అల్జైమర్స్‌ను ఆలస్యం చేసే డీబీఎస్

27 Jan, 2014 22:47 IST|Sakshi
అల్జైమర్స్‌ను ఆలస్యం చేసే డీబీఎస్

అల్జైమర్స్‌ను మరింత ఆలస్యం చేసే కొత్త ప్రక్రియ త్వరలోనే అందుబాటులోకి రానుంది. గుండెలో పేస్ మేకర్ పెట్టినట్లే మెదడులోనూ అమర్చి... అల్జైమర్స్ కారణంగా వచ్చే మతిమరపును బాగా ఆలస్యం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ దిశగా ఒహయో స్టేట్ వెక్స్‌నర్ మెడికల్ సెంటర్ వైద్య పరిశోధకులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.
 
పెద్దయ్యాక నేర్చుకున్న అనేక అంశాలు అల్జైమర్స్ వ్యాధిగ్రస్తుల్లో మరపునకు వస్తాయి. విచిత్రం ఏమిటంటే... అల్జైమర్స్‌తో వచ్చే మరపులో పూర్తి కాన్‌సెప్ట్‌నే  మరచిపోతారు. ఉదాహరణకు అగ్గిపెట్టెను మరవడం మామూలే. కానీ మంటనే మరచిపోవడం జరిగిందంటే అది అల్జైమర్స్ మరుపు అన్నమాట. వృద్ధాప్యంలో వచ్చే ఈ జబ్బు వల్ల అనర్థాలేన్నో. ఈ వ్యాధి వచ్చిన రోగుల్లో మతిమరపు రావడాన్ని చిన్న చిన్న ఎలక్రిక్ తరంగాలతో ఇచ్చే షాక్‌లతో వీలైనంత ఆలస్యం చేసే ప్రక్రియపై పరిశోధనలు ముమ్మరంగా సాగుతున్నాయి.

‘డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్’ (డీబీఎస్) అని పిలిచే ఈ ప్రక్రియలో విద్యుత్ తరంగాలు మెదడులోని విద్యుత్ సర్క్యుట్స్‌పై పనిచేస్తూ వాటిని సాధారణంగా ఉంచడానికి ప్రయత్నిస్తుంటాయి. దీనివల్ల మెదడులోని నరాల నెట్‌వర్క్ (న్యూరల్ నెట్‌వర్క్) ఎప్పుడూ నార్మల్‌గా ఉంచడానికి ప్రయత్నిస్తాయి. ఫలితంగా అల్జైమర్స్ కారణంగా వచ్చే మతిమరపు బాగా ఆలస్యంగా వచ్చేలా చేయడానికి అవకాశం ఉంది. ఈ డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ (డీబీఎస్) ప్రక్రియ ఇప్పటికే పార్కిన్‌సన్ డిసీజ్ కారణంగా వచ్చే మతిమరపును విజయవంతంగా తగ్గిస్తుందని ఇప్పటికే తేలింది. దాంతో అల్జైమర్స్ రోగుల విషయంలోనూ ఈ ప్రక్రియ ఒక ఆశాకిరణంగా కనిపిస్తోంది.
 

మరిన్ని వార్తలు