అబ్బా! వివక్ష!

2 Nov, 2017 23:42 IST|Sakshi

వైరల్‌ అనగానే వైరల్‌ ఫీవర్‌ వచ్చినట్లు ఒణికిపోవడం ఇప్పుడు పాత మాట. వాట్సప్, ఫేస్‌బుక్, ఇన్‌స్ట్రాగ్రామ్, ట్విటర్‌లలో ఒక పోస్టు ఎక్కువ మందిని ఆకర్షించిందంటే వైరల్‌ అయిందనిపార్టీ చేసుకునే కాలమిది.బిల్‌గేట్స్‌ ఇండియన్‌ పేరెంటింగ్‌ మీద వెలిబుచ్చిన అభిప్రాయాలు అని ఒక పోస్ట్‌ తాజాగా వైరల్‌ అవుతోంది. ఇంతకీ ఆ పోస్ట్‌లో బిల్‌గేట్స్‌ ఏమన్నారో తెలుసా?‘‘ఇండియాలో తల్లిదండ్రులకు కొడుకులంటే పరమ అసహ్యం. వాళ్లకు ఏమీ నేర్పించరు. ఒక కప్పు కాఫీ కలపడం కాదు కదా గ్యాస్‌ స్టవ్‌ కట్టేయడం కూడా రాని బడుద్దాయిల్లా తయారుచేస్తున్నారు తల్లిదండ్రులు. ఆడపిల్లలను మాత్రం అత్యంత జాగ్రత్తగా పెంచుతున్నారు. వాళ్లకు నేర్పని స్కిల్‌ లేదంటే అతిశయోక్తి కాదు. లైప్‌ స్కిల్స్‌తోపాటు ఫైన్‌ ఆర్ట్స్‌లోనూ ప్రావీణ్యంసాధించేలా తీర్చిదిద్దుతున్నారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొని నిలబడగలిగిన స్థైర్యం ఉండేటట్లు తయారవుతున్నారు అమ్మాయిలు. ఎటొచ్చీ అబ్బాయిలే కొరగాకుండాపోతున్నారు.

వాళ్లకు తమ ప్రయాణానికి బట్టలు సర్దుకోవడం కూడా రాదు. ఏది ఏమైనా తల్లిదండ్రులకు ఇది తగదు. పిల్లలందర్నీ సమానంగా ప్రేమించాలి, సమానంగా అన్ని పనులూనేర్పించాలి. మగపిల్లలను నిస్సహాయులుగా చేయడాన్ని ప్రశ్నించాలి. ఇంట్లో మగవాళ్లకు సమాన హక్కులు కావాలని కోరుతూ పిటిషన్‌ దాఖలు చేయాల్సిన అవసరం ఉంది’’. దీనిని ఎవరు రాశారో గాని, ఈ సెటైర్‌ భారతీయ సమాజాన్ని గిలిగింతలు పెట్టినట్లే అనిపిస్తూ అమ్మాయిల పట్ల చూపిస్తున్న వివక్షను తెలియచేస్తోంది.

మరిన్ని వార్తలు