యామునాచార్యుని రాజనీతి

19 Jan, 2020 01:59 IST|Sakshi

నీతి రాజం

యామునాచార్యుడు విశిష్ట అద్వైత సిద్ధాంత ప్రవర్తక ఆచార్యులలో ముఖ్యుడైన నాథమునికి మనుమడు. గొప్ప పండితుడు. చోళదేశంలోని వీరనారాయణపురంలో నివసించేవాడు. తండ్రిపేరు ఈశ్వరముని. యామునాచార్యుడు ఒకసారి తన గురువు దగ్గర చదువుకుంటుండగా, రాజపురోహితుడు అక్కడకు వచ్చి, తనకు చెల్లించవలసిన రుణాన్ని వెంటనే చెల్లించమని లేఖ పంపాడు. గురువు కడు పేదవాడు. విషయం తెలుసుకున్న యామునాచార్యుడు ఆ లేఖను  చింపాడు. మరొక పత్రం తీసుకుని దానిమీద ఒక శ్లోకం రాసి, దూతకి  ఇచ్చి పంపాడు. రాజపురోహితుడు ఆ శ్లోకాన్ని రాజుకు చూపించాడు. రాజు, తన పురోహితునితో శాస్త్రవాదనకు రమ్మని యామునని పిలిపించాడు. ఇరువురి మధ్య వాదోపవాదాలు జరిగాయి.

వాదనలో యామునాచార్యుడు గెలిచాడు. ఇచ్చిన మాట ప్రకారం రాజు తన రాజ్యంలోని అర్ధభాగాన్ని కానుకగా ఇచ్చాడు. అధిక సంపద చేతికి అందటంతో, యామునాచార్యుడు భోగలాలసుడయ్యాడు. అతడిని అర్ధకామాల నుంచి తప్పించి, భగవంతుని వైపు ధ్యాస మళ్లించాలని యామునాచార్యుని తాతగారి ప్రశిష్యుడైన శ్రీరామమిశ్రుడు ఉపాయం ఆలోచించాడు. యామునుడికి ఇష్టమైన ముండ్లముస్తె కూరను ప్రతిరోజూ అందచేయడం ప్రారంభించాడు. ఇలా ఆరుమాసాలు గడిచింది. తరవాత ఒకనాడు యామునాచార్యుడు భోజన సమయానికి ఆ కూర లేకపోవటంతో, వంటవానిని అడిగాడు. అందుకు అతడు, ‘‘ఎవరో ఒక వృద్ధుడు ఆ కూరను ఇన్ని రోజులు తీసుకువచ్చాడు.

ఎందుచేతనో నాలుగు రోజులుగా తీసుకురావట్లేదు’’ అన్నాడు. యామునాచార్యుని ఆజ్ఞ మేరకు శ్రీరామమిశ్రుడు వచ్చి, ‘మీ తాతగారైన నాథముని మీ కోసం ఒక నిక్షేపాన్ని నాకు ఇచ్చి, మీకు అందచేయమన్నారు, మీరు నా వెంట శ్రీరంగానికి రావాలి’ అన్నాడు. యామునాచార్యుడు శ్రీరామమిశ్రుని వెంట శ్రీరంగానికి బయలుదేరాడు. అక్కడకు రాగానే, ‘ఇదే మీ తాతగారు మీకు ఇమ్మని చెప్పిన నిక్షేపం’ అని శ్రీరంగనాథుని రెండు పాదాలను చూపాడు. యామునాచార్యుడికి కళ్లు తెరుచుకున్నాయి. కుమారుడికి రాజ్యం అప్పచెప్పి, రాజనీతి బోధించి, సన్యసించాడు.
(యామునాచార్యుడు బోధించిన రాజనీతి ఇకపై వారం వారం)

మరిన్ని వార్తలు