అవమాన ప్రయాణం

23 Oct, 2019 04:10 IST|Sakshi

చెక్‌–ఇన్‌సల్ట్‌

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌. వీల్‌ చైర్‌ కావాలని ఎయిర్‌లైన్‌ సిబ్బందిని కోరారు జీజా ఘోష్‌. ఎంతసేపటికీ రాలేదు. అదేమని విచారిస్తే ‘‘ఈరోజు స్టాఫ్‌ తక్కువగా ఉన్నారు’’ అని సమాధానం వచ్చింది సిబ్బంది నుంచి. ఎట్టకేలకు దీర్ఘ నిరీక్షణ తర్వాత వీల్‌ చైర్‌ వచ్చింది. తీరా  చెకిన్‌ కౌంటర్‌కు వెళ్లాక  ‘‘ఎవరూ తోడు లేకుండా మీరొక్కరే  ప్రయాణం చేయడానికి వీల్లేదు’’ అని చెప్పారు ‘గో ఎయిర్‌’ చెకిన్‌  కౌంటర్‌లో. ఆశ్చర్యపోయారు జీజా.. ‘‘ఒంటరి ప్రయాణం నాకు కొత్తకాదు.. ప్రపంచమంతా ఒక్కదాన్నే చుట్టొస్తుంటా’’ అని. ఆ విషయాన్నే సిబ్బందితో చెప్పారు కూడా. అయినా ససేమిరా అన్నారు వాళ్లు. దాంతో తనతోపాటు న్యూఢిల్లీకి ప్రయాణం చేసే మిగతా సహచరులు వచ్చేవరకు ఆమెకు బోర్డింగ్‌ పాస్‌ ఇవ్వలేదు. ఆ సహచరుల్లోనే ఒకరైన కుహూ దాస్‌కూ ఇలాంటి అవమానమే ఎదురైంది! ఆమెకు  పోలియో.

దాంతో క్యాలిపర్స్‌ పెట్టుకొని వచ్చారు. సీఐఎస్‌ఎఫ్‌ (సెంట్రల్‌ ఇండస్ట్రియల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌) తనిఖీ కోసం ప్యాంట్స్‌ తీసేయమన్నారట. షాక్‌ అయ్యారు కుహూ దాస్‌.. ఇన్నేళ్లుగా ఫ్లైట్లలో ప్రయాణం చేస్తున్న తనకు ఏ రోజూ ఇలాంటి అవమానం ఎదురు కాలేదు. ‘‘వాళ్లు ఆ మాట అనగానే ఒక్క క్షణం నా చెవులను నేనే నమ్మలేకపోయా. ఇన్నేళ్లలో ఎప్పుడూ ఏ ఆఫీసర్‌ ఇలా అడగలేదు. ఇంత ఇన్‌సల్ట్‌ చేయలేదు’’ అన్నారు కుహూ. కుహూనే కాదు జీజా ఘోష్‌ కూడా వికలాంగురాలే. 2019 ఎలక్షన్‌ కమిషన్‌ క్యాంపెయిన్‌ పోస్టర్‌ గర్ల్‌ కూడా అయిన  జీజాకు సెరిబ్రల్‌ పాల్సి. ఈ ఇద్దరూ.. న్యూఢిల్లీలో జరగబోయే వికలాంగ మహిళల హక్కుల సమావేశానికి హాజరయ్యేందుకు మొన్న ఆదివారం కోల్‌కతా నుంచి బయలుదేరారు.

ఆ సమయంలో వాళ్లకు జరిగిన అవమానం ఇది. ఈ సంఘటనలతో వాళ్లు తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ఈ వివక్ష మీద అక్కడే నిరసననూ తెలిపారు. దాంతో ఆ చెకిన్‌ కౌంటర్‌లోని వ్యక్తి  ‘సారీ’ చెప్పింది ఈ ఇద్దరికి. ‘‘ఆ అమ్మాయి మీద మాకేం కోపం లేదు. ఇది ఆ అమ్మాయి ఒక్కరి  తప్పు కాదు.. మాలాంటి వాళ్లను ఎయిర్‌లైన్‌ ఎలా ట్రీట్‌ చేస్తుందో.. ఎంత చులకనగా చూస్తుందో అనడానికి ఇదొక ఎగ్జాంపుల్‌’’ అన్నారు జీజా, కుహూ. విషయం తెలుసుకున్న ఎయిర్‌పోర్ట్‌ సిబ్బంది జీజా ఘోష్, కుహూ దాస్‌లను క్షమాపణ కోరుతూ.. జరిగిన తప్పిదాన్ని సీరియస్‌గా తీసుకుంటున్నామని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకునే పూచీని సంబంధిత ఎయిర్‌లెన్స్‌ అధికారులకు అప్పగించామని కోల్‌కతా ఎయిర్‌ పోర్ట్‌ సిబ్బంది ట్వీట్‌ చేశారు.  

►మన దేశంలో దాదాపు ఎనిమిదికోట్ల మంది వికలాంగులున్నారు. రకరకాల వైకల్యాలతో బాధపడుతున్న వాళ్లకు కల్పించాల్సిన ప్రత్యేక సదుపాయాల సంగతేమో కాని పనిగట్టుకొని ఇలా అవమానించకుండా ఉంటే చాలు.  

మరిన్ని వార్తలు