అన్నింటికీ మూలం మన హృదయమే

30 Sep, 2018 01:02 IST|Sakshi

ఆదిమ అపోస్తలులైన పేతురు, యోహాను ఎక్కడికెళ్లినా తమ వెంట ఆశీర్వాదాన్ని, ఆనందాన్ని, ఆదరణను తీసుకెళ్లేవారు. వారి సాంగత్యంలో ప్రజలు ఎంతో ఆదరణ పొందేవారు, వాళ్ళు స్పర్శిస్తే చాలు ప్రజలు పరిశుద్ధాత్మపూర్ణులయ్యేవారు. వారినోట ప్రజల కోసం ఎప్పుడూ శాంతి, సాంత్వన, సహృదయపూరితమైన మాటలే వెలువడేవి. అందువల్ల తండోపతండాలుగా ప్రజలు వారిని కలుసుకోవడానికి వచ్చేవారు. ’పరిశుద్ధాత్మశక్తి’ వల్ల వారికి లభిస్తున్న ప్రజాదరణ చూసి అసూయచెంది, అది పొందితే తనకు కూడా అంతటి ప్రజాభిమానం లభిస్తుందన్న దురాలోచన ఆరోజుల్లో సీమోను అనే గారడీ వాడికి వచ్చింది.

వెంటనే కొంత ద్రవ్యం వారి వద్ద పెట్టి, తనకు కూడా పరిశుద్ధాత్మ శక్తి వచ్చేలా చెయ్యమని అర్థించాడు. పరిశుద్ధాత్మ శక్తి పొందాలనుకోవడంలో తప్పు లేదు. కానీ తద్వారా మరీ ఎక్కువగా గారడీలు చేసి మరింత ప్రజాభిమానం సంపాదించాలనుకోవడం, పైగా ద్రవ్యమిచ్చి పరిశుద్ధాత్మశక్తి పొందాలనుకోవడం అతను చేసిన తప్పు. పేతురుకు, యోహానుకు సహజంగానే ఆగ్రహం కలిగింది. ‘నీ హృదయం దేవుని ఎదుట సరైనది కాదు..నీవు ఘోరమైన దుష్టత్వంలో, దుర్నీతి బంధకాల్లో ఉన్నావు. వెంటనే మారుమనస్సు పొంది దేవుని క్షమాపణ వేడుకొమ్మని వారతన్ని హెచ్చరించారు.

మన ప్రవర్తన తాలూకు వేర్లు, మూలాలు మన హృదయంలో ఉంటాయని యేసుప్రభువు తన బోధల్లో ‘ఆత్మీయ రోగనిర్ధారణ’  చేశారు. ‘దుష్పవ్రర్తన’ అనే విషవృక్షం తాలూకు వేర్లు మన గుప్పెడు హృదయంలోనే అగోచరంగా ఉంటాయంటూ పరిసయ్యులు, శాస్త్రులను ఉద్దేశించి ప్రభువు చేసిన బోధ  నాటి యూదుసమాజంలో పెద్ద దుమారాన్నే లేపింది. అందుకే వారాయన్ను చంపి తీరాలన్న తీర్మానానికి వచ్చారు. ప్రభువు చేసిన ఆ బోధ అప్పుడూ ఇప్పుడూ కూడా అన్ని తరాలు, వర్గాలు, వయసులవారికి వర్తిస్తుంది. బయటికి మన మొహంలో కనిపించే భావాలకు, లోపాలు హృదయంలో రహస్యంగా పెల్లుబికే లావా కు అసలు పొంతన ఉండదు. కొందరు పైకి తెగ నవ్వుతూ కనిపిస్తారు, కానీ లోలోపల అందరి మీదా ఏడుస్తుంటారు, పక్కవాళ్ళమీద లోలోనే పళ్ళు కొరుకుతూంటారు, విద్వేషం ఇతివృత్తంగా మాటల్లో ‘విషం’ చిమ్ముతూ పైశాచికానందం పొందుతూంటారు.

నరహత్య, దోపిడీ, వ్యభిచారం, దైవాజ్ఞాతిక్రమం వంటి అత్యంత హేయమైన పాపాల జాబితాలోకి ఈ ప్రవర్తన రాదేమో కానీ ఈ విద్వేషపూరిత ప్రవర్తన అన్ని పాపాలకన్నా ఎంతో ప్రమాదకరమైనది. మనలో అంతర్గతంగా ఏదైనా ‘చేదువేరు’ మొలిచి మనం దైవకృప పొందేందుకు అడ్డుపడకుండా జాగ్రత్తపడాలని పౌలు భక్తుడు విశ్వాసులను హెచ్చరించాడు హెబ్రీ  12:15). అంతర్గతంగా మనలో చేదువేరంటూ ఉంటే అది ఏదో ఒకసారి మొలకెత్తక మానదు, వటవృక్షంగా మారకా తప్పదు. ఇతరులను ద్వేషించి, వారిపై రహస్యంగా విషం చిమ్మే వాళ్ళు సాధారణంగా తమ జీవితాల్లో ఏదో సాధించాలని ఉబలాటపడి అది జరగక బొక్క బోర్లా పడ్డవాళ్లే!! అలా వారిలో వేళ్లూనిన ఆత్మన్యూనతా భావం, అభద్రతా భావం ఇలాంటి దుష్పవ్రర్తనకు పురికొల్పుతుంది.

పరిశుద్ధాత్మశక్తి నిండిన విశ్వాసుల జీవితాల్లో, హృదయాల్లో ఆనందం, శాంతి, సంతృప్తి తాలూకు మంచి నీళ్ల ఊటలు నిరంతరం నిండి ఉంటాయి. వారి సహవాసంలో ప్రతి ఒక్కరూ ఆదరణ పొందుతారు. పరిశుద్ధాత్మ దేవుడు ముందుగా మన హృదయాలను పరిశుద్ధపర్చుతాడు. అందుకే ఆ శక్తితో నిండిన చర్చిలు, విశ్వాసులు, పరిచారకుల మాటలు, క్రియలు ఆత్మీయ పరిమళంతో, ఆనందంతో నిండి ఉంటాయి. పాపం, రోజూ అందరినీ తన గారడీతో బోల్తా కొట్టించే సీమోను అనే గారడీ వాడు తన కుయుక్తితో ఆరోజు పేతురు, యోహానును కూడా బోల్తా కొట్టించబోయి తానే బోల్తా పడ్డాడు, అడ్డంగా దొరికి పోయాడు!!!

– రెవ.డా.టి.ఎ.ప్రభుకిరణ్‌

మరిన్ని వార్తలు