బరువు తగ్గేందుకు 12 సూత్రాలు

25 Nov, 2019 17:00 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : సినీ తారలా సన్నగా, మెరపు తీగలా ఉండాలని తాపత్రయపడే యువతులు, బక్కగా ఉండడమే కాకుండా హృతిక్‌ రోషన్‌లాగా బలిష్టంగా కూడా కనిపించాలని కోరుకునే యువకులు, లావు తగ్గి చురుగ్గా కనిపించాలనుకునే మధ్య వయస్కులు మన చుట్టూ కోకొల్లలు. అందుకోసం వారంతా బరువు తగ్గించే బెల్టులు, యంత్రాలతో రోజు కుస్తీ పట్టడం, రక రకాల డైటింగ్‌లు కూడా చేస్తుండడం మనం చూస్తూనే ఉంటాం. అయినా ఆశించిన ఫలితాలు లేక కొత్త కొత్త పద్ధతులు, సూచనల కోసం ఎదురు చూసే వారు లేకపోలేదు. అలాంటి వారిని సొమ్ము చేసుకోవడానికి ఈ డైటింగ్‌ మంచిది, ఆ డైటింగ్‌ మంచిదంటూ ప్రపంచవ్యాప్తంగా రోజుకు ఎన్నో సూచనలతో కూడిన పత్రికలు పుస్తకాలు వెలువడుతున్నాయి. ఫలితంగా బ్రిటన్‌లో డైట్‌ ఫుడ్‌ బిజినెస్‌ ఏడాదికి 18 వేల కోట్ల రూపాయలకు చేరుకుంది.

డైటింగ్‌లకు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు ఐదు లక్షలకుపైగా పరిశోధనాత్మక పత్రాలు, పుస్తకాలు వెలువడి ఉంటాయని అమెరికా ఫిజిషియన్, రచయిత డాక్టర్‌ మైఖేల్‌ గ్రెగర్‌ అంచనా వేశారు. ఈ పత్రాల్లో, పుస్తకాల్లో సూచించిన డైటింగ్‌లు ఎంత మేరకు శాస్త్రీయంగా ఉన్నాయన్న అంశాన్ని తెలుసుకునేందుకు డాక్టర్‌ మైఖేల్‌ తన బృందంతో అధ్యయనం చేయించారు. ఆ తర్వాత ఆయన మూడు వేర్వేరు వాలంటీర్ల బృందాలను ఎంపిక చేసుకొని రక రకాల డైటింగ్‌లను వారిపై ప్రయోగించి ఫలితాలను విశ్లేషించారు. ఇలా ఆయన 17 ఏళ్లపాటు పరిశోధనలు జరిపి వాటి ఆధారంగా ఎలా డైటింగ్‌ చేయాలో, ఎలా చేయకూడదో వివరణ ఇస్తూ ‘హౌ నాటు టు డైట్‌’ అంటూ ఓ పుస్తకాన్నే వెలువరించారు. టూకీగా చెప్పాలంటే అందులో ఆయన డైటింగ్‌కు 12 చిట్కాలు చెప్పారు.

1. అల్పాహారం మానవద్దు
అల్పాహార విందును మానేయడం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు. గోడ గడియారంలాగానే మన భౌతిక శరీర గడియారంలో కూడా 24 గంటలు ఉంటాయి. ఆహారం తీసుకునేందుకు, విశ్రాంతి, నిద్రలకు సమయాలు ఉంటాయి. ఉదయం పూట ఎక్కువ కేలరీలను కరిగించే గుణం మన భౌతిక శరీరానికి ఉంటుంది. అందుకని అల్పాహారం మానేయాల్సిన అవసరం లేకపోగా, అల్పాహారప్పుడుగానీ, మధ్యాహ్నంగానీ ఎక్కువ తినాలి. రాత్రి పూట చాలా తక్కువ తినాలి.

2. శరీరంలో కొవ్వు రెండు రకాలు
కడుపు, నడుముల వద్ద పేరుకుపోయే కొవ్వును వైట్‌ ఫ్యాట్‌ అంటారు. భుజాల వద్ద, మెడ, చెక్కిళ్ల వద్ద పేరుకుపోయే ఫ్యాట్‌ను గోధుమ రంగు ఫ్యాట్‌ అంటారు. శాస్త్ర విజ్ఞానపరంగా ‘బ్రౌన్‌ అడపోస్‌ టిష్యూ (బ్యాట్‌)’గా వ్యవహరిస్తారు. పగటి పూట ఈ ఫ్యాట్‌లోని కేలరీస్‌ త్వరగా కరుగుతాయి.

3. టీ, కాఫీలతో కాలరీలు కరుగుతాయి
రోజుకు మూడుసార్లు టీ తాగడం వల్ల 25 కేలరీలు, రోజుకు మూడుసార్లు కాఫీలు తాగడం వల్ల 14 కాలరీలు మన శరీరంలో కరగుతాయి. బ్లాక్‌ టీ తీసుకోవడం వల్ల మరింత ప్రయోజనం ఉంటుంది.

4. టమాటాలతో ఎంతో ప్రయోజనం
ప్రతి మీల్స్‌ ముందు పండిన ఓ టమాటను తినడం వల్ల ఎంతో ప్రయోజనం ఉంటుంది. ఈ టమాటలో 90 శాతం నీళ్లు ఉండడం వల్ల తిండిని తగ్గిస్తుంది. అందులోని రసాయనాలు తిన్నదాంట్లోని కేలరీలను కరిగిస్తాయి.

5. డ్రైఫ్రూట్స్‌ గింజలు
వీటిలో కాలరీలు ఎక్కువగా ఉన్నప్పటికీ విటమిన్లు ఎక్కువగా ఉంటాయి. 24 గంటల భౌతిక గడియారం సజావుగా సాగేందుకు ఇవి ఉపయోగపడతాయి.

6. నల్ల జిలకర
మన కూరల్లో నల్ల జిలకర ఉపయోగించడం వల్ల కూడా ఎంతో ఉపయోగం ఉంటుంది. దీనిలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నట్లు దాదాపు వెయ్యి పరిశోధనా పత్రాల్లో పేర్కొన్నట్లు డాక్టర్‌ వివరించారు. ఇది అతివేగంగా శరీరంలోని కాలరీలను కరిగిస్తోంది.

7. వెనిగర్‌
దీన్ని రోజుకు రెండు టీ స్పూన్ల చొప్పున తీసుకుంటే నెల రోజుల్లో రెండున్నర కిలోల శరీర బరువును తగ్గిస్తుంది. నేరుగా తీసుకుంటే స్వరపేటిక దెబ్బతినే ప్రమాదం ఉన్నందున, సలాడ్స్‌పై పోసి వాటిని తీసుకోవాలి.

8. ఉడకబెట్టిన బంగాళ దుంపలు
ప్రతి భోజనంతో పాటు అంచుకు ఉడకబెట్టిన బంగాళ దుంపలు తీసుకోవడం వల్ల 200 కాలరీల ఆహారం తీసుకోవడం తగ్గుతుంది.

9. వ్యాయామంతో ఫిట్‌
వ్యాయామం చేయడం వల్ల లావు తగ్గరు. తిండి పెరుగుతుంది. వ్యాయామం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. కండరాలు పెరిగి బలంగా తయారవుతారు.

10. ఇంటి పనుల్లో చురుగ్గా ఉండడం
వంటావార్పు, ఇతర ఇంటి పనుల్లో తరచుగా కూర్చొడం, లేవడం, నిలబడడం, వంగడం తదిర క్రియల వల్ల శరీరంలోని కాలరీలు ఎక్కువగా కరగుతాయి.

11. బొజ్జలను తగ్గించే బెల్టులు..
వీటి వల్ల, ఇతర పరికరాల వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు.

12. శృంగారంతో 10 కేలరీలు..
దీని వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు. ఇరువురి మధ్య లైంగిక సంబంధం మహా అయితే ఆరు నిమిషాలు ఉంటుంది. దీని వల్ల కేవలం పది కేలరీలు మాత్రమే కరుగుతాయి. ఆ సమయంలో ఎక్కువగా గుండెకు ఆక్సిజన్‌ అందక పోవడం కూడా ఇందుకు కారణం కావచ్చు. రోజు టీవీ చూడడం వల్ల కూడా 14 కేలరీలు కరగుతాయి.

(గమనిక: డాక్టర్‌ మైఖేల్‌ గ్రెగర్‌ రాసిన ‘హౌ నాట్‌ టు డైట్‌’ పుస్తకం డిసెంబర్, 10వ తేదీనాడు మార్కెట్‌లోకి వస్తోంది. అమెజాన్‌ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటుంది)

మరిన్ని వార్తలు