దోశెడు రుచులు

27 Oct, 2018 00:45 IST|Sakshi

ఎట్ల చేసినా అట్లు బాగుంటాయి. ఏం టైమ్‌లో అయినా మనసు దోశేస్తాయి. రొటీన్‌ని పక్కన పెట్టండి. బ్రేక్‌ ఫాస్ట్‌లో ఛీజ్‌ను, బ్రెడ్‌ను దోశెతో కలిపి కొత్త రుచిని లాగించండి. అట్ల తద్ది నోముకు దోశెడు రుచులు కలపండి.

బ్రెడ్‌ దోశె
కావలసినవి: బ్రెడ్‌ స్లైసులు – 10; బియ్యప్పిండి – పావు కప్పు; సెనగ పిండి – 2 టేబుల్‌ స్పూన్లు; పెరుగు – పావు కప్పు; ఉప్పు – తగినంత; నీళ్లు – తగినన్ని; తినే సోడా – అర టీ స్పూను; నూనె – తగినంత
పోపు కోసం: నూనె – ఒక టీ స్పూను; ఆవాలు – పావు టీ స్పూను; జీలకర్ర – పావు టీ స్పూను; కరివేపాకు తరుగు – ఒక టీ స్పూను; ఇంగువ – చిటికెడు
తయారీ:
ముందుగా బ్రెడ్‌ను చిన్న చిన్న ముక్కలుగా చేసి మిక్సీలో వేసి మెత్తగా చేయాలి
బియ్యప్పిండి, సెనగ పిండి, పెరుగు, నీళ్లు జత చేసి మరోమారు మిక్సీ తిప్పి, పిండి మిశ్రమాన్ని ఒక పాత్రలోకి తీసుకోవాలి
తగినంత ఉప్పు (బ్రెడ్‌ ఉంటుంది కనుక ఉప్పు తగ్గించి వేసుకోవడం మంచిది) జత చేయాలి
♦  ఉల్లి తరుగు, పచ్చిమిర్చి తరుగు, మిరియాల పొడి జత చేసి మరోమారు బాగా కలపాలి.

పోపు తయారీ :
స్టౌ మీద చిన్న బాణలి ఉంచి వేడయ్యాక నూనె వేసి కాగాక ఆవాలు వేసి చిటపటలాడించాలి
జీలకర్ర జత చేసి మరోమారు వేయించాక, చివరగా కరివేపాకు తరుగు, ఇంగువ వేసి బాగా వేయించి దోశెపిండి మిశ్రమంలో వేసి కలపాలి
చివరగా తినే సోడా జత చేసి బాగా కలపాలి.

దోశె తయారీ: ∙స్టౌ మీద బాణలి ఉంచి వేడయ్యాక కొద్దిగా నూనె వేసి సమానంగా పరవాలి ∙గరిటెతో దోశె పిండి తీసుకుని పెనం మీద పల్చగా వేయాలి ∙బాగా కాలిన తరవాత తిరగేసి మరికాస్త నూనె వేసి కాల్చాలి ∙రెండువైపులా కాలిన తరవాత ప్లేట్‌లోకి తీసుకుని కొబ్బరి చట్నీతో అందించాలి.


ముంబై స్టయిల్‌ మసాలా దోశె
కావలసినవి: దోశె పిండి – 3 కప్పులు; ఉల్లి తరుగు – అర కప్పు; కొత్తిమీర తరుగు – పావు కప్పు; సాల్టెడ్‌ బటర్‌ – తగినంత; గరం మసాలా పొడి లేదా పావ్‌ భాజీ మసాలా పొడి – తగినంత; మిరప కారం – తగినంత; పొటాటో: మసాలా కోసం
కావలసినవి: బంగాళ దుంపలు – 3 (ఉడికించి తొక్కతీసి మెత్తగా మెదపాలి); నూనె – ఒకటిన్నర టేబుల్‌ స్పూన్లు; ఆవాలు – అర టీ స్పూను; జీలకర్ర – అర టీ స్పూను; పచ్చి సెనగ పప్పు (పొట్టుతో) – ఒక టేబుల్‌ స్పూను; కరివేపాకు – రెండు రెమ్మలు; పసుపు – పావు టీ స్పూను; ఉల్లి తరుగు – ఒక కప్పు; పచ్చి మిర్చి – 1 (చిన్న ముక్కలు చేయాలి); అల్లం తురుము – అర టీ స్పూను; నీళ్లు – తగినన్ని; కొత్తిమీర తరుగు – ఒక టేబుల్‌ స్పూను; ఉప్పు – తగినంత.
తయారీ:
ఒక పాత్రలో నీళ్లు పోసి మరిగించాలి
పచ్చి సెనగ పప్పును శుభ్రంగా కడిగి వేడి నీళ్లలో వేసి మూత పెట్టి సుమారు గంట సేపు నానబెట్టాక, నీళ్లు వడకట్టేసి, సెనగపప్పును పక్కన ఉంచాలి
బంగాళ దుంపలను ఉడికించి తొక్క తీసి గరిటెతో మెత్తగా మెదిపి పక్కన ఉంచాలి
స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక ఆవాలు వేసి చిటపటలాడించాలి
జీలకర్ర జత చేసి మరోమారు వేయించాలి
వడకట్టిన సెనగ పప్పు జత చే సి బంగారు రంగులోకి మారేవరకు ఆపకుండా వేయించాలి
అల్లం తురుము జత చేసి మరోమారు వేయించాలి
ఉల్లి తరుగు జత చేసి బాగా 
కరివేపాకు, పచ్చిమిర్చి తరుగు, పసుపు, ఇంగువ జత చేసి మరోమారు వేయించాలి
ఉడికించిన బంగాళదుంప ముద్ద జత చేసి అన్నీ కలిసేలా బాగా కలపాలి
ఉప్పు, పంచదార, కొద్దిగా నీళ్లు పోసి మసాలా మెత్తగా వచ్చేలా బాగా కలియబెట్టి, సుమారు ఐదు నిమిషాల పాటు ఉడకనివ్వాలి.

మసాలా దోసె తయారీ:
స్టౌ మీద పెనం ఉంచి వేడయ్యాక కొద్దిగా నూనె లేదా నెయ్యి వేసి కాలనివ్వాలి
గరిటెడు దోసె పిండి తీసుకుని పెనం పల్చగా దోసె వేయాలి ∙దోశె బాగా కాలుతుండగా మసాలాను ఉల్లితరుగు, కొత్తిమీర తరుగు, మిరప కారం లేదా గరం మసాలా వేసి సమానంగా పరవాలి
ఆ పైన కొద్దిగా బటర్‌ వేయాలి
చివరగా పొటాటో మసాలా మిశ్రమం కొద్దిగా తీసుకుని దోశె పైన ఉంచి దోశెను రెండు పక్కల నుంచి మధ్యకు మడిచి ప్లేట్‌లోకి తీసుకోవాలి
పిజ్జా కటర్‌తో కట్‌ చేసుకుని కొబ్బరి చట్నీ, సాంబారులతో వేడివేడిగా అందించాలి.


చీజ్‌ దోశె
కావలసినవి: దోశెపిండి – రెండు కప్పులు; ఉల్లితరుగు – అరకప్పు; టొమాటో తరుగు – అర కప్పు; మిరియాల పొడి – పావు టీ స్పూను; చీజ్‌ తురుము – అర కప్పు; బటర్‌ – తగినంత
తయారీ:
స్టౌ మీద పెనం ఉంచి వేడయ్యాక, కొద్దిగా బటర్‌ వేసి సమానంగా పరిచి,  మంట బాగా తగ్గించాలి
గరిటెతో దోశె పిండి తీసుకుని పెనం మీద దోశెలా వేయాలి
దోశె కొద్దిగా కాలిన తరవాత ఉల్లి తరుగు, టొమాటో తరుగు, మిరియాల పొడి వేసి అట్లకాడతో సరిచేయాలి
చివరగా చీజ్‌ తురుము వేసి సరిచేయాలి
అదే సమయంలో దోశె చుట్టూ బటర్‌ వేయాలి
సన్న మంట మీద దోశె కాలుతుండగా, చీజ్, బటర్‌ రెండూ కరిగిపోతాయి ∙దోశె బంగారు రంగులోకి వచ్చేవరకు కాల్చి ప్లేట్‌లోకి తీసుకోవాలి
కొబ్బరి చట్నీ, సాంబారుతో అందించాలి
టొమాటో చట్నీ, ఉల్లి చట్నీ కూడా రుచిగా ఉంటాయి.


పెరుగు దోశె
కావలసినవి: బియ్యం – ఒక కప్పు; గట్టి అటుకులు – పావు కప్పు; మినప్పప్పు – 2 టేబుల్‌ స్పూన్లు; మెంతులు – పావు టీ స్పూను; నీళ్లు – నానబెట్టడానికి తగినన్ని; తాజా పెరుగు – అర కప్పు; పంచదార – అర టీ స్పూను; ఉప్పు – తగినంత; నెయ్యి – తగినంత
తయారీ:
బియ్యం, మినప్పప్పు, మెంతులను విడివిడిగా కడిగి, ఒకపాత్రలో వేసి తగినన్ని నీళ్లు, పెరుగు జత చేసి సుమారు ఐదు గంటలపాటు నానబెట్టాలి
వేరొక పాత్రలో అటుకులు వేసి తగినన్ని నీళ్లు జత చేసి విడిగా నానబెట్టాలి
నీరంతా ఒంపేసి అటుకులు, బియ్యం, మినప్పప్పు, మెంతులు గ్రైండర్‌లో వేసి మెత్తగా చేసి ఒక పాత్రలోకి తీసుకోవాలి
పంచదార, ఉప్పు జత చేసి రాత్రంతా నాననివ్వాలి
స్టౌ మీద పెనం ఉంచి వేడయ్యాక కొద్దిగా నెయ్యి వేయాలి
గరిటెడు పిండి తీసుకుని పెనం మీద వేసి కొద్దిగా మందంగా ఉండేలా చూసుకోవాలి
పైన మూత ఉంచి, మీడియం మంట మీద కాలనివ్వాలి
దోశె పై భాగం బాగా కాలిన  తర్వాత రెండవ వైపుకి తిప్పి చుట్టూ నెయ్యి వేసి కాలిన తరవాత ప్లేట్‌లోకి తీసుకోవాలి
కొబ్బరి చట్నీ/ కొత్తిమీర చట్నీతో అందించాలి.


షెజ్వాన్‌ దోశె
కావలసినవి: ఉల్లికాడల తరుగు – పావు కప్పు; దోశె పిండి – 3 కప్పులు; కొత్తిమీర తరుగు – పావు కప్పు; ఉల్లి తరుగు – పావుకప్పు; క్యాప్పికమ్‌ తరుగు – పావుకప్పు; క్యారట్‌ తురుము – అర కప్పు; టొమాటో తరుగు – అర కప్పు; షెజ్వాన్‌ సాస్‌ – తగినంత; బటర్‌ – తగినంత
తయారీ:
స్టౌ మీద పెనం ఉంచి వేడయ్యాక, అడ్డంగా సగానికి కోసిన ఉల్లిపాయను నూనెలో ముంచి పెనం మీద నూనె పూయాలి
గరిటెతో దోశెపిండి తీసుకుని పెనం మీద దోశె వేయాలి
సన్నటి మంట మీద దోశెను కాలనివ్వాలి
పై భాగం బాగా కాలగానే రెండు టీ స్పూన్ల బటర్, ఒక టీ స్పూను షెజవాన్‌ సాస్‌ వేసి, దోశె మీద సమానంగా పరవాలి
ఆ పైన కూరగాయల తరుగు వేసి పరవాలి
బాగా కాలిన తరవాత దోశెను మధ్యకు మడిచి ప్లేట్‌లోకి తీసుకుని పిజ్జా కటర్‌తో నచ్చినట్లుగా కట్‌ చేయాలి
ఇలా తయారు చేసుకున్నాక కొబ్బరి చట్నీ, సాంబారుతో వేడివేడిగా అందించాలి.

దోశె పిండి
కావలసినవి: మినప్పప్పు – ఒక కప్పు; బియ్యం – రెండున్నర కప్పులు; మెంతులు – పావు టీ స్పూను; ఉప్పు – తగినంత
తయారీ:
ముందు రోజు రాత్రి ఒక పెద్ద పాత్రలో మినప్పప్పు, బియ్యప్పిండి, మెంతులు వేసి, తగినన్ని నీళ్లు జతచేసి నానబెట్టాలి మరుసటిరోజు ఉదయం నీళ్లన్నీ వడకట్టేసి, మినప్పప్పు, బియ్యం, మెంతులు మిశ్రమాన్ని గ్రైండర్‌లో వేసి మెత్తగా రుబ్బుకోవాలి
ఉప్పు జత చేసి బాగా కలిపి, మూత పెట్టి, రెండు మూడు గంటలు బాగా నాననివ్వాలి. ఆ తరవాత దోశెలు వేసుకుంటే మెత్తగా వస్తాయి.

టిప్స్‌
దోసె కరకరలాడుతూ, రుచిగా ఉండాలంటే...
ఒక భాగం మినప్పప్పుకు 3 భాగాల బియ్యం నానబెట్టాలి. సగం కప్పు మరమరాలు లేదా అన్నం పేలాలు విడిగా నానబెట్టాలి. నాలుగు గంటలు వీటిని నానబెట్టిన తర్వాత అన్నీ కలిపి మెత్తగా రుబ్బాలి.
కొందరు 2–3 రోజుల వరకు పిండిని ఫ్రిజ్‌లో ఉంచి వాడుతుంటారు. ఇలాంటప్పుడు స్టీలు గిన్నెలో ఉంచితే పిండి కొద్దిగా రంగు మారుతుంది. అలా కాకుండా ప్లాస్టిక్‌ లేదా సెరామిక్‌ పాత్రలో పిండిని పోసి ఫ్రిజ్‌లో భద్రపరచాలి.
దోసె వేయడానికి ఫ్రిజ్‌లో పిండి వాడాలంటే కనీసం 15 నిమిషాలు ఆ పిండిని బయట ఉంచాలి.
చట్నీతో పాటు తురిమిన ఛీజ్, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, ఇడ్లీ పొడి వంటివి దోసెకు కాంబినేషన్‌గా వడ్డించవచ్చు.

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా