మాతా శారదాదేవి

22 Dec, 2019 00:04 IST|Sakshi

గురు సన్నిధి

ప్రాచీన ఆదర్శాలు–ఆధునిక జీవన విధానాలను సమన్వయం చేసుకున్న సరస్వతి ఆమె. ఒకవైపు ఇంటి వ్యవహారాలు చూస్తూ, కుటుంబంలోని ఒడిదుడుకులనే తపస్సుగా స్వీకరించిన సాధారణ గృహిణి ఆమె. బడికి వెళ్ళి పాఠాలు నేర్వలేదు. పుస్తకాలు చదవలేదు. కానీ ఆమెతో మాట్లాడిన గొప్పమేధావులు సైతం ఆమె ఆధ్యాత్మిక జ్ఞానానికి అబ్బురపోయేవారు. ఆవిడే శారదాదేవి. రామకృష్ణ పరమహంస ధర్మపత్ని.
వీరిద్దరిది భౌతికమైన సంబంధం లేని అన్యోన్య దాంపత్యం. తామరాకుపై నీటిబొట్టులా సంసారంలో ఉంటూనే దాని ప్రభావం తమ మీద పడకుండా చూసుకున్నారు వీరిరువురూ. రామకృష్ణులను తన ఆధ్యాత్మిక పురోగతికి సాయపడే గురువుగా శారదాదేవి తలిస్తే, ఆమెను సాక్షాత్తూ కాళీమాతగా భావించేవారు రామకృష్ణులు. రామకృష్ణ పరమహంసను గురువుగా స్వీకరించినవారంతా శారదాదేవిని మాతృమూర్తిగా ప్రేమించారు.

జగమంత కుటుంబం
సాధకుడైన భర్తకు కాళీమాతలా, అతని శిష్యుకు తల్లిలా భాసించిన శారదాదేవి... మాతృమూర్తి అన్న మాటకు మరో నిర్వచనాన్ని ఇచ్చారు. తనకు పిల్లలు లేరనే లోటు లేకుండా శిష్యులనే తన సంతానంగా భావించి వారి ఆలనాపాలన చూసుకునేది శారదాదేవి.. భౌతికంగా రామకృష్ణులు దూరమయ్యాక ఏం చేయాలో, ఎటు వెళ్లాలో తెలియని అయోమయ స్థితిలో ఉన్న శిష్యగణానికి శారదామాత తగిన ధైర్యాన్ని అందించారు. రామకృష్ణుని శిష్యులందరికీ కొత్త ఆశగా చిగురించారు. ఎలాంటి అధ్యాత్మిక సలహాకైనా, సందేహ నివృత్తికైనా శారదాదేవి దగ్గరకి చేరేవారు వారంతా. రామకృష్ణుల సాన్నిహిత్యంతో తనకు కలిగిన యోగానుభవాలను వారికి చెబుతూ ఓపికగా వారి సందేహాలను తీర్చేది శారదాదేవి

అమ్మ నోట మాటలు–ఆణిముత్యాలు
ధ్యానం ఆవశ్యకతను వివరిస్తూ ‘‘క్రమం తప్పక ధ్యానం చేస్తూ ఉంటే మనస్సు నిశ్చలమై ఒక స్థాయికి చేరి, ఇక ధ్యానంతో పనిలేని స్థితికి వస్తారు. తీవ్రమైన గాలులు మేఘాలను చిన్నాభిన్నం చేసినట్టు, భగవంతుడి నామం మనోమాలిన్యాలను తొలగిస్తుంది. అందుకే నామజపం ఒక సాధనగా అభ్యసించాలి’’ అని చెప్పేవారు. అలాగే మీకు మనశ్శాంతి కావాంటే ఎదుటివారి తప్పులు వెతకడం మానండి. మీలోని తప్పులను సరిదిద్దుకోండి. ఎవ్వరూ పరాయివారు కాదు. ప్రపంచమంతా మనదే’’. అంటూ సందేశాన్ని అందించారు.
– అప్పాల శ్యామప్రణీత్‌ శర్మ అవధాని,
వేదపండితులు, (నేడు శారదా దేవి జయంతి)

మరిన్ని వార్తలు