3వ నెల నుండి ఇగో సమస్యలు మొదలు

26 Aug, 2015 12:17 IST|Sakshi
3వ నెల నుండి ఇగో సమస్యలు మొదలు

కేస్ స్టడీ
లలిత, శ్రీనివాస్‌లది పెద్దలు కుదిర్చిన వివాహం. డాక్టర్ భార్య, ఆఫీసర్ భర్త సంసారం పెళ్లయిన 2 నెలలు గొడవల్లేకుండా గడిచిపోయింది. 3వ నెల నుండి ఇగో సమస్యలు మొదలయ్యాయి. ఒకరిమీద ఒకరు ఆధిపత్యం కోసం పోరాడుకుంటూనే ఇద్దరు పిల్లలకు తల్లిదండ్రులయ్యారు. ‘నేను డాక్టర్‌ను, మంచి ప్రొఫెషనల్‌ను, నాకేంటి’ అని లలిత తరచు భర్తను కించపరిచేది. శ్రీనివాసేమో మగవాడిని, భర్తను, పైగా ఆఫీసర్‌ను అని ఇద్దరి మధ్యా తరచు గొడవలు.

అలా ఒకరోజు మొదలైన గొడవ చినికి చినికి గాలివాన అయ్యింది. 6 సం॥8 సం॥వయసున్న ఇద్దరు కొడుకుల్ని భర్త ఆఫీస్‌కు వెళ్లిన సమయంలో దేవాలయంలో వదిలేసి లలిత హాస్పిటల్‌కు వెళ్లిపోయింది. తెలిసినవారెవరో చూసి, ఏడుస్తున్న పిల్లలకు ఆశ్రయమిచ్చి శ్రీనివాస్‌కి సమాచారం అందించారు. శ్రీనివాస్ హుటాహుటిన వచ్చి వారిని ఇంటికి తీసుకువెళ్లాడు. భార్య చేసిన పనికి కోపంతో మండిపడుతూ, ఇక ఆమెతో కాపురం చేసేది లేదని తెలిసిన వాళ్ల ముందు తెగేసి చెప్పి, అప్పటికప్పుడు ఇంట్లోని సామానంతా తెచ్చేసి వేరు కాపురం మొదలెట్టేశాడు. లలిత అంతకన్నా ఎక్కువ కోపంతో భర్త మీద 498 ‘ఎ’, గృహ హింస కేస్‌లు ఫైల్ చేసేసింది.

అలాంటి భార్యతో తెగదెంపులు చేసుకోవడమే మేలంటూ శ్రీనివాస్ తనకు విడాకులు కావాలంటూ కోర్టుకెక్కాడు. ఇద్దరి వాదోపవాదాల నడుమ ఎనిమిదేళ్లు గడిచాయి. ఈ లోగా స్కూల్‌లో ఉన్న పిల్లలు, కాలేజ్ చదువులకు వచ్చేశారు. పిల్లల కష్టడీ తనకే అప్పగించాలంటూ లలిత భర్తపై కస్టడీ ఆఫ్ చిల్డ్రన్, రెస్టిట్యూషన్ ఆఫ్ కంజ్యూగల్ రైట్స్ (కాపురానికొస్తానని) కేసు, 498 ‘ఎ’, డీవీసీ కేసు పెట్టింది. తమను నిర్దాక్షిణ్యంగా వదిలేసి వెళ్లిందన్న బాధతో పిల్లలు తాము తల్లి దగ్గరకు వెళ్లేది లేదంటూ జడ్జిగారి ముందు చెప్పడంతో కోర్టులో అన్ని కేసులూ కొట్టేశారు. ఎట్టకేలకు శ్రీనివాస్‌కు విడాకులు మంజూరయ్యాయి.

కోటీశ్వరురాలైన డాక్టర్ లలిత మొగుడు, భర్త, పిల్లలు లేకుండా భారంగా బతుకీడుస్తోంది. విడాకులు మంజూరు అయినప్పటికీ కాలేజీ చదువుల్లోకొచ్చిన ఇద్దరు పిల్లల తండ్రి శ్రీనివాస్‌కు పిల్లనిచ్చేందుకు ఎవరూ ధైర్యంగా ముందుకు రాలేదు. దాంతో ఆఫీసులో అందరి గుసగుసల నడుమ ఆడదిక్కులేకుండానే పిల్లలను పెంచి పెద్ద చేసుకుంటూ శ్రీనివాస్ నిస్సారంగా జీవితాన్ని గడప వలసి వచ్చింది. కోర్టుల చుట్టు తిరిగి తిరిగి ఇద్దరికీ ఆరోగ్యం పాడయింది. ఎంత సంపాదించినా ఏం లాభం, ఇద్దరూ రెంటికి చెడ్డ రేవడి అయ్యారు.

నిశ్చల సిద్ధారెడ్డి
అడిషనల్ గవర్నమెంట్ ప్లీడర్

మరిన్ని వార్తలు