శీలాపనిందలు

26 Feb, 2018 00:32 IST|Sakshi

లేని నిందల్ని నీలాపనిందలు అంటారు. శీలం ఉన్నా లేదని అంటే? అది శీలాపనిందే అవుతుంది. మహిళపై దాడికి గొడ్డళ్లు, కొడవళ్లు అక్కర్లేదు. శీలం మీద ఇంత బురద చల్లితే చాలు.. తను చచ్చిపోతుందనుకుంటారు. ఊహు.. మేం ఒప్పుకోం. మా చెల్లి తామరాకు. తనకు ఏ బురదా అంటుకోదు. ఈ కేస్‌ స్టడీ చదవండి. మగాడి నీచత్వం, స్త్రీ ఔన్నత్యం తెలుస్తుంది.

‘ఈమె డాక్టర్‌ సౌమ్య. గుడ్‌ రీసెర్చర్‌ ఇన్‌ ట్రైబల్‌ డెవలప్‌మెంట్‌. పోస్ట్‌ లంచ్‌ సెషన్‌లో ప్రజంటేషన్‌ ఇస్తారు’ మిస్టర్‌ మీనన్‌కి నన్ను పరిచయం చేశారు మా డైరెక్టర్‌. మీనన్‌ చిరునవ్వుతో గ్రీట్‌ చేశారు. ‘విమెన్‌ ఎంపవర్‌మెంట్‌ మీద మీ పేపర్‌ చదివాను. ఎ గుడ్‌ ఐ – ఓపెనర్‌’ అన్నారు మీనన్‌. చాయ్‌ తాగుతూ ఆ సబ్జెక్టు గురించి పది నిమిషాలు మాట్లాడుకున్నాం. దూరం నుంచి రెండు కళ్లు నా వైపు పదేపదే పరిశీలనగా చూస్తున్నాయి.

బహుశా ఇప్పుడు ‘అతడు’  మరో ‘కుట్రకథ’ అల్లుతూ ఉంటాడనుకుంటాను. గిట్టని స్త్రీల ‘క్యారెక్టర్‌’తో అడుకోవడం.. రాజకీయం చేయడం.. రకరకాల కథలల్లడం అతడి అలవాటు. ఉద్యోగ జీవితంలో పైకి రావడానికి వీటినే నమ్ముకున్నాడు అతడు. ఇక్కడ  ‘అతడు’ అంటే అతడొక్కడే కాదు సుమా!‘అతడు’ లాంటి ఇంకొందరి గురించి కూడా నేను మాట్లాడుతున్నా.

ట్రైబల్‌ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్టును బాగా చేశానని ప్రశంసించారు మా డైరెక్టర్‌. కొత్త ప్రాజెక్టుల గురించి అరగంటసేపు చర్చించారు. చాలా సంతోషంగా అనిపించింది. అది నా కష్టానికి లభించిన గుర్తింపు. ఆ లెవిల్‌కి రాలేకపోయాడు ‘అతడు’. సంస్థలో తనకు ప్రాధాన్యత లేకపోవడం భరించలేకపోయాడు. ఒక ఉద్యోగినిగా నన్ను ‘చంపేసేందుకు’ పావులు కదిపాడు. ‘క్యారెక్టర్‌’పై కథలల్లాడు. ఆమె ఉద్యోగం చేయదు.. ఆవిడగారి కోసం ఎవరెవరో వచ్చిపోతుంటారు..  డైరెక్టర్‌కు ఆమె చాలా స్పెషల్‌.. ఇట్లాంటి మాటలు అనేకంగా ప్రచారంలో పెట్టాడు అతడు.

మొదట్లో నేనెంత భయపడిపోయానంటే – సీటులో నుంచి కదల బుద్ధయ్యేది కాదు. నా చుట్టూ ఉన్న వాళ్లని తప్పించుకుని తిరగడం మొదలుపెట్టాను. డైరెక్టర్‌ సార్‌ దగ్గరకి వెళ్లడం బాగా తగ్గించేశాను. నాది వైబ్రెంట్‌ పర్సనాలిటీ అని ఎక్కడైతే కితాబులు అందుకున్నానో అక్కడే నాలోకి నేను ముడుచుకుపోయాను. తట్టుకోలేక ఏడుస్తూ అమ్మకు అన్నీ చెప్పేశాను. ‘ఎవడు ఎంత  చెత్త వాగినా పట్టించుకోవద్దు. పని చేసుకుంటూ పో’ అని సలహా ఇచ్చింది మా అమ్మ.  నా వల్ల కాలేదు. కావడం లేదు. తరచూ మనసంతా ఒత్తిడి. ఎడతెరిపి లేని ఆలోచనలు. ‘అమ్మ కూడా ఈ విషప్రచారం నమ్మేస్తే..’ అనే ఆలోచన వచ్చినప్పుడు మరింత దుఃఖం.

