బాల్యం ఎదుర్కొనే విషాదం

11 May, 2020 08:35 IST|Sakshi

కొత్త బంగారం

నవల: ద డిస్‌కంఫర్ట్‌ ఆఫ్‌ ఈవెనింగ్‌
రచన: మరీక్‌ లూకస్‌ రైన్‌వెల్డ్‌
మూలం ప్రచురణ: 2018
డచ్‌ నుంచి ఇంగ్లిష్‌: మిషెల్‌ హచిసన్‌

ఇరవై ఆరేళ్ల వయసులో మరీక్‌ లూకస్‌ రైన్‌వెల్డ్‌ రాసిన ఈ డచ్‌ నవల (2018) నెదర్లాండ్స్‌లో బెస్ట్‌ సెల్లర్‌. మిషెల్‌ హచిసన్‌ ఇంగ్లిష్‌ అనువాదం ‘ద డిస్‌కంఫర్ట్‌ ఆఫ్‌ ఈవెనింగ్‌’ యు.కె.లో ఫేబర్‌ ప్రచురణ సంస్థ ద్వారా ఈ సంవత్సరం విడుదలై బుకర్‌ ఇంటర్నేషనల్‌–2020 అవార్డుకి షార్ట్‌లిస్ట్‌ అయింది.

యాస్‌ అనే పదేళ్ల అమ్మాయి ఈ నవలకి కథకురాలు. ఈ శతాబ్దపు ప్రారంభం కథాకాలం. నెదర్లాండ్స్‌లోని ఒక పల్లెటూళ్లో నివసించే ఆ వ్యవసాయ కుటుంబానికి దైవభక్తి, మత విశ్వాసాలు మెండు. తను పెంచుకుంటున్న కుందేలుని క్రిస్మస్‌కి తండ్రి చంపేస్తాడేమోనని యాస్‌కి అనుమానం. క్రిస్మస్‌ ఇంకో రెండుమూడు రోజులున్నప్పుడు, యాస్‌ సోదరుడు మాథియాస్‌ స్కేటింగ్‌కి వెళ్తుంటే తనూ వస్తానంటుంది. ఇంకోసారి వద్దువులే అని వెళ్లిపోతాడు. దేవుడు నా కుందేలుకి బదులుగా వీణ్ణి తీసుకెళ్లొచ్చుగా అనుకుంటుంది. అనుకున్నట్టుగానే ఆరోజు జరిగిన ప్రమాదంలో మాథియాస్‌ మరణిస్తాడు. అకస్మాత్తుగా జరిగిన ఈ ఘోరానికి తల్లిదండ్రులు తల్లడిల్లిపోతారు. తల్లయితే, తినడం పూర్తిగా మానేస్తుంది; తండ్రి ఈ దుఃఖం నుంచి తప్పించుకోవడానికి తన ఆవులు, వాటి పోషణ వ్యవహారాల్లో పూర్తిగా మునిగిపోతాడు.

జరిగిన విషాదానికి లోలోపలే కుమిలిపోతున్న పిల్లలు – యాస్, చెల్లెలు హానా, తమ్ముడు ఓబ – వాళ్ల వాళ్ల దుఃఖాలకి ఉపశమనాలని వాళ్లే వెతుక్కోవాల్సి వస్తుంది. తల్లిదండ్రులు సఖ్యంగా లేకపోవడం వాళ్లకి అదనపు ఆందోళన. పర్యవేక్షణ కరువైన పిల్లలు, రకరకాల పరిష్కార మార్గాలలో పడతారు. యాస్‌ ఫాంటసీలలో కూరుకుపోగా, హానా ఇవన్నీ వదిలేసి ఇంకో ప్రపంచానికి వెళ్దామంటుంది. ఓబ హింసనీ, క్రూరత్వాన్నీ ఆశ్రయిస్తాడు. వీళ్లందరిలోనూ సామాన్యాంశం లైంగిక భావనలు. చాలాసార్లు వీళ్లు ఇన్సెస్ట్యువస్‌గా ప్రవర్తించడం కూడా కలవరపరుస్తుంది. వంటిమీది కోటును విప్పకుండా వేసుకుని తిరుగుతుండే యాస్‌కి అదనంగా మలబద్ధకం ఒక భౌతికమైన సింప్టమ్‌గా స్థిరపడుతుంది. కూతుర్ని కూడా ఒక పశువులాగా చూసే తండ్రీ, ద్రోహచింతనతో తిరుగుతూండే వెటర్నరీ డాక్టర్‌ మరికొన్ని వికృతాంశాలు.

