-

హా...యి శ్వాస!

9 Nov, 2015 23:21 IST|Sakshi
హా...యి శ్వాస!

దీపావళి నవంబర్‌లో వస్తుంది. ఆ టైమ్‌లో మనకు చలికాలం. అలర్జీలు ఉన్నవాళ్లు ఇబ్బంది పడే కాలం. ఈ చలికి బాణాసంచాతోవెలువడే కాలుష్యం కూడా తోడైతే మామూలు వ్యక్తుల్లోనూ అలర్జీలు రావచ్చు. అది శ్వాసకోశవ్యవస్థపై దుష్ర్పభావానికి దారితీయవచ్చు.
 
ఊపిరితిత్తులపై దుష్ర్పభావం: బాణాసంచా కాల్చడం వల్ల వెలువడే వాయువుల్లో కార్బన్‌మోనాక్సైడ్, నైట్రస్ ఆక్సైడ్, సల్ఫర్‌డైఆక్సైడ్ ఉంటాయి. ఇవి విషపూరితమైనవి. వీటికి తోడు క్యాడ్మియం, మెర్క్యూరీ, లెడ్, మెగ్నీషియమ్, జింక్, కాపర్ వంటి రసాయనాలు మండినందువల్ల వెలువడే వాయువులు ఛాతీ సంబంధమైన జబ్బులు ఉన్నవారికి ప్రమాదకరంగా పరిణమిస్తాయి. పోటాషియమ్ క్లోరేట్, ఆర్సినిక్ సల్ఫేట్, అల్యూమినియం వంటివి దీపావళి పండుగ తర్వాత చాలా రోజుల పాటు వాతావరణంలో ఎక్కువ పాళ్లలో ఉంటాయి. ఇక కార్బన్ అనేది మండిన అన్ని పదార్థాల్లో ఉంటుంది. మనం ఊపిరితీసుకున్నప్పుడు ఇవన్నీ  శ్వాస మార్గంలో ప్రయాణం చేసి, లంగ్స్‌లోని లోపలిపోరలపై దుష్ర్పభావం చూపుతాయి.
 
 ఆరోగ్య సమస్యలు ఇవే
 టపాసులతో వెలువడ్డ అనేక రకాల రసాయనాలు పీల్చడం వల్ల  దగ్గు, జ్వరం, అకస్మాత్తుగా శ్వాస అందకపోవడం, ఊపిరితీసుకోవడంలో ఇబ్బంది (డిస్నియా) వంటివి వస్తాయి. ఇవి ఒక్కోసారి ఇసినోఫిలిక్ న్యుమోనియా అనే ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్‌కు దారితీస్తాయి. సల్ఫర్‌డైఆక్సైడ్, నైట్రస్ ఆక్సైడ్ వంటివి ముక్కు నుంచి ఊపిరితిత్తుల వరకు ఉన్న లోపలి పొర (లైనింగ్)ను దెబ్బతీసి ఊపిరితిత్తుల నుంచి రక్తంలోని ఎర్రరక్తకణాలలోకి (ఆర్‌బీసీకి) చేరడం వల్ల ఎర్రరక్తణల ద్వారా అందాల్సిన ఆక్సిజన్ అందక శరీరంలోని ప్రతి కణమూ ఇబ్బంది పడుతుంది. ఇక ఆస్తమా సమస్య మరింత ప్రధానమైనది. టపాసుల వాసన మొదలుకొని, ఆ రసాయనాల వరకూ అన్నీ ఆస్తమాను అకస్మాత్తుగా ప్రేరేపించేవే. ఒక్క ఆస్తమాయే కాకుండా బ్రాంకైటిస్, క్రానిక్ అబ్‌స్ట్రక్టివ్ పల్మునరీ డిసీజ్ (సీఓపీడీ) వంటి సమస్యలూ వచ్చే అవకాశం ఉంది.

ఆస్తమా ఉన్నవారికి మరింత కష్టం
గాలిలోని కాలుష్యాలన్నీ ఆస్తమాను ప్రేరేపించే అంశాలే. టపాసుల కాలుష్యం వల్ల ఈ రోగుల్లో ఊపిరితిత్తులకు గాలిని తీసుకెళ్లే మార్గాలన్నీ ఒక్కసారిగా కుంచించుకుపోతాయి. ఆ మార్గంలో ఉన్న కణాల్లోనూ మంట, వాపు వస్తుంది. ఈ వాపువల్ల శ్వాసమార్గం మరింత సంకోచిస్తుంది. దాంతో శ్వాస కోసం తమకం మొదలువుతుంది. అందుకే ఈ వ్యాధిగ్రస్తులు మరింత జాగ్రత్తగా ఉండాలి.
 రోగనిరోధక శక్తినీ కాపాడుకోవాలి

పండుగ రోజున బాణాసంచాతో వెలువడే కాలుష్యాలు ఒక్కోసారి ఊపిరితిత్తుల వ్యాధులకే కాకుండా, సాధారణ రోగ నిరోధకశక్తిని సైతం దెబ్బతీసే ప్రమాదం ఉంది. ఎందుకంటే కాలుష్యంతో కూడిన పొగ కారణంగా శరీరంలోని కణాల్లో ఆక్సిడేషన్ చర్యలు ఎక్కువవుతాయి. అందుకే ఆరోగ్యకరమైన యాంటీ ఆక్సిడెంట్స్‌తో కూడిన ఆహారాన్నీ తీసుకోవాలి.

హాయి ఊపిరి కోసం జాగ్రత్తలివే:
 ఇంటిపట్టునే ఉండండి: పండుగ వేళ సాయంత్రం బాణాసంచా కాల్చడం మొదలు కాకముందు నుంచే ఇంట్లోనే ఉండండి. దీనివల్ల విషవాయువుల బారిన పడకుండా కాపాడుకోవచ్చు. కిటికీలు, తలుపులూ అన్నే మూసి ఉంచండి.
 
మాస్క్ ధరించి ఉండండి: ఇంట్లోకి కూడా పొగ వస్తుంటే సర్జికల్ మాస్క్‌ను గానీ లేదా పరిశుభ్రమైన బట్టను ముక్కుకు కట్టుకోండి.
వేళకు మందులు వాడండి: ఆస్తమా సమస్యతో బాధపడుతున్నవారు సమస్య వచ్చిన సమయంలో వాడే ఇన్‌హేలర్‌తో పాటు సమస్య రాకుండానే నివారించే  ‘ప్రివెంటర్ ఇన్‌హేలర్స్’ వాడుతుంటారు. వాటిని మరచిపోకుండా క్రమం తప్పకుండా వాడండి. దాంతోపాటు ఆస్తమా రోగులకు డాక్టర్లు సూచించిన మందులన్నీ క్రమం తప్పకుండా తీసుకుంటూ ఉండాలి.  కేవలం ఆస్తమా రోగులు మాత్రమే కాకుండా రక్తపోటును, చక్కెరను అదుపులో ఉంచే రోగులు సైతం ఈ సూచనను తప్పక పాటించాలి.

  సమూహాలు ఉన్న చోటికి వెళ్లకండి: ఒకేచోట ఎక్కువమంది గుమిగూడటం చాలా సాధారణంగా పండుగల వేళల్లో జరుగుతుంటుంది. ఇలాంటి చోటికి వెళ్లకండి. ఎందుకంటే జనం పోగవుతున్నకొద్దీ అందాల్సినంత ఆక్సిజన్ అందదు. దాంతో ఊపిరి అందే విషయంలోనే కాకుండా యాంగ్జైటీ వంటి మానసిక సమస్యలూ వచ్చే అవకాశం ఉంది.

 మర్నాడు మార్నింగ్‌వాక్ వద్దు
 ఆరోగ్యం కోసం మనం ఉదయం వేళ నడక సాగిస్తుంటాం. ఈ మార్నింగ్ వాక్‌తో ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. కానీ పండుగ రోజు బాణాసంచా కాలడం వల్ల వెలువడ్డ పొగ (స్మోక్) రాత్రి 10 గంటల నుంచి మరింత దట్టమవుతుంది. ఈ చలికాలంలో ఉదయం వేళల్లో మంచు (ఫాగ్) కురుస్తుంటుంది, రాత్రివేళ వెలువడ్డ వెలువడ్డ స్మోక్, ఉదయం వేళల్లో ఏర్పడే ఫాగ్ కలిసి ‘స్మాగ్’ అనే అపాయకరమైన పొగమంచుగా ఏర్పడుతుంది. ఈ స్మాగ్ ఆస్తమాతో పాటు ఎన్నో ఊపిరితిత్తుల సమస్యకు కారణం కావచ్చు. అందుకే పండుగ తర్వాత మర్నాటి ఉదయం... ‘మార్నింగ్ వాక్’కు వెళ్లకండి.

 టపాసులు కాల్చే సమయంలో వాటి దగ్గర ఉన్నందువల్ల చర్మం, కళ్లు, చెవులు తక్షణం దుష్ర్పభావానికి లోనుకావచ్చు. కానీ ఆ తర్వాత కొద్ది రోజుల పాటు ప్రభావితం అయ్యే అవయవాల్లో ముఖ్యమైనవి ఊపిరితిత్తులే. అందుకే వాటి విషయంలో మరింత జాగ్రత్త అవసరం అని గుర్తుంచుకోండి. సురక్షితంగా పర్వదినం జరుపుకోండి. పండుగ తర్వాత కూడా అప్రమత్తంగా ఉండి ఆరోగ్యం కాపాడుకోండి.
 
 

మరిన్ని వార్తలు