వినయం అనే విత్తనం పడితేనే...

7 Jun, 2020 00:05 IST|Sakshi

సంస్కారం

‘‘మీరెలా కోరుకున్నారో మేమలా నడుస్తాం. మీరు చూపిన బాట మాకు ఆదర్శం’’ అని వారి పాదాలకు నీవు నమస్కరించినప్పుడు... వారు పెద్దలు.. అని లోపల నీ బుద్ధి గ్రహిస్తోంది. వారు స్వార్థాన్ని విడనీడి, త్యాగమయ జీవితాన్ని గడుపుతున్నవారని కూడా నీకు తెలుసు. కానీ మనసులో అసూయ ప్రబలుతోంది. ఇక ఇప్పుడు నీవు వారిని అలా గౌరవించలేవు, నమస్కరించలేవు, పొగడలేవు. స్థిమితంగా కూర్చుని అవతలివాడిలో లేని అవగుణాల్ని ఉన్నట్లుగా చూపించడానికి పూనుకుంటావు... అదే అసూయ. పెద్దలపట్ల, మహాత్ములపట్ల తప్పుగా మాట్లాడితే ఏమవుతుంది? త్యాగరాజస్వామి గురించి నేనొక తప్పు మాట అన్నాననుకోండి.

నేను ఆయనలా పాట పాడలేకపోయానని, కీర్తన రాయలేకపోయానని ఆయనలో దోషాలు వెతకడానికి పూనుకోవడం అంటే అసూయ ఏ స్థాయికి పాకి పోయిందో ఊహించవచ్చు. దానివల్ల త్యాగరాజ స్వామి వారికేమయినా తక్కువయిందా? ఆయన రామచంద్రమూర్తిలో ఐక్యమయిపోయారు. అంటే దుర్గుణాలకు నేను ఆలవాలమయిపోయాను తప్ప అవతలివారికేమీ కాలేదు. అదే రెండుచేతులెత్తి, తలదించి నమస్కరించానంటే నేను సన్మార్గంలో ఉన్నానని గుర్తు. అది సంస్కారానికి లక్షణం. ఇది వినయం నుంచి వస్తుంది. అది రావాలంటే అహంకారం పోవాలి. వెలుగు రాగానే చీకటి పోయినట్లుగా వినయం ఏర్పడగానే అహంకారం దానంతట అదే పోతుంది. పెద్దలపట్ల గౌరవ భావం ఏర్పడుతుంది. సంస్కారం మూర్తీభవిస్తుంది. మనకు నిరంతరం తటస్థపడే ముగ్గురిలో మనకన్నా అధికులు కనబడితే ఏమవుతుందో చూసాం. 

మనతో సమానులు తటస్థపడితే ఏమవుతుంది!!!...సమానులయిన వారు కనబడకుండా ఉండరు. మనకెంత ప్రజ్ఞ ఉందో వారికీ అంతే ప్రజ్ఞ ఉంటుంది, అంతే చదువు, ఉద్యోగం ఉంటాయి. నేను కష్టపడి ఒక ఫ్లాట్, ఒక మోటారు సైకిలు ఎలా కొనుక్కున్నానో వారూ అలానే కష్టపడి కొనుక్కున్నారు. నేను వారూ సమానులం. ఇప్పడు మనసులో ఒక దుర్గుణం ప్రవేశించింది. వెంటనే ఉదాసీనత ఏర్పడుతుంది. అతను నాకన్నా ఏమంత గొప్ప కనుక. నేనేమిటి అతన్ని గౌరవించేది. ఆయన నాకన్నా అధికుడేం కాడు. అధికారాల్లో ఆయనకెన్ని ఉన్నాయో నాకూ అన్నే ఉన్నాయి. ఎందుకు లెక్కపెట్టాలి? ఎందుకు గౌరవించాలి?... ఇది ప్రమాదకరమైన పోకడ. అహంకారానికి పరాకాష్ఠ. ఆయనా నేను సమానులం.

ఒక మోటారు సైకిలు కొనుక్కోవడానికి నేను ఎన్నాళ్ళు కష్టపడ్డాను! ఒక ఫ్లాట్‌ స్వంతం చేసుకోవడానికి ఎంత కష్టపడాల్సి వచ్చింది!  జీవితంలో ఆ ఒక్క ఫ్లాటు చేతికొచ్చి గృహ ప్రవేశం చేసి పూజగదిలో కూర్చుని పూజచేస్తూ..‘స్వగృహే’ అని చెప్పుకున్న క్షణంలో... ‘హమ్మయ్య, ఒక గూడు ఏర్పరుచుకోగలిగాను. వేదం అంతటిది ఒక ఇల్లు ఉండాలని చెప్పింది కాబట్టి పెద్ద భవంతి కాకపోయినా చిన్నదయినా కొనుక్కోగలిగాను. ఈశ్వరుడిచ్చాడు కదా!... అనుకుని నువ్వెలా సంతోషపడిపోతావో... అలా ఆయన కూడా ఎంత కష్టపడితే ఆ ఫ్లాటు కొనుక్కోగలిగాడో...అన్న ఆలోచన వచ్చినప్పుడు ఉదాసీనత స్థానంలో ఆదరణ వచ్చిచేరుతుంది. ఆయనా నావంటి వాడే. సమానుడే. సమానంగా కష్టపడ్డాం... అని చెయ్యి చెయ్యి కలిపి నడవగలిగావనుకో. ఇప్పుడు ఉదాసీనత పోయి ఆదర భావం ఏర్పడింది... అంటే నీవు సంస్కారవంతుడవయి ఉన్నావని గుర్తు. వినయం అన్న విత్తనం లేకుండా అసలు ఈ మొక్కలు మొలకెత్తవు. వినయం ఉంటే సంస్కారం ఉన్నట్లే... సమానుల పట్ల కూడా ఆదరభావంతో ఉంటావు.

