దేవుని తీర్పు కోసం సిద్ధపడే తరుణమిది

29 Dec, 2019 01:17 IST|Sakshi

సువార్త

బబులోను రాజైన బెల్షస్సరు రాజవంశీయులైన వెయ్యి మంది అధిపతులకు, తన రాణులకు, ఉపపత్నులకు ఒక రాత్రి గొప్ప విందు చేశాడు. తన రాజధానియైన బబులోను పట్టణమంటే అతనికెంతో అతిశయం!! బబులోను పట్టణం చుట్టూ 350 అడుగుల ఎత్తు, 85 అడుగుల వెడల్పున మహా ప్రాకారముంది. శత్రువుల ఆగమనాన్ని పసిగట్టేందుకు ఆ గోడ మీద 350 చోట్ల కాపలా శిఖరాలున్నాయి. ప్రాకారాన్ని ఆనుకొని పట్టణం చుట్టూ మొసళ్ళు నివసించే నీళ్లతో లోతైన కందకాలున్నాయి. శత్రువు బయటి నుండి ముట్టడి వేసినా కోట లోపల కొన్ని ఏళ్లపాటు సుఖంగా బతికేందుకు అవసరమైనన్ని ధాన్యం, ఆహారం నిల్వలు న్నాయి. అందువల్ల తమ ప్రాణాలకు, భద్రతకు ఏమాత్రం ఢోకా లేదన్న అతివిశ్వాసంతో రాజైన బెల్షస్సరు విందులు వినోదాలతో కాలక్షేపం చేస్తున్నాడు. పైగా యెరూషలేము మహాదేవుని ఆలయం నుండి దోపిడీ చేసి తెచ్చిన బంగారు పాత్రల్లో ద్రాక్షారసం తాగేందుకు పూనుకోవడం అతని అహంకారానికి పరాకాష్ట అయ్యింది.

ఆ రాత్రే ఒక అదృశ్యవ్యక్తి తాలూకు హస్తం అతని ఎదుట గోడమీద ఏదో రాయడం అతనికి కలవరం కలిగించింది. తన వద్దనున్న జ్యోతిష్కులు, గారడీవాళ్ళు, మంత్రగాళ్ళ ద్వారా దాని భావాన్ని తెలుసుకోవడానికి విఫల ప్రయత్నం చేశాడు. చివరికి దానియేలు ప్రవక్త అతనికి దాని గుట్టు విప్పి చెప్పాడు. ‘రాజా, నీ తండ్రి నెబుకద్నెజరు చేసిన తప్పిదాన్నే నీవు కూడా చేస్తున్నావు. నీ తండ్రిని దేవుడు ఎలా శిక్షించాడో అంతా ఎరిగి కూడా నిన్ను నీవు సరిచేసుకోకుండా, నిగ్రహించుకోకుండా పరలోకమందలి దేవుని కన్నా పైగా నిన్ను నీవు హెచ్చించుకున్నావు. అందువల్ల ‘మేనే మేనే టేకేల్‌ ఉఫారసీన్‌’ అని దేవుని హస్తం నిన్ను గురించి దైవభాషలో రాసింది. అంటే దేవుడు నీ విషయం లెక్క చూసి, తన త్రాసులో తూచగా నీ అహంకారం వల్ల నీవు చాలా తక్కువగా తూగావు. అందువల్ల ‘ఇదంతా నాదేనంటూ నీవు విర్రవీగుతున్న నీ రాజ్యాన్నంతా తీసి దేవుడు నీ శత్రువులైన మాదీయులు, పారసీకులకు ఇవ్వబోతున్నాడు’ అని దేవుని తీర్పును అతనికి వెల్లడించాడు.

ఆ రాత్రే అదంతా నెరవేరి, బెల్షస్సరు శత్రువుల చేతిలో చనిపోగా, అతని రాజ్యం శత్రురాజుల చేజిక్కింది. దేవుడెంత న్యాయవంతుడంటే, ముందుగా హెచ్చరించకుండా, పరివర్తన చెందేందుకు సమయమివ్వకుండా ఎవరినీ శిక్షించడు. సమయమిచ్చినా దాన్ని వాడుకొని మారనివారిని దేవుడెట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టడు కూడా. ‘ఎంతోమంది చక్రవర్తులు, మహాపాలకులు కూలిపోయింది శత్రురాజుల చేతిలో కాదు, వాళ్ళు తమ అహంకారానికే బలయ్యారు’ అన్నది చరిత్ర చెప్పే సత్యం!! రాజైన హిజ్కియా కూడా దారి తప్పి పశ్చాత్తా్తపపడితే దేవుడు మరో అవకాశాన్నిచ్చి అతని ఆయువును పెంచాడు. అతని కొడుకు  మనశ్శహే రాజు కూడా తప్పులు చేసినా, తన తండ్రిలాగే తనను తాను సరిదిద్దుకొని మరో అవకాశం పొందాడు.

బబులోను రాజైన బెల్షస్సరు మాత్రం తన తండ్రి నెబుకద్నెజరుకు జరిగిన దాన్నంతా చూసి కూడా గుణపాఠం నేర్చుకోక తన అహంకారానికి, అజ్ఞానానికి బలై భ్రష్టుడయ్యాడు. తన చుట్టూ ఉన్న కోట, తన సైనికులు తనను కాపాడుతారనుకున్నాడు కాని మహాకాశంలో తన సింహాసనాన్ని కలిగి ఉన్న దేవదేవుడు తనను కూడా పాలించే మహాపాలకుడన్న వాస్తవాన్ని మరచిపోయి విచ్చలవిడిగా ప్రవర్తించి, వినాశనాన్ని కొని తెచ్చుకున్నాడు. దేవుడు ఆది నుండీ చెప్పేది అదే!! మనిషి వినాశనం మనిషి చేతుల్లోనే ఉంటుంది. తనను తాను తగ్గించుకొని దేవుణ్ణి ఆశ్రయించిన వాడే ఆ వినాశనం నుండి తప్పించుకోగలడు. దేవుడిచ్చిన పాపక్షమాపణను పొందిన వారే దేవుని తీర్పును తప్పించుకోగలరు.  
–రెవ.డా. టి.ఎ.ప్రభుకిరణ్‌
ఈమెయిల్‌:prabhukirant@gmail.com

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు