మీ టాలెంట్ మీకు తెలుసా?

14 Jul, 2014 00:42 IST|Sakshi
మీ టాలెంట్ మీకు తెలుసా?

ప్రేరణ
ప్రతిఒక్కరిలో అంతర్గతంగా ప్రత్యేకమైన నైపుణ్యం, ప్రజ్ఞ ఉంటాయి. వాటిని గుర్తించి, వెలికితీస్తే అద్భుతాలు సృష్టిస్తారు. బాల్యంలో మందమతులుగా ముద్రపడినవారు సైతం తమ ప్రతిభాపాటవాలతో ప్రపంచాన్ని అబ్బురపరిచారు. వారు ఆ స్థాయికి ఎలా చేరుకున్నారో తెలుసుకోవాలనే ఆసక్తి ఎవరికైనా ఉంటుంది. ప్రముఖ బ్రిటిష్ నృత్యకారిణి గిలియన్ లైనీ ఉదంతం కూడా అలాంటిదే.

గిలియన్ లైనీ ఎనిమిదేళ్ల వయస్సులో ఉన్నప్పుడు ఆమె చదువుకుంటున్న పాఠశాల ఉపాధ్యాయురాలి నుంచి ఆమె తల్లికి ఓ ఉత్తరం వచ్చింది. స్కూల్లో గిలియన్ ప్రవర్తనపై సదరు టీచర్ ఫిర్యాదు చేస్తూ పెద్ద ఉత్తరం రాసింది. చిన్నారి చదువుపై ఆసక్తి చూపడం లేదని, ఎప్పుడూ మందకొడిగా ఉంటోందని అందులో తెలిపింది. అంతేకాకుండా హోమ్‌వర్క్ కూడా సమయానికి పూర్తి చేయదని, ఇక ఆమె చేతిరాత చాలా ఘోరంగా ఉందని విమర్శించింది. గిలియన్‌కు లెర్నింగ్ డిజార్డర్ ఉందనే అనుమానం తనను వేధిస్తోందని, ఆమెను అలాంటి విద్యార్థులకు ఉద్దేశించిన స్పెషల్ స్కూల్లో చేర్పిస్తే మంచిదని సలహా కూడా ఇచ్చింది.
 
అంతర్గత నైపుణ్యం మేల్కొంది
టీచర్ నుంచి వచ్చిన ఉత్తరం చదివిన గిలియన్ తల్లి తీవ్ర ఆందోళనకు గురైంది. టీచర్ ఇచ్చిన సలహాను పాటించడం కంటే ముందు తన బిడ్డ ఎదుర్కొంటున్న సమస్య, దాని పరిష్కారం కోసం చిన్నారిని సైకాలజిస్టు దగ్గరికి తీసుకెళ్లాలని నిర్ణయించుకుంది. వెంటనే గిలియన్‌ను తీసుకొని వెళ్లి ఒక సైకాలజిస్టును కలిసింది. ఆయన గిలియన్ ముఖ కవళికలను, కాళ్లు, చేతుల కదలికలను నిశితంగా పరిశీలించాడు. దాదాపు 20 నిమిషాల తర్వాత.. వ్యక్తిగతంగా మాట్లాడాలంటూ ఆమె తల్లిని బయటకు తీసుకెళ్లాడు. బయటకు వెళ్లేటప్పుడు గదిలోని రేడియోను ఆన్ చేసి, సౌండ్ పెంచాడు.

గదిలో గిలియన్ మాత్రమే ఉంది. ఆమెలో అంతర్గతంగా దాగి ఉన్న నైపుణ్యం ఒక్కసారిగా మేల్కొంది. కుర్చీలోంచి లేచి రేడియోలో వస్తున్న పాటలకు అనుగుణంగా కాళ్లు, చేతులను లయబద్ధంగా కదపసాగింది. ఇప్పుడు ఆమె ముఖం ఆనందంతో మెరిసిపోతోంది. గది బయట ఉన్న సైకాలజిస్టు కిటికీలోంచి ఈ దృశ్యాన్ని ఆమె తల్లికి చూపించాడు. ఆమె తన కళ్లను తానే నమ్మలేకపోయింది. అంతులేని ఆశ్చర్యానికి లోనైంది. గిలియన్‌లో ఎలాంటి లోపం లేదని సైకాలజిస్టు తేల్చిచెప్పాడు. ఆమె నృత్యంలో ప్రతిభ చూపుతుందని, శిక్షణ కోసం డ్యాన్స్ స్కూల్లో చేర్పించమని సూచించాడు.

సాన పెడితే వజ్రమే
అదృష్టవశాత్తూ గిలియన్ తల్లి ఆ సూచనను అమల్లో పెట్టింది. ఇక మిగిలిందంతా చరిత్రే. గిలియన్ లైనీ గొప్ప నృత్యకారిణిగా పేరుగాంచింది. ప్రపంచంలో అత్యుత్తమ కొరియోగ్రాఫర్‌గా గుర్తింపు పొందింది. తనలోని టాలెంట్‌తో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకుంది. తక్కువ కాలంలోనే అత్యంత సంపన్నురాలిగా ఎదిగింది. ఇక్కడ తప్పకుండా కృతజ్ఞతలు చెప్పుకోవాల్సింది సైకాలజిస్టుకే. ఎనిమిదేళ్ల బాలికలోని ప్రతిభను ఆయన గుర్తించడం వల్లే ఒక గొప్ప డ్యాన్సర్ ప్రపంచానికి లభించింది. ఒక వైద్యుడిగా ఆమెకు మందులు ఇవ్వడం లేదా స్పెషల్ స్కూల్‌కు పంపడం వంటివి చేసే అవకాశం ఉన్నప్పటికీ.. ఆయన గిలియన్‌లోని సహజ ప్రతిభను పసిగట్టాడు. ఆ ప్రతిభకు సాన పెట్టుకోవడంతో గిలియన్ వజ్రంగా మారింది.
 
మార్కులే కొలమానం కాదు

ప్రతి ఒక్కరిలో ఏదో ఒక టాలెంట్ కచ్చితంగా ఉంటుందని అనేక పరిశోధనల్లో తేలింది. మరి వాటినెందుకు గుర్తించలేకపోతున్నారు? మన ప్రతిభను మనం తెలుసుకోకుండా బయటి నుంచి చాలా ఒత్తిళ్లు పనిచేస్తుంటాయి. స్కూల్లో పిల్లల ప్రతిభను మార్కుల ఆధారంగా మాత్రమే కొలుస్తుంటారు. మంచి మార్కులు రాకపోతే వారిని అసమర్థులు, బుద్ధిహీనులుగా పరిగణిస్తారు. చదువుపై అంతగా ఆసక్తి లేని పిల్లలకు మరో రంగంలో బ్రహ్మాండమైన టాలెంట్ ఉండొచ్చు. దాన్ని గుర్తించి వెలికితీసే అవకాశం ఉండాలి. స్కూల్లో మంచి మార్కులు సాధించేవారు మరో రంగంలో వెనుకబడి ఉండొచ్చు. విద్యార్థుల ప్రతిభకు మార్కులు ఒక్కటే కొలమానం కాదని తెలుసుకోవాలి.
 
కలలను నిజం చేసుకోండి

మిమ్మల్ని ప్రత్యేకమైన వ్యక్తిగా నలుగురిలో నిలిపే విశిష్టమైన టాలెంట్ మీలో ఉందా? కలలను నిజం చేసుకొనేందుకు శ్రమించండి. ఎవరికి తెలుసు.. మీలోని ప్రతిభ మిమ్మల్ని ప్రపంచస్థాయికి తీసుకెళ్లొచ్చు. గిలియన్‌లోని ప్రతిభను కనిపెట్టిన సైకాలజిస్టు అందరికీ అవసరమే. ఆ సైకాలజిస్టు.. మన తల్లిదండ్రులు, టీచర్లు, స్నేహితులు, బంధువుల్లో ఎవరైనా కావొచ్చు. కాబట్టి మీరు కూడా మీకు తెలిసిన వారిలో ఏదైనా ప్రత్యేక ప్రతిభ ఉంటే వారికి తెలియజేయండి.
 -‘కెరీర్స్ 360’ సౌజన్యంతో..

మరిన్ని వార్తలు