డయాబెటిక్‌ కౌన్సెలింగ్‌

23 Apr, 2018 00:32 IST|Sakshi

ఇన్సులిన్‌ను ట్యాబ్లెట్ల రూపంలో ఇవ్వలేమా?
మనం డయాబెటిస్‌ను మందులు లేకుండానే నియంత్రించలేమా? ఇన్సులిన్‌ ఇంజెక్షన్ల రూపంలో కాకుండా ట్యాబ్లెట్ల రూపంలో దొరికే అవకాశం ఉందా? దయచేసి వివరించండి. – అరవింద, నెల్లూరు  
డయాబెటిస్‌ (టైప్‌–2) తొలిదశల్లో అంటే ప్రీ–డయాబెటిక్‌ స్టేజ్‌లో దీన్ని క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, మంచి ఆహార నియమాలు పాటించడం (అంటే కార్బోహైడ్రేట్స్‌ (పిండిపదార్థాలు) తక్కువగా ఉండటంతోపాటు అందులో కొవ్వులు, ప్రొటీన్ల పాళ్లు ఎంత ఉండాలో అంతే ఉండేలా ఆహారం తీసుకోవడం) వంటి చర్యల ద్వారా డయాబెటిస్‌ను సాధ్యమైనంత ఆలస్యం చేయవచ్చు.

ఇలా క్రమం తప్పకుండా వ్యాయామం, మంచి ఆహారనియమాలు, ఆరోగ్యకరమైన జీవనశైలితోనూ రక్తంలోని చక్కెరపాళ్లు అదుపులోకి రాకపోతే మాత్రం తప్పనిసరిగా డయాబెటిస్‌కు మందులు వాడాల్సిందే. మందులు వాడటం మొదలుపెట్టాక కూడా వ్యాయామం, ఆహార నియమాలు పాటించాల్సిందే. ఇక మీ రెండో ప్రశ్నకు సమాధానం ఏమిటంటే... ప్రపంచంలో ఇప్పటివరకూ ఎక్కడ కూడా ఇన్సులిన్‌ ట్యాబ్లెట్ల రూపంలో అందుబాటులో లేదు. అయితే ఇంజెక్షన్ల ద్వారా కాకుండా టాబ్లెట్ల ద్వారా ఇన్సులిన్‌ అందించడానికి పరిశోధనలు మాత్రం ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా జరుగుతున్నాయి.


షుగర్‌ తగ్గడం వల్ల కూడాసమస్య వస్తుందా?
మా అమ్మగారి వయసు 64 ఏళ్లు. చాలా రోజులుగా ఆమె డయాబెటిస్‌తో బాధపడుతున్నారు. రోజూ క్రమం తప్పకుండా టాబ్లెట్లు తీసుకుంటారు. ఒకరోజు అకస్మాత్తుగా స్పృహతప్పిపడిపోతే హాస్పిటల్‌కు తీసుకెళ్లాం. అక్కడ డాక్టర్లు ఆమెను పరీక్షించి రక్తంలో షుగర్‌ పాళ్లు తగ్గాయని చెప్పారు. షుగర్‌ పెరిగితే కదా ప్రమాదం... ఇలా షుగర్‌ తగ్గడం వల్ల కూడా ప్రమాదాలు ఉంటాయా? – సందీప్, విశాఖపట్నం
ఒక్కోసారి పెద్ద వయసు వాళ్లు తాము తినాల్సిన ఆహారం తినరు. కానీ తాము వాడాల్సిన చక్కెరను నియంత్రించే మాత్రలు మోతాదు కంటే ఎక్కువ తీసుకుంటారు. అలాంటప్పుడు వాళ్ల రక్తంలో ఉండాల్సిన చక్కెర ఉండాల్సిన మోతాదు కంటే తక్కువకు పడిపోవచ్చు. అలా చక్కెరపాళ్లు చాలా ఎక్కువగా పడిపోవడాన్ని వైద్యపరిభాషలో హైపోగ్లైసీమియా అంటారు.

దీనివల్ల వృద్ధులైన రోగుల్లో (వణుకు, చెమటలు పట్టడం వంటి లక్షణాలుకు బదులుగా) నరాలకు సంబంధించిన లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి. అంటే నిద్రమత్తుగా ఉన్నట్లుండటం, బలహీనత, భ్రాంతులు, అయోమయం వంటివి. ఆ వయసువారికి మత్తుగా జోగుతుండటం వల్ల పడిపోయి ఎముకలు విరిగిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఇలాంటి సమయంలో వారిని తక్షణం ఆసుపత్రికి తరలించి చికిత్స చేయాలి.

 నైట్‌డ్యూటీలు చేస్తే డయాబెటిస్‌ వస్తుందా?
నా వయసు 31 ఏళ్లు. నేను నెలలో ఒకటీ మూడు వారాలు డే–డ్యూటీలు, రెండూ, నాలుగు వారాలు నైట్‌ డ్యూటీలు... ఇలా మార్చిమార్చి డ్యూటీలు చేయాల్సి ఉంటుంది. కాస్త యంగ్‌ పర్సన్స్‌ కావడంతో ఎవరైనా పెద్ద వయసు వాళ్లు డ్యూటీలకు రాకపోతే ఆ నైట్‌ డ్యూటీలు కూడా మాకే వేస్తారు. పరీక్షలు చేయించుకుంటే నాకు డయాబెటిస్‌ బార్డర్‌లైన్‌లో ఉందని తేలింది. రక్తపరీక్షలు చేయించినప్పటి నుంచి నాకు డయాబెటిస్‌ చాలా త్వరగా వచ్చేస్తుందేమోనని ఆందోళనగా ఉంది. డయాబెటిస్‌ రాకుండా ఉండటానికి జాగ్రత్తలు చెప్పండి. – మనీష్‌కుమార్, హైదరాబాద్‌
వృత్తిపరంగా కంటినిండా నిద్రలేకపోవడం, ఒత్తిడి వల్ల నిద్రపట్టకపోవడం డయాబెటిస్‌ రావడాన్ని వేగవంతం చేస్తే చేయవచ్చు. కానీ కేవలం నైట్‌ డ్యూటీస్‌ వల్లనే డయాబెటిస్‌ రాదు. అయితే డయాబెటిస్‌ రావడం అనేది చాలా అంశాలపై ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా మీ తల్లిదండ్రుల్లోగానీ, మీ వంశంలో ఎవరికైనా డయాబెటిస్‌ ఉందా అన్న అంశం మీద ఆధారపడి, జన్యుపరంగా డయాబెటిస్‌ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీరు ఎక్కువగా నైట్‌డ్యూటీలు చేస్తానని తెలిపారు. అయితే మీరు పగలు పడుకోవడం, రాత్రిళ్లు మేల్కొంటూ ఉండటం వల్ల కొన్ని రకాల ఇతర ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది.

ఇక రక్తపరీక్షలో బార్డర్‌లైన్‌ డయాబెటిస్‌ అని వచ్చింది కాబట్టి డయాబెటిస్‌ వచ్చే అవకాశాలు ఎక్కువ. అయితే ఆరోగ్యకరమైన మీ జీవనశైలి మార్పులతో మీరు మీ డయాబెటిస్‌ వచ్చే అవకాశాలను సాధ్యమైనంత ఆలస్యం చేయవచ్చు. ఇందుకోసం మీరు రోజూ కనీసం అరగంట పాటు వ్యాయామం లేదా వాకింగ్‌ తప్పనిసరిగా చేయాలి. స్వీట్లు, పిజ్జాలు, బర్గర్లు వంటి అధిక క్యాలరీలు ఉండే ఆహారానికి దూరంగా ఉండాలి. ప్రతి కొద్దిగంటల తర్వాత ఏదో ఒకటి తీసుకుంటూ ఉండాలి. ఆహారంలో తాజా ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలి.

పీచు ఎక్కువగా ఉండేముడిబియ్యం, కాయధాన్యాలు ఎక్కువగా తీసుకోవాలి. పొగతాగే అలవాటు ఉంటే వెంటనే మానేయాలి. నైట్‌డ్యూటీ ముగించుకొని ఇంటికి వెళ్లే సమయంలో కాఫీలు, టీలు తాగవద్దు. కచ్చితంగా భోజనం వేళకు భోజనం చేయడం, కొద్ది మోతాదుల్లో ఎక్కువసార్లు భోజనం చేయడం వంటి ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు చేసుకోండి. మీ బరువును అదుపులో పెట్టుకోండి. ఇలాంటి జీవనశైలి మార్పులు చేసుకుంటే డయాబెటిస్‌ను సాధ్యమైనంత ఎక్కువగా నివారించవచ్చు. మీ కుటుంబంలో ఎవరికైనా డయాబెటిస్‌ ఉంటే మీరు మరింత జాగ్రత్తగా ఉండాలి.


- డాక్టర్‌ ఎమ్‌. గోవర్ధన్‌ ,సీనియర్‌ ఫిజీషియన్, కేర్‌ హాస్పిటల్స్, నాంపల్లి, హైదరాబాద్‌

మరిన్ని వార్తలు