కష్టాలకు ‘మంగళం’

20 May, 2014 23:38 IST|Sakshi
కష్టాలకు ‘మంగళం’

ఇప్పుడందరూ గుజరాత్ గురించే మాట్లాడుకుంటున్నారు. అక్కడ గత ఐదేళ్లుగా ‘మంగళం మిషన్’ పేరుతో జరుగుతున్న అభివృద్ధి పనులు మహిళలకు అండగా నిలిచాయి. మహిళకు ఆర్థిక స్వాతంత్య్రం రావడంతో సగం కష్టాలు తీరిపోతాయన్నది అక్షరాలా నిజం.

ఈ విషయాన్ని గుర్తించిన అక్కడి పాలనాయంత్రాంగం ‘మంగళం మిషన్’ని ఏర్పాటు చేసింది. దీనికింద రెండు లక్షలకు పైగా ‘సఖి మండల్స్’ పనిచేస్తున్నాయి. దాదాపు పాతిక లక్షలమంది మహిళలు ఈ మండలాలలో సభ్యులుగా ఉన్నారు. స్వయం ఉపాధి బృందాలుగా ఏర్పడి ఈ మహిళలంతా రకరకాల వ్యాపారాలు చేస్తూ...చూస్తుండగానే తిరుగులేని వ్యాపారస్థులుగా స్థిరపడిపోయారు.

పసుపు తయారీ నుంచి పాడిపరిశ్రమ వరకూ కొన్ని వందల ఉపాధి మార్గాలతో ఉద్యోగినులకు దీటుగా నిలబడ్డారు. ‘కెర్గామ్’ అనే గ్రామంలో లిల్లీతోటను సాగుచేస్తూ అక్కడి సఖి మండల్ మహిళలు ఆర్జిస్తున్న లాభాలను చూసి మామూలు రైతులు కూడా ముక్కున వేలేసుకుంటున్నారు.

వడోదరా జిల్లాలోని మరో మారుమూల గ్రామానికెళితే 300 మంది మహిళలు సభ్యులుగా ఉన్న సఖి బృందం ‘డెయిరీ’ వ్యాపారం చేస్తున్నారు. నెలకు 7 లక్షల రూపాయల వ్యాపారం చేస్తున్న వీరి పనితీరు చూడడానికి పాలవ్యాపారులు ఇతర రాష్ట్రాల నుంచి కూడా వస్తున్నారు.
 

మరిన్ని వార్తలు