సమాంతర సంస్కృతి నిర్మాణ దిశలో...

25 Feb, 2018 01:34 IST|Sakshi

చలం ‘స్త్రీ’లో తరతమ భేదాలతో ప్రస్తావించిన కామం – మోహం – ప్రేమ అన్న మూడు మాటలు లైంగిక వేధింపుల గురించి మాట్లాడాల్సిన ఈ సందర్భంలో పదేపదే గుర్తుకు వస్తున్నాయి. స్త్రీ పురుషుల మధ్య యవ్వన సహజమైన ఆకర్షణకు గౌరవకరమైన, బాధ్యతాయుతమైన వ్యక్తీకరణ ప్రేమ. పెళ్లి, సహజీవనం దాని పరిణామాలు. అద్వైతానుభవాన్ని ఇచ్చే లైంగిక సంబంధం అందులో భాగం. ఒకరి కోసం ఒకరు నిలబడటం, ఒకరి కొరకు ఒకరు దేన్నయినా త్యాగం చేయటానికి సిద్ధపడటం, ఇద్దరూ కలిసి ఒక ఉన్నత గమ్యం వైపు సాగడం.. ఇవన్నీ స్త్రీ పురుషుల సంబంధాన్ని మానవీయం చేసే విలువలు. మోహంలో ఆకర్షణ, ఆరాధన ప్రధానం.

కామంలో ఉండేది ఆకర్షణ మాత్రమే. అయినా అందులోనూ ఇద్దరి ఇచ్ఛ ఉంటుంది. స్త్రీ ఇచ్ఛతో నిమిత్తం లేకుండా ఆమె శరీరం – లైంగికత మీద పురుషుడి అధికార అహంకార ప్రకటనగా, ఆధిక్యత స్థాపనగా జరిగేవే లైంగిక వేధింపులు, అత్యాచారాలు. ఇందుకు బలిౖయెన స్త్రీల జీవిత సంఘర్షణలను, మానసిక వేదనలను, మానవ సంబంధాలపై వాటి ప్రభావాలను నమోదు చేస్తూ వచ్చిన, వస్తున్న కథలు సమాంతర సంస్కృతి నిర్మాణాన్ని ప్రతిపాదిస్తున్నాయి.

అబ్బూరి చాయాదేవి ‘ప్రయాణం’ (1965) కథకు – సమీప బంధువులు, సన్నిహితులు, స్నేహితులు అయిన పురుషుల వల్ల అత్యాచారానికి గురి అయ్యే విద్యావతి అయిన స్త్రీ వేదన.. సంస్కారవంతుడైన యువకుడి నుంచి ఆమెకు లభించిన ఊరట వస్తువు. కాళీపట్నం రామారావు ‘హింస’ (1968) కథలో – పొగాకు కంపెనీలో కూలికి వెళ్లిన గొల్ల పైడమ్మ మోసపోయి అత్యాచారానికి గురై అత్తింటి వారి చేత వెళ్లగొట్టబడి, పుట్టింటికి వెళ్లే ధైర్యం లేక పట్నం వెళ్లి చివరకు వేశ్యగా తేలిన విషాదం వస్తువు. అంతకన్నా విషాదం.. ఇంటికొచ్చిన కూతురిని కుల కుటుంబ మర్యాదల ఒత్తిడికి, రెండవ కూతురి భవిష్యత్తు భయానికి తలవొగ్గి ఆదరించలేక తల్లి పడిన వేదన.

వాడ్రేపు చినవీరభద్రుడి ‘సుజాత’ కథ (1990) పోలీసు స్టేషన్లో అత్యాచారానికి గురైన అమ్మాయి అంతరంగ వేదన. కుటుంబంలో, లోకంలో బాధిత స్త్రీల పట్ల విమర్శ, సానుభూతి, ఔదార్యం వంటివి ఆత్మగౌరవానికి ఎలా భంగకరంగా ఉంటాయో ఈ కథ సూచిస్తుంది. ఉద్యోగాలు చేయడానికి బయటకు వచ్చే ఆడపిల్లలు పనిప్రదేశాల్లో పొంచి ఉన్న అత్యాచార ప్రమాదాలను ఎప్పటికప్పుడు కనిపెడుతూ తమదైన మార్గాలలో తప్పించుకోవటానికి చేసే యుద్ధాన్ని కేతు విశ్వనాథరెడ్డి రాసిన ‘రెక్కలు’ కథ నిరూపిస్తుంది.

పేదరికం, ప్రలోభం తరచూ స్త్రీలపై అత్యాచారానికి కారణమై అణగతొక్కెయ్యడాన్ని తల్లావఝల పతంజలి శాస్త్రి రాసిన ‘సుర్మా’ (1993) నల్లూరి రుక్మిణి రాసిన ‘మృత్యు స్పర్శ’ (2002) కథలు చిత్రించాయి. 1994లో ఐదారేళ్ల పసిపిల్ల శ్వేత, అలాంటి మరికొందరు చిన్న పిల్లల మరణాలకు కారణమైన అత్యాచారాలకు ప్రతిస్పందిస్తూ ఓల్గా ‘అయోని’ కథ రాసింది.  మధురాంతకం నరేంద్ర రాసిన ‘అత్యాచారం’ కథ (1991) అనేక అనేక అంతరువులలో యథేచ్ఛగా సాగిపోయే ఆర్థిక అత్యాచారాలను చిత్రిస్తుంది.

బతుకుతెరువు పోరులో గాలివాటుకు కొట్టుకుపోయే పేదవర్గాల స్త్రీలు తమపై అత్యాచారం జరిగిందో లేదో పట్టించుకొనే పరిస్థితిలో లేకపోవడాన్ని గుర్తించి చెప్పాడు కథ ముగింపులో రచయిత. సామ్రాజ్యవాద పెట్టుబడి మాయలో ఈనాడు స్త్రీలందరి పరిస్థితీ అదేనేమో..

– కాత్యాయనీ విద్మహే, సాహిత్య విమర్శకురాలు,కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత

మరిన్ని వార్తలు