బీపీఏ రసాయనంతో మధుమేహం?

19 Sep, 2018 00:06 IST|Sakshi

మధుమేహం వచ్చేందుకు మన జీవనశైలి కారణమని కొందరంటారు.. ఊబకాయమని ఇంకొందరు.. వారసత్వమని మరికొందరు అంటూంటారు. ఇవన్నీ నిజమే. కాకపోతే యూనివర్సిటీ ఆఫ్‌ మిసోరీ శాస్త్రవేత్తల తాజా పరిశోధన పుణ్యమా అని ఇప్పుడు ఈ జాబితాలోకి ఇంకోటి వచ్చి చేరుతోంది. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు చాలా క్షేమకరం అని చెప్పిన ‘బిస్‌ఫెనాల్‌ – ఏ’ (బీపీఏ) అనే రసాయనం ఇన్సులిన్‌ విడుదలను నియంత్రిస్తూంటుందని వీరు అంటున్నారు.

ప్లాస్టిక్‌తోపాటు కొన్ని ఇతర పదార్థాల్లోనూ వాడే ఈ రసాయనం జీర్ణక్రియలను తీవ్రంగా ప్రభావితం చేస్తుందని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త ఫెడ్రిక్‌ వోమ్‌ సాల్‌ తెలిపారు. ఎలుకలతోపాటు, మనుషుల కాలేయ కణాలపై తాము ప్రయోగాలు చేశామని, గ్లూకోజ్‌ సమక్షంలో బీపీఏ రసాయనం తక్కువ స్థాయిలో ఉన్నా కూడా ఇన్సులిన్‌ మోతాదుల్లో తేడాలు వచ్చినట్లు గుర్తించామని వివరించారు. ఇన్సులిన్‌ తగ్గిపోతే.. రక్తంలోని గ్లూకోజ్‌ బయటకు వెళ్లిపోదు. దీర్ఘకాలంలో ఈ పరిస్థితి మధుమేహానికి దారితీస్తుందన్నది తెలిసిందే. మధుమేహం విషయంలో బీపీఏ ప్రభావంపై ఒక అధ్యయనం జరగడం ఇదే తొలిసారి అని.. మరిన్ని పరిశోధనలు చేయడం ద్వారా ఫలితాలను రూఢీ చేసుకోవాల్సి ఉంటుందని ఆయన వివరించారు. 

మరిన్ని వార్తలు