నిద్ర అలవాట్లలో తేడా వస్తే...

8 Jun, 2019 01:13 IST|Sakshi

వేళకింత తిని.. పడుకోవాలని పెద్దలు అంటూంటే.. వారిదంతా చాదస్తం అని యువతరం కొట్టిపారేస్తూంటుంది. కానీ.. బ్రైగమ్‌ అండ్‌ విమన్స్‌ హాస్పిటల్‌ శాస్త్రవేత్తలు జరిపిన అధ్యయనం ప్రకారం.. నిద్ర అలవాట్లలో వచ్చే తేడాలు ఊబకాయం, హైపర్‌ టెన్షన్‌లతోపాటు మధుమేహం వంటి జీర్ణక్రియ సంబంధిత సమస్యలకూ కారణమవుతోందని తెలియడం చూస్తే మాత్రం పెద్దలమాట చద్దిమూట అనుకోవాల్సిందే. ఒక్కోరోజు ఒక్కో సమయంలో నిద్రపోయే వారితో పాటు.. నిద్రపోయే సమయంలో కూడా తేడాలు ఉండేవారు 2000 మందిని పరిశీలించిన తరువాత తాము ఈ అంచనాకు వచ్చామని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త తియాన్వీ హువాంగ్‌ తెలిపారు.

ఆరేళ్లపాటు జరిపిన పరిశీలనల తరువాత ఈ తేడాలు ఎక్కువగా ఉన్నవారికి ఆరోగ్య సమస్యలు కూడా ఎక్కువగా ఉన్నట్లు స్పష్టమైంది. అయితే ఈ అధ్యయనంలో కొన్ని లోటుపాట్లు ఉన్నాయని.. కొంతమంది శాస్త్రవేత్తలు అంటున్నారు. అధ్యయనంలో పాల్గొన్న వారి నిద్ర అలవాట్ల గురించి వారిని ప్రశ్నించి తెలుసుకోవడం ఇందులో ఒకటని.. ఆక్టీ గ్రాఫ్‌ వంటి వాచీలను వాడటం ద్వారా వారంలో వారు ఎంత సమయం నిద్రపోతున్నారో తెలుసుకున్నారని వీరు విమర్శిస్తున్నారు. వీటి ఆధారంగా వారి నిద్ర అలవాట్లలో వచ్చిన తేడాలు ఏమిటన్నది నిర్దిష్టంగా తెలియదని చెప్పారు.

మరిన్ని వార్తలు