పరివర్తనకు చిరునామా యోహాను!!

3 Jun, 2018 00:35 IST|Sakshi

శిష్యుల్లో యాకోబు, యోహాను అనే సోదరులకు ‘ఉరిమెడివారు’ (బొయనెర్గెస్‌) అని యేసుప్రభువే పేరు పెట్టాడు (మార్కు 3:17). ఉరుము ఒక్క క్షణం కోసం అందరి దృష్టీ ఆకర్షిస్తుంది, జడిపిస్తుంది కూడా. అంతమాత్రాన ’ఉరుము’ సాధించేదేమీ ఉండదు. ఈ ఇద్దరి జీవితం, ముఖ్యంగా యోహాను జీవితం అలాంటిదే. యేసు శిష్యుడు కాని ఒక వ్యక్తి దయ్యాల్ని వెళ్లగొడుతుంటే యోహాను అతన్ని అడ్డుకొని ప్రభువుతో చీవాట్లు తిన్నాడు(మార్కు 9 :38).

యేసును, ఆయన శిష్యులను గ్రామంలోకి స్వాగతించని సమరయులమీదికి ఆకాశంనుంచి అగ్ని కురిపించి నాశనం చేయమని సూచించి ప్రభువుతో మరోసారి తిట్లు తిన్నాడు (లూకా 9:51). పరలోకంలో ప్రభువుకు కుడి ఎడమ స్థానాల్లో కూర్చునేందుకు తమ తల్లితో సిఫారసు చేయించుకొని భంగపడిన దురాశపరుడు యోహాను. ఉరుము లాగే దుందుడుకుతనం, ఆవేశం, హడావుడి, క్షణికోత్సాహం, శబ్దగాంభీర్యం యోహాను లక్షణాలు. అయితే ప్రభువు తన శిష్యుడిగా చేర్చుకున్న తొలిరోజుల అతని వ్యక్తిత్వమిది.

అతని లోపాలన్నీ తెలిసే ప్రభువు అతన్ని శిష్యుడిగా ఎంపిక చేసుకున్నాడు. అయితే ఏ మాత్రం విలువలేని ఈ ‘ఉరుము’ ప్రభువు సహవాసంతో ఎదిగి కాలక్రమంలో వెలకట్టలేని ’వజ్రం’గా మారి దేవుని రాజ్యాన్ని అద్భుతంగా నిర్మించింది. యోహాను ఎంతగా ఎదిగాడంటే, సిలువలో వేలాడుతున్న యేసును శిష్యులంతా వదిలేసి ప్రాణభయంతో పారిపోతే, అతనొక్కడే సిలువలోని ప్రభువు పక్కనే ధైర్యంగా నిలబడ్డాడు. ప్రభువుశక్తికి అంతకాలంగా సాక్షిగా ఉన్న యోహాను, మానవాళికోసం సిలువలో నిస్సహాయుడిగా వేలాడిన ప్రభువులో దైవత్వాన్ని, క్షమాపణను మరెక్కువగా చూశాడు. అదే అతని జీవితాన్ని సమూలంగా మార్చింది. అందుకే కొత్త నిబంధనలో ఒక సువార్తను, ప్రకటన గ్రంథాన్ని, మూడు పత్రికల్ని యోహాను రాశాడు.

‘దయ్యాలు వెళ్లగొట్టే ఫలానావాడు మనవాడు కాడు’ అన్న అతని ‘స్వార్థపరత్వం’ యేసుసాన్నిహిత్యంలో ’అంతా మనవాళ్ళే’ అన్న సార్వత్రికతగా మారింది. సమరయులను దహించేద్దామన్న అతని ఆగ్రహం, ఆవేశం, పరుశుద్ధాత్ముని ప్రేరణతో మానవాళికి ప్రభువు రాసిన ’ప్రేమపత్రిక’ గా పేరొందిన ’యోహాను సువార్త’ రాయడానికి అతన్ని పురికొల్పింది. ఎవరెక్కడున్నా నేను మాత్రం యేసు కుడి ఎడమ స్థానాల్లో ఉండాలన్న అతని ‘సంకుచితత్వం’, యేసు ప్రభువు రెండవ రాకడకు ముందు కడవరి రోజుల్లో ఈ లోకం ఎంత అధ్వాన్నంగా తయారు కానున్నదో ప్రజలందరి శ్రేయస్సు కోసం వివరించే ప్రకటన గ్రంథాన్ని రాసే ‘ఆత్మీయత’ గా మారింది.

