితో రొట్టెలు చేసుకొని అవే చివరి ఆహారంగా తిని, ఇక చనిపోవడానికి  సిద్ధపడుతున్నామని తెలిపింది.

‘అమ్మా ఆ కొంచెంలోనే నాకొక చిన్న రొట్టె చేసివ్వు. మిగిలిన దానితో నీవు, నీ కొడుకు తినండి. అపుడు అది మీ చివరి ఆహారం కాదు, నీ తొట్టిలోని పిండి, బుడ్డిలోని నూనె ఎన్నటికీ  తరగకుండా చేయబోయే దేవుని పోషణలో అది మీ తొలి ఆహారమవుతుందని బదులిచ్చాడు. ఆమె నమ్మి ఆయన చెప్పినట్టు చేసింది. అలా ఆమెది షోమ్రోను దేశమంతటిలో కరువులో కూడా నిశ్చింతగా చాలినంత ఆహారంతో బతికిన ఏకైక నిరుపేద కుటుంబం అయ్యింది (1 రాజులు 17:8–24).

బ్యాంక్‌ అకౌంట్లలో లక్షల రూపాయలున్నాసంతృప్తి, ప్రశాంతత లేని నిరుపేదలున్నారు, అయితే చేతిలో అదనంగా చిల్లిగవ్వ లేకున్నా ఎంతో  నిశ్చింతగా, ప్రశాంతంగా బతికే ధనవంతులున్నారు. దేవుడు బోలెడు వనరులిస్తే దేవుని సేవ బ్రహ్మాండంగా చేయాలనుకోవడం మంచిదే. కానీ ఆ స్థాయిని దేవుడు నీకిచ్చేముందు, నీకున్న కొంచెంలోనే కొంత దేవునికి ప్రీతిపాత్రంగా ఖర్చు చేయగలవా? అన్నది దేవుడు తప్పక చూస్తాడు. ఈ చిన్న పరీక్షలోనే చాలా మంది ఫెయిల్‌ అవుతుంటారు, తద్వారా దేవుని గొప్ప ఆశీర్వాదాలు పోగొట్టుకొంటూ ఉంటారు. సారెపతు విధవరాలు అన్యురాలు.

అయినా, తన వద్ద ఉన్న కొంచెం పిండి, కొంచెం నూనెతో తొలి రొట్టె చేసి ప్రవక్తకిచ్చింది, దేవుడు పెట్టిన విశ్వాస పరీక్షలో అలా గొప్ప మార్కులతో నెగ్గింది. దేవుడు అన్యాయస్థుడు కాడు, అందుకే ఇశ్రాయేలీయులు విఫలమైన చోట, అన్యుల విశ్వాసాన్ని ఘనపర్చి వారిద్వారా తన రాజ్యాన్ని విస్తరింపచేసుకున్నాడు. రూతు అన్యురాలు, రాహాబు అన్యురాలు అయినా వారు దేవునికి  తమ ఘన విశ్వాసం ద్వారా ప్రియులయ్యారు, దేవుడు వారిని దీవించి ఏకంగా యేసుక్రీస్తు వంశావళిలోనే చేరే భాగ్యాన్నిచ్చాడు. తాము ఎంతో గొప్పగా పరిచర్య చేస్తేనే దేవుడు ప్రసన్నుడవుతాడనుకొంటారు చాలామంది.

మన జీవితంలోని నిస్వార్ధత, దాతృత్వం, పొరుగువారిపట్ల ప్రేమ వంటి సుగుణాలు ముందుగా దేవుణ్ణి ప్రసన్నుణ్ణి చేస్తాయి. మన సాక్ష్య జీవితం ద్వారా ప్రభువు కృప అనే సజీవ జలనిధిలోనికి  మన వేర్లు లోతుగా పాతుకు పోయినపుడు, వర్షం లేని క్షామకాలం మనల్ని చింతకు గురిచేయదని, కరువులో కూడా మనం ఫలిస్తూ, పచ్చగా ఉంటామని బైబిల్‌ చెబుతోంది (యిర్మీ17:8). మనకున్న దీన స్థితిలోనే దేవునికి నమ్మకత్వం చూపిస్తే, అత్యున్నతమైన ఆశీర్వాదాలను దేవుడు మన ఒడిలో వేస్తాడు.

దేవుడు పెట్టే చిన్న పరీక్షలో ముందు నెగ్గితే, దీవెనల బాటలో ద్వారాలు వాటంతటవే తెరుచుకుంటాయి. వేలాదిమందిని ఆదుకొని, వారికి అన్నం పెట్టే ఆశీర్వాదాన్ని నీకు దేవుడివ్వాలనుకొంటున్నావా?.నీ తల్లిదండ్రులను, నీ తోబుట్టువులను నీవు ఎలా చూస్తున్నావన్నది దేవుడు గమనిస్తున్నాడని గుర్తుంచుకో. పదోతరగతిలోనే పదిసార్లు తప్పి బయటపడినవాడికి, పిజి పట్టా తేలికగా ఎలా దొరుకుతుంది?

– రెవ.డా.టి.ఎ.ప్రభుకిరణ్‌

మరిన్ని వార్తలు