ఇది అందరూ చదివి ఆస్వాదించగలిగిన నవల అయితే కాదు. జుగుప్సని కలిగించే భాగాలు ఎక్కువగా ఉండటం వలన, పాత్రల దుఃఖం పట్ల పాఠకుడి సహానుభూతి చెదిరిపోతుంది. నవలకీ, పాఠకుడికీ మధ్యనున్న ఆ సన్నని దారం తెగిపోగానే నవల భారవంతం అవుతుంది. కథనంలో చోటుచేసుకున్న అలాంటి సవివరణాత్మక భాగాలు బహుశా అన్ని సంస్కృతుల్లోనూ సమానమైన ఆదరణ పొందలేకపోవచ్చు.

కథన బాధ్యతని పది పన్నెండేళ్ల అమ్మాయికి అప్పచెప్పినప్పుడు, అది తూకం తప్పకుండా చూసుకోవాల్సి ఉంటుంది. యాస్‌ కథనస్వరం వయసుకి మించిన స్థాయితో ఆమె మానసిక ఆరోగ్యాన్ని శంకించేలా ఉంటుంది. పాత్ర వయసు, కథన స్థాయిల వల్ల కథనం అసలు నమ్మదగినదేనా అన్న అనుమానం వస్తుంది. ఈ నవల ప్రారంభంలో జరిగిన కీలకమైన సన్నివేశం తర్వాత, నవలలో ‘ప్లాట్‌’ అంటూ పెద్దగా లేకపోగా, మిగిలిన నవలంతా చిన్నచిన్న ప్రహసనాల కూర్పులాగా సాగుతుంది. పాఠకుడు నవలతో బాటుగా ప్రయాణించలేకపోవడానికి ఇది మరో అవరోధం.

దుఃఖాన్ని వ్యక్తీకరించే పద్ధతి ఒక్కొక్కరికీ ఒక్కోలా ఉంటుందని అంగీకరించవచ్చు. కొన్ని సందర్భాలలో అవి వికృతరూపాలని తీసుకుంటాయనీ, ఆ దుఃఖం ఒక వ్యాధిలాగా రోగలక్షణాలని కలగజేస్తుందనీ కూడా నమ్మవచ్చు. మరొకరితో – ముఖ్యంగా తల్లిదండ్రులతో – పంచుకోలేని దుఃఖం, సమసిపోవడం కష్టమని కూడా అంగీకరించవచ్చు. అందువల్లనే కథకురాలు నవలలో చెప్పిన ముగింపుకి చేరుకుని ఉండవచ్చు. ఇవన్నీ పాఠకుడి అనుభవంలోకి సున్నితంగా తీసుకురావలసిన బాధ్యతని తీసుకోవాల్సిన కథనం– అసంబంధిత సంఘటనల సమాహారంగా మొనాటనస్‌గా సాగితే, పాఠకుడి ఉద్వేగాల ప్రయాణం ప్రమాదభరితమవుతుంది. జుగుప్సని కలిగించే అంశాలని దారుణమనిపించేటంత పచ్చిగానూ, వికారమనిపించేటంత గ్రాఫిక్‌గానూ అందించడాన్ని అంగీకరించలేని పాఠకుల విషయంలో ఆ ప్రమాదం రెట్టింపవుతుంది. ఈ నవల అలాంటి ప్రమాదపు అంచుల దాకా వెళ్లింది. అంతిమంగా ఈ నవల అవార్డుని గెలుచుకుంటే అందులో ఆశ్చర్యపడవలసింది ఏమీ ఉండదు గానీ, అభినందించదగినది కూడా ఏమీ ఉండదు!

- ఎ.వి. రమణమూర్తి

మరిన్ని వార్తలు