మీకు తెలుసా
పరమశివునికి ఉన్న అనేక పేర్లలో ఆశుతోషుడు ఒకటి. ఆశుతోషుడంటే స్వల్పమాత్రానికే సంతోషించేవాడని అర్థం. ప్రస్తుతం ఆలయాలకు వెళ్లే అవకాశం అతి తక్కువ కాబట్టి మన ఇంటిలో ఉన్న శివలింగానికి (అన్నంతో లేదా బెల్లంతో చివరకు పిడికెడు బంక మట్టితో లేదా చారెడు ఇసుకతో కూడా శివలింగాన్ని తయారు చేయవచ్చు) అందుబాటులో ఉన్న ఆవునెయ్యి, పెరుగు తేనె లేదా చెరుకురసం, లేదా చక్కెర నాటితో అయినా అభిషేకం చేయవచ్చు. భక్తసులభుడు సంతోషించి మోక్షాన్ని ప్రసాదిస్తాడు. ఇది శాస్త్ర ప్రమాణం.

ఇష్టదైవానికి మామిడి పండుని నైవేద్యంగా పెడితే ప్రభుత్వం నుంచి రావలసిన నగదు ఎటువంటి అడ్డంకులు లేకుండా సకాలంలో అందుతుంది. నమ్మి మోసపోయిన వారు దైవానికి నివేదించిన మామిడి పండుని ఈశ్వరుడికి అభిషేకం చేసిన తేనెలో కలిపి అందరికీ పంచి, ఆ తరువాత తిన్నట్లయితే మోసం చేసిన వారిలో పరివర్తన, పశ్చాత్తాపం కలిగి స్వయంగా మీ నగదును మీకు తిరిగి ఇచ్చేస్తారు. అలాగే, దైవానికి సపోటా పండును నైవేద్యంగా సమర్పిస్తే వివాహానికి కలుగుతున్న అవాంతరాలు అన్ని తొలగిపోతాయి అని పెద్దలు చెబుతారు.

ఒక విషయం
కలియుగంలో భగవన్నామ స్మరణ వలన ముక్తి లభిస్తుందని వేదోక్తి. స్మరణ మనస్సు చేసే పని. కేవలం దేవుని నామాన్ని నోటితో పలికితే చాలదు. మనసుతో నిరంతరం స్మరించగలగాలి. మనస్సు ఒక చక్రం వంటిది. అది అన్ని దిక్కులకూ తిరుగుతుంటుంది. దానిని పరమాత్మ పాదాలయందు స్థిరంగా నిలపగలగాలి. మోక్ష సాధనాలన్నింటిలోకీ భక్తి గొప్ప సాధనం. ఆ భక్తికి శ్రవణం కీర్తనం స్మరణం దాస్యం... ఇలా తొమ్మిది మెట్లున్నాయి. వీటిని నవవిధ భక్తి మార్గాలంటారు. ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ చివరకు ఆత్మ నివేదన కు చేరాలి. అదే మోక్షం లేక ముక్తి అంటే.

ధర్మ సందేహం
స్నానం చేసేటప్పుడు చదివే గంగేచ... శ్లోకంలో కృష్ణానదిని చేర్చలేదెందుకని? గంగ, యమున, గోదావరి, సరస్వతి, నర్మద, సింధు, కావేరి నదులు ఏడున్నూ స్మరణ మాత్రంతో పవిత్రం చేస్తాయి. బావిలోని నీటిని లేదా కుళాయి నీటిని తీసుకుని ఈ నదులను స్మరిస్తే ఆ నీళ్లు ఆయా నదీజలాలుగా మారిపోతాయి. కృష్ణాది నదులు స్నానం చేస్తేనే మనలను పవిత్రం చేస్తాయి. అందుకే పైన తెలిపిన సప్తనదులను స్మరించుకుంటాం.

