‘‘నేనే వస్తాను’’

3 May, 2015 00:48 IST|Sakshi
‘‘నేనే వస్తాను’’

పంచ్ శాస్త్ర
దర్శకులే రచయితలయ్యాక పంచ్‌లు పవర్‌ఫుల్ అయ్యాయి. త్రివిక్రమ్‌దైతే వెరీమచ్ కార్డియల్ పంచ్. తొడ కొట్టించడు. మీసం మెలి తిప్పించడు. వెనుక గుండ్లు, సౌండ్లు పెట్టడు. వింజామరలా పంచ్‌లు విసురుతాడు. ఉద్వేగపు అగ్నిపర్వతానికి సెలైన్సర్ అమర్చి పేల్చినట్లు కూల్‌గా స్పిల్ అవుతుందా పంచ్! ‘అతడు’ సినిమానే తీస్కోండి. మహేశ్‌బాబు ‘యుద్ధానికి’ బయల్దేరి వెళ్లబోయే ముందు త్రిష పరుగున వచ్చి ‘‘నేనూ వస్తాను’’ అని అతడిని అల్లేసుకుంటుంది.

మహేశ్‌బాబు మృదువుగా త్రిషను విడిపించుకుని ‘‘నేనే వస్తాను’’ అని చెప్పి వెళ్లిపోతాడు. ప్రేక్షకుల హృదయాన్ని కదిలించిన పంచ్ ఇది.
       
అసలు పంచ్‌కి అంత శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? సన్నివేశం నుంచే! ఎంత మామూలు డైలాగునైనా సన్నివేశం పంచ్ డైలాగ్‌గా మార్చేయగలదు. అందుకు చక్కటి ఉదాహరణే ‘‘నేనే వస్తాను’’ అనే డైలాగ్. అలా సన్నివేశం, పంచ్ డైలాగ్ ఒకదాన్ని ఒకటి హిట్ చేసుకుంటాయి. ‘అతడు’ సినిమాలో ‘నేనే వస్తాను’’ అనే డైలాగ్ పంచ్ డైలాగ్‌గా ఎస్టాబ్లిష్ అవడానికి సన్నివేశం ఎలా తోడ్పడిందో మీరే చూడండి.
 
సీన్:
 సీబీఐ ఆఫీసర్ ప్రకాష్ రాజ్ అండ్ టీమ్ మహేశ్‌బాబును వెతుక్కుంటూ నాజర్ ఇంట్లోకి చొరబడి గాలిస్తుంటారు. ‘‘ఆ... బై ది బై మూర్తిగారూ మీ ఇంట్లో ఉన్నాడే ఆ కుర్రాడు. వాడు మీ మనవడు కాదు. వాడి పేరు నందు. హి ఈజ్ ఎ ప్రొఫెషనల్ కిల్లర్. అపోజిషన్ లీడర్ శివారెడ్డి హత్య కేసులో వాడికోసం వెతుకుతున్నాం’’ అని చెప్తాడు.
 నాజర్ బ్లాంక్‌గా ఉండిపోతాడు. సీబీఐ వాళ్లు వెళ్లిపోయాక మహేశ్‌బాబు ఇంట్లోకి వస్తాడు. ఇంట్లో అందరూ అతడిని దోషిలా చూస్తుంటారు. నానా మాటలు అంటారు. మహేశ్‌బాబు నేరుగా నాజర్ దగ్గరికి వెళతాడు. ఆయన ఎదురుగా మోకాళ్లపై కూర్చొని మెల్లిగా చెప్పడం మొదలుపెడతాడు.

‘‘నిజం చెప్పే ధైర్యం లేనోడికి అబద్ధం చెప్పే హక్కు లేదు. నాకు ధైర్యం ఉంది. అందుకే పార్థు లేడనే నిజం చెప్పడానికే ఇక్కడికి వచ్చాను. కానీ ఆవిణ్ణి చూశాక (పార్థు తల్లిని చూపిస్తూ) పార్థు రాలేడని చెప్పాలనుకున్నాను. మిమ్మల్ని చూశాక ఆ మాట కూడా చెప్పలేక పోయాను. అబద్ధం ఆడాను. అబద్ధం మాత్రమే ఆడాను. మోసం చేయలేదు’’ అంటాడు మహేశ్‌బాబు. (‘‘రెంటికీ పెద్ద తేడా ఏంటో’’ అంటాడు అక్కడే ఉన్న ధర్మవరపు సుబ్రహ్మణ్యం వ్యంగ్యంగా...) ‘‘నిజం చెప్పకపోవడం అబద్ధం. అబద్ధాన్ని నిజం చేయాలనుకోవడం మోసం. నేను పార్థు అని అబద్ధం చెప్పాను. నేనే పార్థు అవ్వాలని మోసం చేయలేదు.

