సంతోషం నీలోనే ఉంది

15 Sep, 2019 05:01 IST|Sakshi

తాత్వికథ

ఆ రాజుగారికి అన్నీ వున్నాయి. కాని ఎప్పుడూ సంతోషం కోసం వెతుకులాట. రాజుగారిలో అసంతృప్తి, విచారం అణువణువునా కనబడుతుంది. రాజ వైద్యులుగాని, మహామంత్రిగాని, మంత్రులుగాని, సామంతులు గాని, ప్రజలు గాని, పండితులు గాని రాజుగారి సుఖం కోసం సూచనలివ్వలేక పోతున్నారు. రాజ్యమంతా చాటింపు వేయించారు. రాజుగారి అసంతోషానికి కారణం చెప్పాలని, లేదా సుఖం ఎలా కలుగుతుందో సూచించాలని. ఒకరోజు ఒక పండితులవారొచ్చి ‘‘రాజా! మీకు సుఖం కలిగే మార్గం చెబుతాను. మీరు మన రాజ్యంలో ఎవరయినా వ్యక్తి ‘నేను సుఖంగా వున్నాను’ అంటే అతని నుంచి, అతను వాడే ఏదయినా వస్తువును తీసుకురమ్మనండి. ఆ వస్తువును మీరు ధరిస్తే మీకు సంతోషం కలుగుతుంది’’ అని చెప్పారు. ఈ సలహా రాజుగారికి మంచిగా అనిపించి, రాజ్యంలో సుఖంగా వున్నారనుకుంటున్న వ్యక్తుల వద్దకు మంత్రిని, దూతలను పంపించారు. వారు బాగా ప్రసిద్ధి చెందిన వ్యాపారస్తుని వద్దకు వెళ్ళి అడిగితే అతనన్నాడు ‘‘నా దగ్గర చాలా వస్తువులున్నాయి.

కావలసినవి పట్టకెళ్ళండి. కాని నేను మాత్రం సుఖంగా లేను. నా వ్యాపారమింకా దశదిశలా పోలేదు, అన్యుల వ్యాపార వస్తువులు అక్కడక్కడ కనబడుతున్నాయి. అవి ఉండకూడదు. అంతవరకు నాకు సుఖముండదు’’ అన్నాడు. ప్రముఖ కళాకారుని వద్దకు వెళితే అతనన్నాడు ‘‘నాకు చాలా ప్రాచుర్యముంది. వేలాదిమంది అభిమానులున్నారు. కీర్తి, సంపదలున్నాయి కాని సుఖం లేదు. ఎందుకంటే దేశంలో నేనొక్కడనే కాదు, ఇంకా ఇద్దరు ముగ్గురు కళాకారులున్నారు. నేనొక్కడినే వుండాలి. నన్నొక్కడినే ప్రజలాదరించాలి. అంతవరకు నాకు సంతోషముండ దు’’ అన్నాడు. ఇలా దేశంలో ఎవరిని కదిలించినా, ఏదోఒక అసంతృప్తితో వున్నవారే తప్పిస్తే, సుఖంగా ఉన్నట్టు చెప్పలేక పోతున్నారు. దేశమంతా తిరుగుతూ ఒకరోజు అలసిపోయి మంత్రిగారు, సైనికులు సేదదీరుతున్నారు. దూరంగా బండి దగ్గర కూర్చొని, ఒకతను నేలపై ఆకుపరుచుకొని అందులో అన్నం తింటూ ‘‘నేను సుఖంగా ఉన్నాను, నాకు కోరికలు లేవు, నాకన్నీ వున్నాయి, నాకింకేమీ అక్కరలేదు అనుకుంటూ, పాడుకుంటూ పరిసరాలను మరచి తన్మయత్వంతో వున్నాడు.

ఆ పాట విన్న మంత్రిగారు, సైనికులు అతనివద్దకు వెళ్ళి ‘‘నువ్వు సంతోషంగా వున్నానని పాడుకుంటున్నావు. నిజంగానే సుఖంగా వుంటే నువ్వుపయోగించే ఏ వస్తువైనా ఇవ్వమన్నారు. ‘‘నేను సంతోషంగానే ఉన్నాను కానీ, క్షమించండి మహారాజా! నా దగ్గరేమీలేదు, నే కట్టుకున్న గోచీగుడ్డ తప్ప. అసలు సుఖానికి, అన్ని సౌకర్యాలు కలిగివుండడానికి సంబంధమేంటి?’’ అని ఎదురు ప్రశ్న వేసాడు. ‘‘అదంతా రాజుగారు చెబుతారు గానీ, నువ్వు మా వెంట రావాలి’’ అని వారు ఎంత చెప్పినా రాను పొమ్మన్నాడు. అవసరమనుకుంటే రాజును తన వద్దకు రమ్మన్నాడు. చేసేదిలేక రాజుగారు మంది మార్బలంతో, సైనికులతో, బహుమతులతో వచ్చారు. అప్పటికి రైతు అలసి నిద్రపోతున్నాడు. మంత్రిగారు రాజుగారొచ్చిన విషయం చెప్పాడు. ‘‘నేనిప్పుడు నిద్రపోతున్నాను, రేపు రమ్మన్నాడు. రాజుగారు వెనుదిరిగి పోయి మరునాడు సాధారణ పౌరునిలాగ వచ్చి రైతు ఎదురుగా చేతులు కట్టుకొని నిలబడి ‘‘స్వామీ’’ అన్నాడు.

‘‘రాజా! వచ్చావా? కూర్చో. ఇప్పుడు చెప్పు నీ సమస్యేంటి?’’ అన్నాడు. ‘‘స్వామీ నాకన్నీ వున్నాయి కాని సుఖం లేదు. అది ఎక్కడ, ఎలా దొరుకుతుందో చెప్పమన్నాడు రాజు.  ‘‘రాజా! సుఖాలకు కారకాలు వస్తువులు కాదు. సంపదలు, ధనధాన్యాలు కావు. సుఖాన్నిచ్చేది ఆత్మ. ఎవరు తనలోనున్న ఆత్మను తెలుసుకుంటారో వారికి బయటి వస్తువులతో పనేముంటుంది? ఆనందం, సుఖం ఆత్మకు సంబంధించినది. మనిషి తనకోసం, తన సుఖంకోసం ఆలోచిస్తాడు. వేటివల్ల తనకు సుఖం కలుగుతుందో వాటికోసం వెంపర్లాడుతాడు. అవి అశాశ్వితాలు. ఆ సుఖం ఆ వస్తువున్నంత వరకే. అది శాశ్వతం కాదు. శాశ్వత సుఖం ఆత్మజ్ఞానంలోనే వుంది. ఆ ఆత్మజ్ఞానం నీలోనే ఉంది. అదే శాశ్విత సుఖం’’ అన్నాడు బండి తోలుకునే అతను. రాజు ముఖం అలౌకికానందంతో తేజోవంతమైంది.
– విశ్వేశ్వరవర్మ భూపతిరాజు

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు