స్త్రీని ఉపాసించే సంస్కృతి మనది

15 Dec, 2019 00:02 IST|Sakshi
షణ్ముఖశర్మ

మానవుడిని మాధవుడిగా మార్చే సనాతన ధర్మంలోని గొప్పతనాన్ని సామాన్యుల చెంతకు తీసుకువెళ్లాలి ... తద్వారా సమాజంలో శాంతిని నెలకొల్పాలి అనే లక్ష్యంతో ఆధ్యాత్మిక ప్రవచన జ్ఞానయజ్ఞాన్ని అప్రతిహతంగా కొనసాగిస్తున్నారు ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచకులు సామవేదం షణ్ముఖశర్మ. గుంటూరులో యోగవాశిష్టం పై ప్రవచనం చేస్తున్న సందర్భంగా ‘మానవుడు ఆధ్యాత్మిక మార్గంలో ఎందుకు నడవాలి’, ‘పురాణాలలో స్త్రీమూర్తికి ఇచ్చిన స్థానం ఏంటి’ తదితర సందేహాలకు వారు ఇచ్చిన సమాధానాలు సాక్షికి ప్రత్యేకం.

ఆధ్యాత్మికం అంటే ?
శరీరం, ప్రాణం, మనస్సే కాకుండా ఆత్మ అనే వస్తువు ఉంది అనే జ్ఞానానికే ఆధ్యాత్మికం అని పేరు. ఆత్మ అనేది ఎప్పుడూ నశించనిది, సత్యమైనది. దాని గురించి తెలుసుకున్నవాడు భౌతిక జీవితంలో ఆనందంగా, శాంతంగా జీవించగలుగుతాడు. సైన్సు భౌతికవిజ్ఞానాన్నే చెబుతుంది. పరా విద్య ఆధ్యాత్మికం, పరమాత్మ గురించి చెబుతుంది. మనిషిలో వివేకాన్ని రగిల్చి అశాశ్వతమైన భౌతిక సుఖాల కోసం అవినీతికి, అధర్మానికి పాల్పడకుండా కాపాడే శక్తి ఆధ్యాత్మిక విజ్ఞానానికే ఉంది.

ఆధ్యాత్మిక మార్గం అంటే ?
భౌతికప్రపంచంలో ధర్మపరమైన అనుబంధం ఉండాలి. అంతరంగంలో ఆత్మస్వరూపుడైన భగవంతుడున్నాడనే స్పృహ ఉండాలి. ఆ స్పృహæతో భౌతిక జీవిత ధర్మాన్ని పాటించినట్లయితే అది వ్యక్తికి, సమాజానికి క్షేమం. సైన్సు సాధించలేనిది ఆధ్యాత్మికత సాధించగలదు. శరీరం పోయినా నువ్వు ఉంటావు అనే భరోసా సైన్సు ఇవ్వలేదు. ఆధ్యాత్మిక శాస్త్రం ఇస్తుంది. తప్పు, ఒప్పు గమనించే పరమాత్మ ఒకరు ఉన్నారని తెలిసాక తప్పు చేయడానికి వెనుకాడతాము. మంచి చేయడానికే ప్రయత్నిస్తాము. ఆధ్యాత్మిక మార్గం అధర్మాన్ని చేయనివ్వదు. ఒక ఓర్పును,ౖ ధైర్యాన్ని ఇస్తుంది. ఆధ్యాత్మికం జీవితానికి అతీతమైనది కాదు. సరైన జీవితం ఆధ్యాత్మికం.

భగవంతుడు  అన్నిటికీ ఆతీతుడని ఋషిప్రోక్తం పురాణ కథలలో దేవతలు మానవుల్లా కోపతాపాలకు, రాగద్వేషాలకు గురయినట్లు కనబడుతుంది. దీనిని అర్థం చేసుకోవడం ఎలా  ?
పురాణాలను అర్థం చేసుకోవడానికి ప్రత్యేక అధ్యయనం అవసరం. మామూలు కథలలాంటివి కాదు. వాటిలో అనేక సంకేతాలు, సందేశాలు ఉంటాయి. యోగశాస్త్రం మంత్రశాస్త్రం, ధర్మశాస్త్రం, జ్యోతిశ్శాస్త్రం, తత్వశాస్త్రం, మనస్తత్వ శాస్త్రం కథల రూపంలో ఇమిడి ఉంటాయి. శివుడు, విష్ణువు సాక్షాత్తు పరమేశ్వర స్వరూపం. వారి భావాలు మనలా ఉండటాన్ని లీల అంటారు. మనలా ప్రవర్తించారనడం సరికాదు. మనకు అర్థమయ్యేలా ఋషులు బోధించారు. మానవుడి స్థాయిలో జరిగితే కర్మ అంటారు.

