అర్ధమైంది గురువర్యా...

29 Dec, 2019 02:00 IST|Sakshi

ఇస్లాం వెలుగు

ఓ ధార్మిక గురువుకు ఇద్దరు శిష్యులు. ఒకసారి ఆ  శిష్యులు నమాజుకు బయలుదేరారు.  మార్గమధ్యంలో వారు చూస్తుండగానే ఓ వ్యక్తికి ప్రమాదం జరిగింది. అక్కడ ఆగిపోతే నమాజు సమయం మించిపోతుంది. వదిలేసి వెళ్ళిపోతే అతని ప్రాణాలు పొయ్యే పరిస్థితి. ఇద్దరిలో ఒక యువకుడు దైవకార్యాన్ని ఎట్టిపరిస్థితిలోనూ విడిచిపెట్టకూడదని, తరువాత ఆలోచిద్దామన్నాడు. కాని రెండవ యువకుడు, నమాజును తరువాత చేసుకుందాం... ముందు ఇతడిని వైద్యుడి దగ్గరికి తీసుకు వెళదామన్నాడు. కాని అతను, ‘దైవప్రార్థన తరువాతనే ఏదైనా’ అంటూ స్నేహితుడి స్పందన కోసం కూడా చూడకుండా వెళ్ళిపోయాడు.

రెండో యువకుడు ఆ క్షతగాత్రుణ్ణి దగ్గరిలోని వైద్యుని వద్దకు తీసుకు వెళ్ళాడు. ప్రథమ చికిత్స అందించిన వైద్యుడు, సకాలంలో తీసుకొని రావడం వల్ల ఇతని ప్రాణాలు నిలిచాయని, ఆలస్యమైతే ఇతను ప్రాణాలతో మిగిలేవాడు కాదనీ అన్నాడు. తరువాత ఆ యువకుడు కూడా మసీదుకు చేరుకొని, దైవానికి కృతజ్ఞతాస్తోత్రాలు చెల్లిస్తూ రెండు రకతులు నఫిల్‌ నమాజు, తరువాత ఫర్జ్‌ నమాజు ఆచరించాడు. కాసేపటికి విషయం గురువుకు తెలిసింది. అంతా సావధానంగా విన్న గురువు, మొదటి శిష్యుణ్ణి మందలించాడు. ధర్మాన్ని నువ్వు సరిగ్గా అర్థం చేసుకున్నావని రెండవ శిష్యుణ్ణి ప్రశంసించారు. దీంతో, ‘అదేమిటి గురువర్యా.. జమాత్‌తో నమాజ్‌ ఆచరిస్తే ఎక్కువ పుణ్యం లభిస్తుంది కదా. జమాత్‌ వదలడం పాపం కదా’ అన్నాడు శిష్యుడు.

‘నువ్వన్నది నిజమే.. కాని, ఒక వ్యక్తి ప్రాణాపాయ స్థితిలో ఉంటే, అతణ్ని గాలికి వదిలేసి ప్రార్థనలో లీనమైపోతే దేవుడు ఆ ప్రార్థనను స్వీకరిస్తాడా? ఈనాడు చాలామంది చేస్తున్న తప్పు ఇదే. సామాజిక విషయాలను పట్టించుకోకుండా ఆధ్యాత్మికతలో లీనమైపోతున్నారు. మరికొందరు ప్రాపంచిక విషయాల్లో పడి ధర్మాన్ని పట్టించుకోవడం లేదు. తోటి మానవుల్ని నిర్లక్ష్యం చేసి ఆధ్యాత్మికతలో ఎంతగా మునిగి తేలినా దేవుడు హర్షించడు. తన ఆరాధనలను నెరవేర్చక పోయినా దైవం క్షమిస్తాడు కాని మానవ హక్కుల విషయంలో మాత్రం మన్నించడు. దైవ ప్రసన్నత ద్వారానే ఇహ పరలోకాల్లో సాఫల్యం’ అని చెప్పాడు గురువు. అర్ధమైందన్నట్లు తల పంకించాడు శిష్యుడు.
– ముహమ్మద్‌ ఉస్మాన్‌ ఖాన్‌  

మరిన్ని వార్తలు