దుఃఖించువారు ధన్యులు

16 Apr, 2015 23:33 IST|Sakshi
దుఃఖించువారు ధన్యులు

ధన్యత
 
యేసు చెప్పిన రెండవ ధన్యత, ‘దుఃఖపడువారు ధన్యులు; వారు ఓదార్చబడుదురు’.  క్రీస్తు చెప్పిన ధన్యతలు దేవుని రాజ్యపౌరుల లక్షణాలను సూచిస్తున్నాయి. ఈ లక్షణాలు ఇహలోక సంబంధమైన జీవితానికి భిన్నమైనవి. దుఃఖించువారిని ధన్యులు అనం. కాని ప్రభువు వారిని ధన్యులుగా ఎంచుతున్నాడు. ఎందుకంటే, మొదటి ధన్యత మానవులందరినీ దేవుని దృష్టిలో సమానం చేస్తుంది. ఆయన రాజ్యంలో ధనికులు, దరిద్రులు; జ్ఞానులు, అజ్ఞానులు, బలవంతులు, బలహీనులు అని ఏ భేదం లేదు. మత, కుల, వర్గ, వర్ణ భేదాలూ లేవు. ఆయన దృష్టిలో అందరూ అయోగ్యులే, పాపులే కనుక దేవుని మహిమకు యోగ్యులు కాలేరని బైబిల్ చెబుతోంది. దీన్ని గుర్తించి, దేవుని సన్నిధిలో దీనపరుచుకొన్నవారే దేవుని రాజ్యవారసులవుతారు.

దుఃఖపడువారు ధన్యులని యేసు ఎందుకంటున్నాడు? వారు తమను తాము తగ్గించుకొని దేవుని సన్నిధిలో దుఃఖపడతారు. వారి దుఃఖం తమ ఆత్మీయ పరిస్థితిని బట్టి కనబరిచే ఆవేదన. వీరు సంపదలు, పేరు ప్రఖ్యాతులు, సుఖసౌఖ్యాల కొరకు దుఃఖించరు. తమ భద్రత, గుర్తింపు  లేక ఇహలోక సంబంధమైన వాటి కొరకు కూడ దుఃఖించరు. వీరి దుఃఖం దైవ సంబంధమైనది. దీన్ని గురించి బైబిల్‌లో ఇలా చెప్పబడింది. ‘‘దైవ చిత్తానుసారమైన దుఃఖం రక్షణార్థమైన మారుమనస్సును కలుగజేయును. అయితే, లోక సంబంధమైన దుఃఖం మరణాన్ని కలుగజేయును. మీరు దేవుని చిత్తప్రకారం పొందిన ఈ దుఃఖం ఎట్టి జాగ్రత్తను, ఎట్టి దోష నివారణకైన ప్రతివాదమును, ఎట్టి ఆగ్రహమును, ఎట్టి భయమును, ఎట్టి అభిలాషను, ఎట్టి ఆసక్తిని, ఎట్టి ప్రతిదండనను మీలో పుట్టించెనో చూడుడి’’ (2 కొరింథీ 7:10-11). ఇటువంటి దుఃఖం జీవితాలను పరిశుభ్రపరుస్తుంది. పాపాన్ని గూర్చి భయం పుట్టిస్తుంది. అహంకారాన్ని, గర్వాన్నీ తొలగించి, పశ్చాత్తాపాన్నీ, హృదయశుద్ధినీ కలిగిస్తుంది.

హృదయంలో మృదుత్వాన్ని, సాత్వీకమును పుట్టిస్తుంది. ఈ దుఃఖించు ధన్యులు తమకొరకు తాము దుఃఖించడమే కాక... తమ కుటుంబం, సమాజం, దేశం, వారి ప్రజల కొరకు దేవుని సన్నిధిలో దుఃఖిస్తారు. లోకంలోని చెడు, దుర్మార్గత, విభేదాలు, హింస, బలాత్కారాల గూర్చి దుఃఖిస్తారు. ఇటువంటి దుఃఖం వారి జీవితాలకు మాత్రమే కాక, సమాజానికి కూడ అవసరం. వీరు దేవుని హృదయానుసారులు. దేవుని వలె ప్రేమిస్తారు, దేవునివలె చూస్తారు. అందుచేత, దేవుడు వేటి కొరకు బాధపడతాడో వాటి కొరకు వీరు కూడ దుఃఖిస్తారు. అందుకే, దేవుని వలన ఓదార్పు పొందుతారు. ఇది దేవుని రాజ్యవారసుల రెండవ లక్షణం. ఇట్టివారి అవసరత మన సమాజంలో ఎంతో ఉంది.
 - ఇనాక్ ఎర్రా

మరిన్ని వార్తలు