గురువు సర్వకాలాల్లో ఉంటాడు

8 Oct, 2017 05:31 IST|Sakshi

పరమాత్మ అంతటానిండి ఉన్నప్పటికీ, ఆయన గురువు రూపంలో తిరుగుతుంటాడు. కానీ ఆ గురువును పట్టుకోవడం అంత తేలికైన విషయం కాదు. భగవాన్‌ రమణులు ఏమంటారంటే... ‘సాలగ్రామం కూడా గులకరాళ్ళలోనే ఉంటుంది.

దాన్ని గుర్తించగలిగిన వాడు మాత్రమే దానిని కనిపెట్టి, అర్చించి, దాని అనుగ్రహంచేత ఉన్నతస్థానాన్ని పొందినట్లుగానే గృహస్థాశ్రమంలోనే ఉండి అందరితో కలసి తిరుగుతున్న గురువు భిన్నంగా ఏమీ కనబడకపోయినప్పటికీ ఆయన ఏ కారణం చేత మనకన్నా అధికుడై ఉన్నాడో, ఆయనను ఎందుకు అనుసరించాల్సి ఉంటుందో, అనుసరిస్తే మనల్ని ఆయన ఎక్కడకు చేర్చగలడో గ్రహించి, ఆయన సాక్షాత్‌ రాశీభూతమైన పరబ్రహ్మ స్వరూపమని తెలుసుకుని పట్టుకోగలగడం గులకరాళ్ళలోంచి సాలగ్రామాన్ని వేరుచేయడం వంటిదే.’

అటువంటి గురువు పరబ్రహ్మ స్వరూపం కనుక గురువు విషయంలో ఉపాసనలో పెద్దలు ఒక మాట చెబుతారు. శృంగేరీ పీఠానికి ఆధిపత్యం వహించిన మహాపురుషులు, ఒకనాడు జీవన్ముక్తులు, ఈనాడు విదేహముక్తిని పొందినవారు, అంటే శరీరంలో ఉన్నప్పటికీ తాను ఈ శరీరం కాదనీ, తాను ఆత్మ అనీ, బాగా రూఢిచేసుకుని ఆత్మను అనుభవంలోకి తెచ్చుకుని ఆత్మగా మాత్రమే ఈ భూమిమీద చరించి శరీరంతో సంపర్కం లేకుండా తనంత తాను శరీరం పడిపోయేవరకు శరీరాన్ని పోషించి శరీరాన్ని సాక్షిగా చూసి పడిపోయిన శరీరాన్ని చూసి ‘హమ్మయ్య, విడిపోయింది, నాకున్న ఉపాధి’ అని పరమసంతోషంతో అనంతమైన ఈ బ్రహ్మాండాలలో తేజోరూపంగా వ్యాపకత్వాన్ని పొందినవాడు ఎవరో అటువంటివాడు విదేహముక్తిని పొందిన గురువు. ఆయన శరీరంతో లేకపోయినా అటువంటి గురువు సర్వకాలాల్లో ఉంటూనే ఉంటాడు, సర్వకాలాల్లో శిష్యుని రక్షణ బాధ్యతలు స్వీకరిస్తూనే ఉంటాడు.

ఒక ఉదాహరణ చెప్పాలంటే...సనాతన ధర్మంలో చాలా గురు స్వరూపాలు శరీరాన్ని విడిచి పెట్టేసినప్పటికీ కూడా వాళ్ళు విదేహముక్తిని పొంది, వాళ్ళ శరీరాలు భూస్థాపితం చేయబడి దానిమీద తులసికోట ఉంచి బృందావనం అన్నా, శివలింగముంచి అధిష్ఠానం అన్నా తరువాత కాలంలోకూడా వారు ఎలుగెత్తి పిలిచిన తమ శిష్యుల యోగక్షేమాలను కనిపెట్టుకునే ఉన్నారు. అందుకే వారి గురుస్వరూపాన్ని అంతగా ఆరాధన చేస్తారు.

పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ భారతీ తీర్థ మహాస్వామి శృంగేరీలో ఉంటే నిత్యం వారికున్న ప్రధాన వ్యాపకమేది అంటే ... పొద్దున్నేలేచి అనుష్ఠానం అయిపోయిన తరువాత వారు గురువుల అధిష్ఠానాల దగ్గరకు వస్తారు. సచ్చిదానంద శివానంద నృసింహ భారతి, అలాగే నృసింహ భారతి, చంద్రశేఖర భారతి, శ్రీమత్‌ అభినవ విద్యాతీర్థ మహాస్వామి మొదలైనవారి అధిష్ఠానాలకు ప్రదక్షిణం చేసి నమస్కారం చేస్తారు. వారితోపాటూ గురుపాదుకలు వెడతాయి. వాటికి ప్రతిరోజూ నమస్కారం చేస్తారు. గురుపాదుకలకు నివేదనం కూడా చేస్తారు. గురువుగారితో ప్రత్యక్షంగా వ్యవహరించినట్లే. దానికి ప్రతిగా గురువుగారు వెన్నంటి రక్ష చేస్తూనే ఉంటారు.

మరిన్ని వార్తలు