విపత్తులు సన్మార్గంలో పెట్టడానికే
దారి తప్పుతున్న మానవాళిని సన్మార్గంలో పెట్టడానికి, దైవం ఒక్కొక్కసారి కొన్ని పరీక్షలకు గురిచేస్తాడు. హెచ్చరికలు పంపుతాడు. మానవుడు దేవుని హెచ్చరికలను అర్థం చేసుకొని, తలబిరుసుతనం వదిలేస్తే సరేసరి. లేకపోతే ఇబ్బందులు తప్పవు. కోవిడ్‌ 19 ఈవిషయాన్ని రుజువు చేసింది. గుమ్మం దాటి బయటికి రావడానికే మనిషి గజగజ వణికిపోయే పరిస్థితి. ఒక రకంగా ఇది దేవుని హెచ్చరిక. దైవాదేశాలను పెడచెవిన పెట్టిన ఫలితం. ఇప్పుడు మనిషి కీటకాలకు కూడా భయపడే పరిస్థితి నెలకొంది. మిడతల దండు దేశాలను, రాష్ట్రాలను బెంబేలెత్తించడాన్ని మనం గమనిస్తున్నాం. మానవుడు దైవాదేశాలను పట్టించుకోకుండా, మానవీయ విలువలను ఖాతరు చేయకుండా, ఇలలో కల్లోలానికి కారణమయ్యే పనులకు ఒడిగడితే, ఏదో ఒక రూపంలో దైవం హెచ్చరికల్ని పంపుతాడు. క్రిమి, కీటకాలు కూడా మనిషిని సవాలు చేసేలా చేస్తాడు.

మూసా అలైహిస్సలాం కాలంలో కూడా ఇలా జరిగింది. పవిత్ర ఖురాన్‌లో ఇలా ఉంది.:’ ..మేము వారిపైతుఫానును, మిడతల దండును పంపాము. ధాన్యపు పురుగులను (చెద పురుగులు), కప్పల రక్తాన్ని వదిలాము. ఇవన్నీ స్పష్టమైన మహిమలు. (వారు అర్థం చేసుకోడానికి..).(7 – 133). అనుకోకుండా తుఫాను వచ్చిపడితే, అది కొన్నిరోజులు కొనసాగితే, మనిషి ఎంత నిస్సహాయుడో తెలుస్తుంది. మూసా అలైహిస్సలాం కాలంలో తలబిరుసుతనం ప్రదర్శించిన ప్రజలు వరదల మూలంగా ముంపుకు గురయ్యారు. విపరీతమైన ధన ప్రాణ నష్టాలు సంభవించాయి. ఏడ్పులు, పెడబొబ్బలు, అర్తనాదాలు చేశారు ప్రజలు. అనేక సందర్భాల్లో మనం కూడా ఇలాంటి పరిస్థితుల్ని చూశాం. అదేవిధంగా కోట్ల సంఖ్యలో మిడతల దండ్లువచ్చి రాత్రికిరాత్రే పంటపొలాలను, పండ్లతోటలను తినేసేవి. ఖురాన్‌ లో ‘ఖుమ్మల్‌’ అనే పదం వాడబడింది. అంటే, పేలు, లేక చెద పురుగులు అని అర్థం.

ఈ రెండు జీవులూ వారి శరీరంలో, వారి బట్టల్లో దూరి కంపరం పుట్టించేవి. చెద పురుగులు ఆహార ధాన్యాల్లో చేరి గింజల్ని గుల్లచేసేవి. దీంతో వారికి తీవ్రమైన ఆర్థిక నష్టం సంభవించేది. కప్పలు వారి వంట పాత్రల్లో, పడక గదుల్లో, ఆహార పదార్థాల్లో, నీటిపాత్రల్లో ఎక్కడంటే అక్కడే ఉండేవి. దీంతో వారు ఏమీ తినలేక, తాగలేక, కనీసం పడుకోలేక నరక యాతన అనుభవించేవారు. దైవికంగా జరిగిన ఈ శాస్తివల్ల వారి బతుకు దుర్లభమై పోయింది. చివరికి మంచినీరు తాగుదామన్నా అది ఎర్రని రక్తంలా మారిపొయ్యేది. ఆ కాలంలో ముక్కునుండి రక్తం కారే వ్యాధి సర్వత్రా ప్రబలిందని కొంతమంది వ్యాఖ్యానించారు. దైవభీతిని, పాపభీతిని, పరలోక చింతనను, మానవీయ విలువలను వారిలో ప్రోది చేసేనిమిత్తం దైవం ఇలాంటి హెచ్చరికలు, శిక్షలు అవతరింపజేస్తాడు. ప్రస్తుత కోవిడ్‌ 19 కూడా అలాంటి హెచ్చరికల్లో ఒకటి. ఇప్పడు తాజాగా అల్పజీవులైన మిడతల దండు చాలా రాష్ట్రాలకు సవాలు విసురుతోంది. మానవుడు ఇప్పటికైనా మేల్కొని ప్రకృతితో చెలగాటమాడే పనులకు స్వస్తిపలికి, దైవాదేశాల వెలుగులో జీవనం సాగిస్తే, ఇహ పర లోకాల్లో సాఫల్యం సాధించవచ్చు. – ముహమ్మద్‌ ఉస్మాన్‌ ఖాన్‌

మరిన్ని వార్తలు