పోలీసులకు దొరక్కుండా తప్పించుకున్నా వెనక్కి తిరిగి రాటానికి కారణం ఒకటే... ఈ ఇంట్లో నేను సమాధానం చెప్పాల్సిన మనుషులు ఇద్దరున్నారు. ఒకళ్లు మీరు. ఇంకొళ్లు... (పాజ్)... అని ఆగినప్పుడు త్రిష వైపు కెమెరా తిరుగుతుంది. ‘‘వచ్చాను. చెప్పాను. ఇంక మీ ఇష్టం’’ అంటాడు (నాజర్ వైపు చేతులు చాస్తూ) మహేశ్‌బాబు.
 
కనెక్టింగ్ సీన్:
నాజర్ మహేశ్‌బాబుని చెయ్యి పట్టుకుని పై గదిలోకి తీసుకెళతాడు.
‘‘నేను ఒకే ఒక్క ప్రశ్న అడుగుతున్నాను. సమాధానం చెప్తావా?’’ అంటాడు. ‘‘ఎవడో రైల్లో పోలీస్ కాల్పుల్లో చనిపోతే నీ దారిన నువ్వు పారిపోకుండా, వాడి ఇల్లు వెతుక్కుంటూ ఇంత దూరం ఎందుకు వచ్చావు? వాళ్ల పొలం సమస్యల్లో ఉంటే నువ్వెందుకు తీర్చావ్? వాళ్ల పిల్ల పెళ్లంటే నువ్వెందుకు డబ్బులిచ్చావ్? వాళ్లు తిడితే ఎందుకు పడ్డావ్? ఏమీ చెయ్యలేని నాలాంటి ముసలాడి ముందు తలొంచుకుని మోకాళ్ల మీద ఎందుకు కూర్చున్నావ్? ఆ.. అందుకే నువ్వే పార్థు. నువ్వే నా పార్థువి’’ అంటాడు.
 
‘‘నేను నిన్నేమీ అడగను. అడిగితే, నాయుడు లాంటి మనిషిని ఎలా ఒప్పించావని పొలంలోంచి కంచె తీయించేసిన రోజే నిన్ను అడిగుండాల్సింది. పాతికేళ్ల వయసులో పది లక్షలు చెక్కిచ్చావంటే, ‘ఏం చేస్తున్నావు నువ్వు’ అని ఆరోజే నేను అడిగుండాల్సింది. అప్పుడడగలేదు. ఇప్పుడు అడిగే అర్హత లేదు’’ అంటాడు.
 
గోడపై తుపాకీని అందుకుని -
‘‘ఇది నా కొడుక్కు నేను కొనిచ్చాను. అప్పుడు వాడి ప్రాణాలు తీసింది. ఇప్పుడు నీ ప్రాణాలు కాపాడుతుంది. నువ్వు నేరం చేశావని వాడెవడో అన్నాడు. ఇప్పుడు యుద్ధం చెయ్యమని నేను చెప్తున్నాను’’ అంటాడు.. తుపాకీని మహేశ్‌బాబు చేతికి అందిస్తూ. ‘‘వెళ్లు. గెలిస్తే రా. గెలవక పోతే నువ్వేమైపోయావో అనే నిజం నాకు తెలియనివ్వకు. ఈ వయసులో నాక్కావలసింది అబద్ధాలు, నిజాలు కావు. జ్ఞాపకాలు’’ అంటాడు.
       
 మహేశ్‌బాబు వంగి నాజర్ కాళ్లకు దండం పెడతాడు. ‘‘జాగ్రత్త’’ అని ఆశీర్వదిస్తాడు నాజర్.
 ఇదంతా వింటున్న త్రిష, మహేశ్‌బాబు గదిలోంచి బయటికి రాగానే ఉద్వేగంతో ఒక్కసారిగా పరుగున వెళ్లి మహేశ్ బాబుని చుట్టేసుకుంటుంది. గట్టిగా పట్టుకుని వదలిపెట్టేది లేదన్నట్లు ఏడుస్తుంది. ‘‘నేనూ వస్తాను’’ అంటుంది.మహేష్‌బాబు త్రిషను మెల్లగా విడిపించుకుని తల అడ్డంగా ఊపుతూ ‘‘నేనే వస్తాను’’ అంటాడు. అని వెళ్లిపోతాడు. సన్నివేశం మలిచిన పంచ్ ఇది. పదాలను మార్చకుండా భావాలను మలిచారు త్రివిక్రమ్. అందుకే అంత పెద్ద హిట్ అయింది.
 - మాధవ్ శింగరాజు

మరిన్ని వార్తలు