భగవంతుడి స్థాయిలో జరిగితే లీల అని చెప్పుకుంటాం. పురాణాలలో భగవంతుని లీలలు చెప్పబడ్డాయి. లీలల్లో సందేశాలు ఉంటాయి. జ్ఞానం ఉంటుంది. ఆ జ్ఞానం మనకు అర్థమయ్యేలా చెప్పడం కోసం ఋషులు మనకు కథల రూపంలో అందించారు. కోపాలు, తాపాలు, భావాలు అన్ని లోకాల్లో ఉంటాయి. పశువులు, మానవులు, దేవతలు వారి వారి స్థాయికి తగ్గట్టుగా ఆ భావాలు, స్పందనలు వ్యక్తమవుతాయి. దేవతలకు కలిగే భావాలు, స్పందనలు లోకక్షేమానికి దారితీస్తాయి. అంతుపట్టని భగవత్‌ తత్వం కూడా ఇలాంటి కథల వలన సామాన్య మానవుడికి చేరువ అవుతుంది.

పురాణాలలో స్త్రీకి తక్కువ స్థానం ఇచ్చారని కొందరు విమర్శిస్తారు మీలాంటి ప్రవచకులు గొప్పస్థానాన్ని ఇచ్చారని చెబుతారు  ఏది సత్యం ?
భారతీయ సంస్కృతిలో స్త్రీకి ప్రాధాన్యం ఎక్కువగా ఉంది. ఇంచుమించు అన్ని పురాణాల్లో స్త్రీ పాత్రలు గొప్పగా చూపబడ్డాయి. వేదాలలో ఋషులు ఎలా ఉన్నారో, ఋషికలు అలాగే ఉన్నారు. బ్రహ్మ వాదులు ఎలా ఉన్నారో బ్రహ్మవాదినిలు ఉన్నారు. తత్వశాస్త్రంలోనూ గొప్ప స్త్రీ మూర్తులు ఉన్నారు. రాజ్యాలను నడిపేవారు, గృహసామ్రాజ్యం నడిపే పాత్రలు కోకొల్లలు కనపడతాయి. దత్త చరిత్రలో–మదాలస, త్రిపురరహస్యంలో–హేమలేఖ, యోగవాశిష్టంలో – పద్మలీల, మార్కండేయ పురాణంలో– రాజ్యాలేలిన రాణుల చరిత్ర కనపడతాయి. ప్రపంచాన్ని నడిపే శక్తిగా స్త్రీ రూపాన్ని ఉపాసన చేస్తున్నాము. స్వామి వివేకానంద స్త్రీని మాతృమూర్తిగా గౌరవించడం మన సాంప్రదాయమని బోధించారు. పురాణాలలో, వేదాలలో, ధర్మశాస్త్రంలో స్త్రీకి ఒక గౌరవస్థానం రక్షణస్థానం ఇవ్వబడ్డట్లుగా స్పష్టంగా కనపడుతుంది.

ప్రశ్న భక్తులకు మీ సందేశం ?
మనకున్న సంస్కృతి యుగాలనాటిది. మనిషికి కావలసిన ఇహపరమైన అన్ని విషయాలు మన గ్రంథాలలో చెప్పబడ్డాయి. అనేక శాస్త్రాల విజ్ఞాన సమన్వయం హిందూ ధర్మశాస్త్రాలలో కనపడుతుంది. వాటి ఎడల ముందుగా గౌరవభావం ఏర్పడితే తరువాత  తెలుసుకోవడం జరుగుతుంది. మనిషి బౌద్ధికంగా, ఆధ్యాత్మికంగా ఎదగడానికి కావాల్సిన పూర్ణజ్ఞానం మహర్షులు మనకు ఇచ్చారు. దీనిని మతదృష్టితో కాకుండా విజ్ఞానదృష్టితో గ్రహిస్తూ దానిని ఆచరించే ప్రయత్నం చేయాలి. భారతీయులందరికీ తమ ధర్మంపై, విజ్ఞానంపై భక్తి, గౌరవ భావం ఏర్పడాలి. ఎవరి ధర్మాన్ని వారు ఆచరిస్తూ ఇతరుల ధర్మాన్ని గౌరవించాలి. ఇంకొకరి ధర్మాన్ని నిందించడం వ్యక్తిత్వ లోపమని తెలుసుకోవాలి’’     అంటూ అనుగ్రహ భాషణ చేశారు సామవేదం షణ్ముఖ శర్మ.                              
– కోలుకొండ శ్రీకర్, సాక్షి, గుంటూరు ఈస్ట్‌

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు