దేవుని సమన్యాయ పాలనా వ్యవస్థ!!

7 Jun, 2020 00:03 IST|Sakshi

సువార్త

అంతా తప్పుచేసి పట్టుబడి శిక్షకు లోనవుతారు. కాని దానియేలు ప్రార్థన చేసి పట్టుబడ్డాడు, శిక్షగా ‘సింహాలగుహ’ లో వేయబడ్డాడు. దానియేలు, అతని ముగ్గురు యూదుస్నేహితులు, బబులోను సామ్రాజ్యంలోని యూదుబానిసల కుటుంబాలకు చెందిన వారు. కొన్ని వందల మంది అలాంటివాళ్ళున్నా, తాము యూదులమన్న ప్రత్యేకతను మర్చిపోకుండా ఆ నలుగురూ జీవించారు. బబులోను రాజైన నెబుకద్నెజరు సంస్థానంలో 15 –17 ఏళ్ళ వయసులోనే ఉన్నతసేవల కోసం ప్రతిభను బట్టి వాళ్ళు ఎంపికై శిక్షణ పొందారు.

అలా తమ ప్రత్యేకతను కాపాడుకొంటూ అంచెలంచెలుగా ఎదగడానికి దేవుడు వారికి సాయం చేశాడు. ధర్మశాస్త్రానుసారం వాళ్ళు తమ దేవునికే ప్రార్థన చేసేవారు. దానియేలయితే, రాజులు కని మర్చిపోయిన కలల్ని కూడా గుర్తుచేసి మరీ వాటిని విడమర్చి చెప్పేంత ప్రతిభావంతుడయ్యాడు. అలా బబులోను, పర్షియా, ఆ తర్వాత మాదీయుల సంస్థానాల్లో దానియేలు తన ప్రతిభ, సమగ్రత, నమ్మకత్వంతో గవర్నర్‌ స్థాయికి ఎదిగాడు. కాని దానియేలుకు శత్రువులు కూడా అసంఖ్యాకం అయ్యారు.

దానియేలు ప్రతిరోజు యూదు పద్ధతిలో మూడు సార్లు క్రమం తప్పకుండా ప్రార్థన చేసుకుంటాడన్న విషయం తెలిసి, అతని శత్రువులు ముప్పైరోజులపాటు దేశంలో రాజైన దర్యావేషుకు తప్ప మరెవరికీ ప్రార్థన చేయకూడదన్న ఒక ఆజ్ఞను రాజుగారి ద్వారా తయారు చేయించారు. అయినా రాజాజ్ఞను ఉల్లంఘించి, తన ఇంటి కిటికీ తలుపు తెరిచి అందరికీ తెలిసేలా అతను ప్రార్థన చేశాడు. ఫలితంగా ఇష్టం లేకున్నా రాజుగారు దానియేలును సింహాల గుహలో వేశాడు.

విచిత్రమేమిటంటే, ఆకలితో ఉన్న సింహాల మధ్య కూడా దానియేలు హాయిగా నిద్రపోగా, రాజభవనంలో పరుపుల పైన పడుకున్న రాజుగారికి, అతన్ని పట్టించిన శత్రువులకు మాత్రం ఆ రాత్రి నిద్రపట్టని కాళరాత్రే అయ్యింది. మరునాడే, రాజు దానియేలును విడిపించి అతని శత్రువులందరినీ అదే గుహలో వేసి సంహరించాడు. విశ్వాసి ఎక్కడుంటే ఆ ప్రదేశాన్నే దేవుడు తన సన్నిధితో పరలోకంగా మార్చుతాడు. అపాయాలు, సమస్యలు, చిక్కుముడుల మధ్య కూడా విశ్వాసి హృదయంలోనే దేవుడు పరలోకానందపు ఊటలు నింపుతాడు. తాను సంతకం చేసిన ఆజ్ఞకు తానే బందీగా మారేంత బలహీనుడయ్యాడు ఆ రాజు. కాని రాజాజ్ఞలు, లోకాదేశాలకు అతీతమైన దేవుని సమన్యాయ, సమధర్మ పాలనావ్యవస్థలో దేవుడు పరలోకానందాన్ని రాజులకు, బానిసలకు కూడా న్యాయంగా, సమానంగా పంచుతాడు.

దక్షిణాఫ్రికా విమోచనోద్యమం ముగిసి అక్కడ సమన్యాయ ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడుతున్న 1989లో, అక్కడి జులు తెగకు చెందిన రాజు దానికి తీవ్ర వ్యతిరేకతతో ఉన్నాడు. ఎవరు చెప్పినా అతను వినని పరిస్థితుల్లో, బ్రిటిష్‌ ప్రభుత్వం బిషప్‌ టాటూ గారిని ఆయన వద్దకు పంపింది. బిషప్‌ గారు అతని ముందు నిలబడి, ‘నేను బిషప్‌ను, మీరు రాజు గారు. అయితే మిమ్మల్ని, నన్ను కూడా పాలించే అత్యున్నతమైన దేవుని ప్రార్థిద్దాం, మనిద్దరం మోకరిద్దాం, అనగానే, ఆ రాజు సింహాసనం దిగి, మోకరించాడు. బిషప్‌ గారి ప్రతిపాదనకు అంగీకారం కూడా తెలిపాడు. లోకమా? దేవుడా? అన్న మీమాంస ఎదురైతే, దేవుని ఆశ్రయించడమే క్షేమం, వివేకం.  – రెవ. డా. టి.ఎ.ప్రభుకిరణ్‌

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా