ఇవాంకతో డిన్నర్‌!

25 Nov, 2017 02:09 IST|Sakshi

తెలంగాణ ప్రభుత్వం ఇవాంక గౌరవార్థం... గోల్కొండ కోటలో పెద్ద విందు ఏర్పాటు చేసింది. హైదరాబాదీ స్పెషల్స్‌ ఆ విందులో హైలైట్‌. దాదాపు వంద రకాల వంటకాలు ఉంటాయట! మనం అక్కడ ఎలాగూ తినలేం... ఓ నాలుగు రకాలు చేసుకుని... మనింట్లోనే ఇవాంక డిన్నర్‌ కానిచ్చేద్దాం.


డబుల్‌ కా మీఠా (స్లైస్‌)

కావలసినవి : బ్రెడ్‌ ముక్కలు – 10 ,పంచదార – 1 కప్పు, పాలు – 1 కప్పు ,నెయ్యి – పావు కప్పు,ఏలకులు – 4,జీడిపప్పులు – 10,బాదం పప్పులు  – 10,పిస్తా – 10
తయారి : ఒక్కొక్క బ్రెడ్‌ను నాలుగుముక్కలు చేసి నేతిలో వేయించుకోవాలి. పాలు మరిగించి పక్కనుంచాలి. మరొక పాత్రలో పంచదారను పాకం పట్టుకోవాలి. బ్రెడ్‌ ముక్కలను పాకంలో వేసి మరిగించిన పాలుపోసి ముక్క చెదరకుండా, పాలు, పాకం కలిసేలా చూడాలి. బాదం, పిస్తా, జీడిపప్పులను సన్నని ముక్కలుగా తరిగి  నేతిలో వేయించి కలుపుకోవాలి.


షీర్‌ ఖుర్మా

కావలసినవి : సేమ్యా – 2 కప్పులు (సన్నని సేమ్యా), పంచదార – 1 కప్పు, నెయ్యి – 4 టీ స్పూన్లు, బాదం – గుప్పెడు, జీడిపప్పులు – గుప్పెడు, పిస్తా – గుప్పెడు, చార్మస్‌ (తర్బూజ గింజలు) – 2 టీ స్పూన్లు
తయారి : సేమ్యా, బాదం, పిస్తా, జీడిపప్పులను సన్నగా తరిగి నేతిలో వేయించాలి. అడుగు మందంగా వున్న పాత్రలో పాలు మరగనివ్వాలి. మరిగిన పాలకు పంచదార కలిపి మరో పదినిమిషాలు మరిగించాలి. వేయించిన సేమ్యా, బాదం, పిస్తా, జీడిపప్పులు కలిపి రెండు నిమిషాలు ఉడికించి స్టౌ పైనుంచి దించేయాలి.


ఖుబానీ కా మీఠా

కావలసినవి: ఖుబానీ (డ్రై ఆప్రికాట్స్‌) – కేజీ; పంచదార – ఒకటిన్నర కేజీ; రాస్ప్‌బెర్రీ సిరప్‌ – 100 మి.లీ. (బేకరీలలో దొరుకుతుంది); రాస్స్‌బెర్రీ కలర్‌ – రెండు టీ స్పూన్లు
తయారి: ఒక పాత్రలోకి ఖుబానీలను తీసుకుని అందులో నీరు పోసి రాత్రంతా నానబెట్టాలి. (ఖుబానీలు మునిగాక వాటి మీద రెండు అంగుళాల మేరకు నీరు ఉండాలి). మరుసటిరోజు వాటిలోని గింజలను వేరుచేయాలి. ఇప్పుడు ఈ పాత్రను ఆ నీటితోనే స్టౌ మీద ఉంచాలి. ఒక నిముషం అయిన తరువాత అందులో పంచదార వేయాలి. పంచదార పూర్తిగా కరిగి, ఖుబానీలు మెత్తగా, చిక్కగా అయ్యి, గోధుమ రంగులోకి వచ్చేవరకు ఉంచాలి. ఇప్పుడు స్టౌమీద నుంచి దింపేసి, అందులో రాస్ప్‌బెర్రీ సిరప్, రాస్ప్‌ బెర్రీ కలర్‌ వేసి కలిపి, ఒక  బౌల్‌లోకి తీసుకోవాలి. క్రీమ్‌తో గార్నిష్‌ చేయాలి.


దమ్‌ బిర్యానీ

కావలసినవి : చికెన్‌ – అర కిలో, బాస్మతి బియ్యం – 1 కిలో, అల్లం వెల్లుల్లి పేస్ట్‌ – 1 టీ స్పూను, గరం మసాలా – అర టీ స్పూను, పసుపు – అర టీస్పూను, దాల్చిన చెక్క – చిన్న ముక్క, ఏలకులు – 4, లవంగాలు – 5, కుంకుమ పువ్వు – చిటికెడు, కారం – 2 టీ స్పూన్లు, ఉప్పు – తగినంత, ఉల్లిగడ్డ – 1, పాలు – 1 కప్పు
తయారి : చికెన్‌ను శుభ్రపరచి కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, గరం మసాలా పట్టించి అరగంట పాటు పక్కనుంచాలి. బాస్మతి బియ్యాన్ని సగం ఉడకనిచ్చి నీళ్ళు వడకట్టి పక్కనుంచాలి. అడుగు మందంగా వున్న పాత్రలో అడుగున చికెన్‌ను పేర్చి దానిమీద సగం ఉడికించిన బియ్యాన్ని అమర్చాలి. దీనిని తక్కువ మంటమీద ఉడికించాలి. పాలలో కుంకుమపువ్వు కలిపి ఉడికిన బిర్యానీ పైన చల్లి మూత పెట్టుకోవాలి.  ఉల్లిగడ్డని పొడవుగా తరిగి  అర టీ స్పూను అల్లంవెల్లుల్లి పేస్ట్, చిటికెడు ఉప్పు కలిపి వేయించాలి. ఉల్లిగడ్డ మిశ్రమాన్ని ఉడికిన బిర్యానీ పైన చల్లి మరో పదినిమిషాలపాటు మగ్గనిచ్చి స్టౌపైనుంచి దించేయాలి.


పత్తర్‌ కా ఘోష్‌

కావలసినవి: బోన్‌లెస్‌ మటన్‌– ఒక కేజీ ,మారినేట్‌ చేయడానికి: ,అల్లం వెల్లుల్లి పేస్ట్‌– ఒక టేబుల్‌ స్పూన్‌ ,కారం పొడి– ఒక టేబుల్‌ స్పూన్‌ ,పసుపు– పావు టేబుల్‌ స్పూన్‌ ,పచ్చి బొప్పాయి పేస్ట్‌– రెండు టేబుల్‌ స్పూన్లు ,గరం మసాలా– ఒక టేబుల్‌ స్పూన్‌ ,మిరియాల పొడి– ఒక టేబుల్‌ స్పూన్‌ ,పచ్చిమిర్చి పేస్ట్‌ – ఒక టేబుల్‌ స్పూన్‌ ,నిమ్మకాయ రసం– ఒక ,టేబుల్‌ స్పూన్‌ ,పత్తర్‌ కే ఫూల్‌ పౌడర్‌ – ఒక టేబుల్‌ స్పూన్‌ ,ఉప్పు– రుచికి తగినంత ,నూనె లేదా నెయ్యి– నాలుగు టేబుల్‌ స్పూన్లు ,గార్నిష్‌ చేయడానికి: ,ఉల్లిపాయ చక్రాలు– ఒక పెద్ద ఉల్లిపాయవి ,నిమ్మకాయ ముక్కలు– నాలుగు నిమ్మకాయలవి ,కొత్తిమీర తరుగు– ఒక కప్పు ,పుదీన తరుగు– ఒక కప్పు
తయారీ:  
1.
పెద్ద పాత్రలో మాంసం ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, బొప్పాయి గుజ్జు, పచ్చిమిర్చి పేస్టు, నిమ్మరసం కలిపి 15 నిమిషాల సేపు పక్కన ఉంచాలి.
2. మరొక పాత్రలో నెయ్యి, కారం, పసుపు, మిరియాల పొడి, గరం మసాలా, పత్తర్‌ కే ఫూల్‌ పౌడర్, ఉప్పు వేసి బాగా కలపాలి. ఇందులో పైన కలిపి పెట్టుకున్న మాంసం ముక్కలను వేసి మసాలా సమంగా పట్టేటట్లు కలపాలి. ఈ మిశ్రమాన్ని నాలుగు గంటల సేపు ఫ్రిజ్‌లో పెట్టాలి.
3. పత్తర్‌ కా ఘోష్‌ చేసే రాయి (పెనం లాంటిది)ని వేడి చేయాలి. రాయి మీద నీటిని చల్లి వేడి చూసుకోవాలి. బాగా వేడెక్కిన తర్వాత మాంసం ముక్కలను రాయి మీద వరుసగా పేర్చాలి. ముక్కలనీ తీసిన తర్వాత పాత్రలో మిగిలి పోయిన మసాలా నీటిని కొద్ది కొద్దిగా ముక్కల మీద వేయాలి. నీరు ఆవిరైన తర్వాత ముక్కలను తిరగవేయాలి. చపాతీని తిరగేస్తూ కాల్చినట్లు మాంసం ముక్కలను అనేక సార్లు తిరగవేస్తూ బంగారు రంగులోకి వచ్చే వరకు కాల్చాలి.
4. రాయి మీద నుంచి తీసి ఉల్లిపాయ చక్రాలు, నిమ్మకాయ ముక్కలు, కొత్తిమీర, పుదీన తరుగుతో గార్నిష్‌ చేయాలి.

మరిన్ని వార్తలు