సాహసియైన విశ్వాసికి లోకమే దాసోహమంటుంది

1 Jul, 2018 02:22 IST|Sakshi

బబులోను రాజైన నెబుకద్నెజరుకు ఒక రాత్రి పీడకల వచ్చింది. అది తనకు జరుగబోయే ఏదో కీడును సూచించేదన్న విషయం రాజుకర్థమైంది. అయితే విచిత్రంగా రాజు తన కలను మర్చిపోయాడు. అందువల్ల తాను కన్న కలను చెప్పి, దాని అర్థాన్ని కూడా విడమర్చి చెప్పాలని రాజు తన సంస్థానంలోని శకునగాండ్రను.

జ్ఞానులను, గారడీవాళ్లను, జ్యోతిష్కులను, జ్ఞానులను ఆదేశించాడు. ఎంతటివారైనా ఆ కల ఏదో తెలిస్తే దాని అంతరార్థం చెప్పగలరు కానీ, ఒక వ్యక్తి కన్న కలను చెప్పడం లోకంలో ఎవరికి సాధ్యం?  వాళ్లంతా అదే జవాబిస్తే రాజు అత్యాగ్రహం చెంది వాళ్లందరినీ హతమార్చమని ఆదేశించాడు. రాజుగారి సంస్థానంలోనే జ్ఞానులుగా యూదుడైన దానియేలుతో పాటు అతని స్నేహితులైన షద్రకు, మేషాకు, అబేద్నెగో అనే అతని మరో ముగ్గురు యూదు స్నేహితులున్నారు.

విషయం తెలిసి దానియేలు ధైర్యం చేసి రాజును దర్శించి తనకు కొంత గడువిస్తే స్వప్నభావాన్ని తెలియజేస్తానని విన్నవించుకొని గడువు తీసుకున్నాడు. నెబుకద్నెజరు యూదుడు కాడు, బబులోను యూదుదేశమూ కాదు. దానియేలు తదితర యూదులంతా బబులోనులో, రాజు చెరలో బానిసలుగా ఉన్నారు. మరి బబులోను దేశ మూలనివాసులు ఏమీ చేయలేని నిస్సహాయ పరిస్థితుల్లో దానియేలు వంటి బానిసలు ఏం  చెయ్యగలరు? దానియేలు, అతని ముగ్గురు స్నేహితులూ బలహీనులు, బానిసలే కావచ్చు కానీ వారు నమ్మే దేవుడు వారి లోకంలోని రాజులందరికన్నా ఎంతో బలవంతుడు.

పైగా నేనంటాను, వాళ్ళు నలుగురి ప్రార్ధనలు, ఆరాధనలతో బబులోను మహా పట్టణంలో ఒక ’చర్చి’ వెలిసింది. అది నలుగురే ఉన్న ఒక చిన్న చర్చీయే కాని ఇపుడు రాజు గారి తీరని సమస్యను తీర్చేందుకు, ఆయన ఆదేశించిన నరమేధాన్ని అడ్డుకొనేందుకు సాహసంతో పూనుకొంది. దానియేలు, అతని స్నేహితులూ కలిసి దేవుని సన్నిధిలో ఎంతో ఆసక్తితో ప్రార్ధించగా జ్ఞానానికి, మర్మాలకు, సత్యానికి, వెలుగుకు ప్రాప్తిస్థానమైన దేవుడు రాజు కలను, దాని భావాన్ని కూడా దానియేలుకు తెలియజేశాడు. వెంటనే దానియేలు రాజు సముఖానికి వెళ్లి అతని కలను, దాని భావాన్ని వివరించగా రాజు అత్యానందంతో వారికి కానుకలిచ్చి సన్మానించాడు. ఆ దేశంలో ఒక ప్రమాదం జరుగకుండా అలా అక్కడి చర్చి పూనుకొని అడ్డుకొంది. అదే నిజమైన చర్చి అంటే.

చర్చి, అందులోని విశ్వాసులు కూడా సాహసానికి, చైతన్యానికి, క్రియాశీలతకూ మారుపేరుగా ఉండాలి. దేవుని పనిలోనే కాదు, సామాజిక బాధ్యతల నెరవేర్పులో కూడా చర్చి ముందు వరుసలో నిలబడాలి. అదంతా దేవుడు చూసుకుంటాడులే అనుకునేవారు రిస్క్‌ తీసుకోవడం ఇష్టం లేని చేతకానివాళ్ళు, వేషధారులు. దానియేలు అతని స్నేహితులూ అలాంటి వారు కాదు. వారు స్వచ్ఛమైన దైవభక్తి కలిగినవారు, ప్రతి విషయంలో దేవునికి మహిమనిచ్చేవారు, దేవునికి మాత్రమే భయపడేవారు, పొరుగువారి సమస్యలకు ప్రతిస్పందించేవారు.

ఇవన్నీ విశ్వాసిలో దేవుడు చూడదల్చుకొంటున్న లక్షణాలు. విశ్వాసి పిరికివాడు కాదు, పిరికివాడు విశ్వాసి ఎన్నటికీ కాడు. తమ భక్తితో, సాహసంతో బబులోనువంటి మహా సామ్రాజ్యాన్ని దానియేలు శాసించాడు. తన సొంత జ్ఞానమనే పాదాల మీద కాదు, దేవుని సన్నిధిలో మోకాళ్ళ మీద నిలబడేవాడు నిజంగానే బలమైన విశ్వాసి. అతనికి లోకమే దాసోహమంటుంది.

– రెవ.డా.టి.ఎ.ప్రభుకిరణ్‌

మరిన్ని వార్తలు