గురు శిష్యులు

24 Sep, 2017 00:31 IST|Sakshi

ఇస్లాం వెలుగు

ఒకసారి ఓ గురుశిష్యులిద్దరూ లోకాభిరామాయణం మాట్లాడుకుంటూ ఎటో వెళుతున్నారు. శిష్యుడికి ఆ గురువంటే అమితమైన గౌరవాభిమానాలు. గురువుముందు బిగ్గరగా మాట్లాడడం గాని, అతనికంటే ఒక్క అడుగు కూడా ముందు నడవడం గాని చేసేవాడు కాదు. వినయ విధేయతలతో మసలుకునేవాడు. వారలా వెళుతూ ఉండగా మార్గంలో ఒక వాగు దాటవలసి వచ్చింది. అప్పుడు గురువు, శిష్యుడికి జాగ్రత్తలు చెబుతూ వాగులోకి దిగాడు. కాని శిష్యుడు వెంటనే గురువుగారి చెయ్యి పట్టుకొని ఒడ్డుకు లాగి, ‘‘గురువుగారూ.. ముందు నేను వాగు దాటుతాను. తరువాత మీరొద్దురుగాని.. అందాకా ఇక్కడే ఉండండి’’ అన్నాడు వినయంగా.

‘‘లేదు లేదు నేనే ముందు వాగు దాటుతాను’’ అంటూ కోప్పడ్డాడు గురువు. శిష్యుడు మొండిగా ‘‘నేనే దాటుతాను గురువుగారూ’’ అని పట్టుబట్టాడు. చివరికి గురువే కాస్త మెత్తబడి, ‘సరే నువ్వేదాటు.. ఏం చేస్తాం.. అని అనుమతించాడు. గురువు అనుమతి పొందిన శిష్యుడు తానే ముందుగా వాగుదాటాడు. తరువాత గురువు కూడా దాటాడు. మొత్తానికి గురుశిష్యులిద్దరూ వాగుదాటి, ఓ చెట్టుకింద కూర్చున్నారు. అప్పుడు గురువు శిష్యుడితో మాట్లాడుతూ.. ‘‘నీకు బాగా తలబిరుసుతనం ఎక్కువైంది. నామాట వినకుండా నీ పంతమే నెగ్గించుకొని నాకన్నా నువ్వే ముందు వాగు దాటావు. గురువు పట్ల ఇలాంటి అవిధేయత పనికిరాదు.’’ అన్నాడు కోపంగా... అప్పుడు శిష్యుడు, ‘‘గురువుగారూ.. నేను మీ పట్ల అవిధేయత చూపలేదు. ఎప్పుడూ చూపను కూడా..! నేను కేవలం నా బాధ్యతను గుర్తించి, మీ హక్కును నెరవేర్చాను. అయితే ఇప్పుడు మీమాట వినకపోడానికి ఒక కారణముంది’’ అన్నాడు వినయంగా.

‘‘ఏమిటది?’’ అడిగాడు గురువు ఆశ్చర్యంగా ..‘‘అసలే వర్షాకాలం రోజులు. వాగేమో ఉధృతంగా ప్రవహిస్తోంది. అలాంటి పరిస్థితుల్లో వాగు దాటేటప్పుడు ఏదైనా ప్రమాదం సంభవిస్తే, నేనొక్కణ్ణే కొట్టుకుపోతాను. ఒకవేళ మీరు ముందుగా వాగు దాటితే, దురదృష్టవశాత్తూ అలాంటి ప్రమాదమేమైనా మీకు గాని జరిగితే, మీతోపాటు వేలాదిమందిని ముంచినవాణ్ణి అయిపోతాను.’’ అన్నాడు శిష్యుడు.. ‘అదేమిటి.. అదెలా?’’ అన్నాడు గురువు ఆశ్చర్యంగా.. ‘‘గురువర్యా.. అదంతే.. నాలాంటి వేలమంది శిష్యులు కలిసి కూడా మీలాంటి ఒక గురువును తయారు చేయలేరు. అదే మీరు చల్లగా ఉంటే, నాలాంటి శిష్యుల్ని వేలాదిమందిని తయారు చేయగలరు.’’ అన్నాడు శిష్యుడు. శిష్యుని మాటలు విన్న గురువు అమితానంద భరితుడై శిష్యుణ్ణి మనసారా దీవించాడు. అతడి ఉన్నతి కోసం దైవాన్ని ప్రార్థించాడు. ఆ శిష్యుడు సికిందర్‌ చక్రవర్తి అయితే గురువు అరిస్టో.

ప్రపంచ విజేతగా ప్రఖ్యాతి పొందిన యూనాన్‌ చక్రవర్తి సికిందర్‌ను ‘తండ్రి ఔన్నత్యం గొప్పదా.. గురువు ఔన్నత్యం గొప్పదా..’ అని అడిగితే, ‘తండ్రి నన్ను ఈలోకంలోకి తీసుకు వచ్చాడు. నా ఉనికికి కారణం ఆయన. అయితే, గురువు నన్ను, నా స్థానాన్ని ఆకాశానికెత్తాడు.’ అని సమాధానం చెప్పాడు.పవిత్ర ఖురాన్‌లో సైతం దేవుడు, ప్రవక్తవారి ముందు అనుచరుల్ని పెద్దగా గొంతెత్తి మాట్లాడకూడదని ఆదేశించాడు. అందుకని, తల్లిదండ్రులు, పెద్దలు, గురువుల పట్ల వినయ విధేయతలతో మసలుకోవాలి. వారిని గౌరవించాలి. వారి ఆశీర్వాదాలు, దుఆలు పొందాలి. అంతేకానీ, గురువును అవహేళన చేయడం, గురు నింద చేయడం తగదు.
– ముహమ్మద్‌ ఉస్మాన్‌ ఖాన్‌

మరిన్ని వార్తలు