శరీరం లావు తగ్గించే వ్యాపారంలో ఉన్నవాళ్లు ’ముందు’, ’తర్వాత’ అన్న శీర్షికలతో వేసే ఫొటోల్లాగా, ప్రభువు లోకి వచ్చినపుడు మనం ఎలా వున్నాం, ప్రభువు సహవాసంలో గడిపిన ఇన్నేళ్ళలో ఎంతగా పరిణతి చెందామన్న ఒక స్వపరిశీలన, అంచనా ప్రతి విశ్వాసిలో ఉండాలి. ఒకప్పుడు విలువలేని ‘ఉరుము’ లాంటి యోహాను, ఆదిమ సౌవార్తిక ఉద్యమానికి స్తంభంలాంటివాడని పౌలు స్వయంగా శ్లాఘించాడంటే అతను ఆత్మీయంగా ఎంతగా ఎదిగాడో అర్ధం చేసుకోవచ్చు (గలతి 2:9). యేసుప్రభువును ఎరుగని ‘అంధకారం’ కంటే యేసుప్రభువులో ఉండికూడా ఎదగని, మార్పులేని ’క్రైస్తవం’ విలువలేనిదే కాదు, ప్రమాదకరమైనది కూడా.

అత్యంత ప్రమాదకరమైన నేరస్థులకు రోమా ప్రభుత్వం విధించే భయంకరమైన శిక్షల్లో ఒకటి పరవాస శిక్ష. భయంకరమైన సర్పాలు, క్రూరమృగాలుండే ఎడారుల్లాంటి దీవుల్లో ఆ నేరస్థులను వదిలేస్తే క్షణక్షణం ప్రాణ భయంతో, ఆకలితో అలమటిస్తూ వాళ్ళు చనిపోతారు. అందరికీ యేసుప్రేమను బోధిస్తూ, ప్రభుత్వ భయం మాత్రమే తెలియవలసిన ప్రజలను ప్రేమామయులను చేస్తున్న అత్యంత ’భయంకరమైన నేరానికి’ గాను, రోమా చక్రవర్తి యోహానుకు పత్మసు అనే ఎడారిలాంటి భయంకరమైన ద్వీపంలో పరవాస శిక్షను విధించారు. కాని ఆ ద్వీపంలో యేసుప్రభువు నిత్యప్రత్యక్షతను క్షణక్షణం అనుభవిస్తూ ఆతను ప్రకటన గ్రంథాన్ని రాసి మనకిచ్చాడు.

అనుక్షణం మృత్యువు వెంటాడే పత్మసు ద్వీపంలో, యేసుసాన్నిహిత్యంతో యోహాను క్షణక్షణం పరలోకజీవితాన్ని జీవించాడు. యోహానులో ఇంతటి పరివర్తనకు కారకుడైన యేసుప్రభువు మనలో ఆ మార్పు ఎందుకు తేవడం లేదు? అనే ప్రశ్నను ప్రతి విశ్వాసి వేసుకోవాలి. అయితే జవాబు మనలోనే ఉంది. మారడానికి మనం సిద్ధంగా లేమన్నదే మనందరికీ తెలిసినా మనం ఒప్పుకోని జవాబు. సొంతప్రచారం చేసుకొంటూ, వ్యాపారం తరహాలో పరిచర్యను మార్కెటింగ్‌ చేసుకునే ‘ఉరిమేవాళ్ళు’ కాదు, ప్రేమతో, పరిశుద్ధతతో, నిస్వార్థతతో జీవిస్తూ లోకాన్ని ప్రభువు ప్రేమ అనే వెలుగుతో నింపుతూ ‘చీకటిని తరిమేవాళ్ళు’ దేవునికి కావాలి.

- రెవ.డా. టి.ఎ.ప్రభుకిరణ్‌

మరిన్ని వార్తలు