‘విటమిన్‌ – డి’ తో మధుమేహ నివారణ!

31 Jan, 2019 00:43 IST|Sakshi

సూర్యుడి నుంచి ఉచితంగా అందే విటమిన్‌ – డి శరీరానికి చేసే ఉపయోగాలు ఎన్నో. బ్రెజిల్‌లోని ద నార్త్‌ అమెరికన్‌ మెనోపాజ్‌ సొసైటీ శాస్త్రవేత్తలు చేసిన తాజా పరిశోధనలు, విటమిన్‌ – డి ద్వారా మధుమేహం రాకుండా చూసుకోవచ్చు అని చెబుతున్నాయి! కొన్ని ఇతర పరిశోధనలు కూడా విటమిన్‌ – డి ద్వారా రక్తంలోని గ్లూకోజ్‌ మోతాదులను నియంత్రించుకోవచ్చునని చెబుతూండటం విశేషం. విటమిన్‌ – డి లేమి రక్తంలోని గ్లూకోజ్‌ మోతాదులపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసుకునేందుకు బ్రెజిల్‌ శాస్త్రవేత్తలు దాదాపు 680 మంది మహిళలపై పరిశోధన చేశారు.

దాదాపు 34 శాతం మంది డి – విటమిన్‌ను వాడుతూండగా.. వారిలో గ్లూకోజ్‌ మోతాదులు తగు నియంత్రణలో ఉన్నట్లు తెలిసింది. మాత్రల రూపంలో కాకుండా.. అప్పుడప్పుడూ ఎండలో గడిపిన వాళ్లలోనూ ఇవే రకమైన ఫలితాలు కనిపించాయని ఈ పరిశోధనలో పాల్గొన్న శాస్త్రవేత్త డాక్టర్‌ జో ఆన్‌ పింకెర్టన్‌ తెలిపారు. విటమిన్‌ – డి తక్కువగా ఉంటే రక్తంలో గ్లూకోజ్‌ మోతాదులు ఎక్కువగా ఉన్నట్లు తమ అధ్యయనం ద్వారా తేలిందని చెప్పారు. మరికొన్ని విస్తృత పరిశోధనల ద్వారా ఈ ఫలితాలను నిర్ధారించుకుంటే మధుమేహ నియంత్రణకు చౌకైన కొత్తమార్గం లభిస్తుందని వివరించారు.  

మరిన్ని వార్తలు