‘సౌమ్య హజ్బెండ్‌ నిన్న ఇక్కడికొచ్చాడు.  చాలా పెద్ద హోదాలో ఉన్నాట్ట’ ‘మరెందుకో ఈవిడగారికి ఉద్యోగాలు...   హాయిగా ఇంటిపట్టున ఉండొచ్చు కదా’ ‘వాళ్ల రిలేషన్‌షిప్‌ లీగలా? ఇల్లీగలా?’ ‘ఆ పైవాడికే తెలియాలి.  అతడే భర్తని ఆమె చెప్పుకుంటూ ఉంటది’ ఇలాంటి సంభాషణలకు నారు పోసి నీరు పెట్టింది ‘అతడే’. లేడీ డేటా ఎంట్రీ ఆపరేటర్లు ఇలాంటి మాటలు విన్నప్పుడు కుతకుతలాడిపోతుంటారు. మరి వాళ్లు కూడా ‘అతడి’ బాధితులే. నేను రకరకాల ఆలోచనలతో కుంగిపోవడం గమనించాక  – లైంగిక వేధింపుల వ్యతిరేక కమిటీకి ఫిర్యాదు చేయమన్నారు నా హజ్బెండ్‌.  ఈలోపే ఇంకో ఘోరం. ప్రమోషన్‌ లిస్ట్‌లో నా పేరు లేకుండా బోయింది. మనసంతా దిగులు కమ్మేసింది. 

  ఎన్నో మెచ్చుగోళ్లు.. 30 – 40 పబ్లికేషన్లు.. మంచి మంచి లెక్చర్లు.. ఛాలెంజింగ్‌ ప్రాజెక్టులు.. ఇవేమీ అక్కరకు రాలేదు. ఇలాంటి అకడమిక్‌ రికార్డ్‌ లేనప్పటికీ ప్రమోషన్‌ కొట్టేశాడు ‘అతడు’. మీకు ఉద్యోగాలెందుకు? జీతాలెందుకు? అని నా ఎదుటికొచ్చి ప్రశ్నిస్తున్నాడంటే అతడికి ఎంత దురహంకారం? మనిషిగా, ఒక పౌరురాలిగా నా హక్కుల్ని నిరాకరిస్తున్నాడు ఆ సెక్సిస్ట్‌. నన్ను సర్‌పాస్‌ చేయమని నా మగ సబార్డినేట్లను పురిగొల్పుతున్నాడు.  కొత్తగా వచ్చిన డైరెక్టర్‌ ‘నా జేబులోనే ఉన్నాడు’ అని ఒకటే ప్రేలాపనలు.

ఓ వైపు ఆఫీసులో నా ప్రతిపత్తిని దిగజార్చే కుట్రలు. మరోవైపు నా గురించి ఇంటా బయటా ఏమనుకుంటున్నారోననే భయాలు. ఆలోచనలతో అలసిపోయేదాన్ని. యాంగ్జయిటీ తీవ్రమైనప్పుడు ఇర్రెగ్యులర్‌ పీరియడ్స్‌. భరించలేనంత బ్లీడింగ్‌. షాక్‌కు గురై ఆసుపత్రిలో చేరిన సందర్భాలున్నాయి. అబార్షన్లు కూడా అయ్యాయి. డాక్టర్‌ ఇచ్చిన మందులు వాడకపోతే పని చేయలేను. మందులు మింగితేనే నిద్ర. ఇలాంటి పరిస్థితుల్లోనే –  ఇంటెర్నల్‌ కంప్లయింట్స్‌ కమిటీ (ఐసీసీ) చైర్‌పర్సన్‌ అపాయింట్‌మెంట్‌ కోరాను. నెలరోజులు గడిచినా నాకు టైమ్‌ ఇవ్వలేదు.

అకడమిక్‌ రంగంలో నాకున్న పరిచయాల ద్వారా ఒకలాంటి ఒత్తిడి తెస్తే గానీ ఆమె నా కంప్లయింట్‌ స్వీకరించలేదు. కానీ ఆమె నా మ్యారేజ్‌ సర్టిఫికెట్‌ తీసుకురమ్మన్నారు. తట్టుకోలేకపోయాను. దుఃఖాన్ని  దిగమింగుకుంటూ బయటకొచ్చాను. నాది చట్టబద్ధ వివాహం. పేరెంట్సే చేశారు. అయినా, పెళ్లికీ – కేసుకీ సంబంధమేంటి? చట్టం రిలేషన్‌షిప్స్‌ని స్క్రూటినీ చేయమందా? ఇదెక్కడి న్యాయం? మ్యారేజ్‌ సర్టిఫికెట్‌ ఇచ్చాను ఐసీసీ చైర్‌పర్సన్‌కి. పదుల సంఖ్యలో అమ్మాయిల్ని విచారించారు. అందరూ ‘అతడి’కి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పినవారే. వారంతా ‘అతడి’ బాధితులే.

కమిటీ అతణ్ణి దోషిగా నిర్ధారించింది. ట్రాన్స్‌ఫర్‌ చేయాలని నిర్ణయించింది. కానీ ఆ నిర్ణయం అమలు కాలేదు. నన్ను ఎవ్వరూ ఏమీ చేయలేరని విరగబడి నవ్వుతున్నాడు ‘అతడు’. ఆఫీసు వాతావరణం నానాటికీ శత్రుపూరితంగా తయారవుతోంది నాకు. విమెన్స్‌ కమీషన్‌కు మొర పెట్టుకున్నాను. కేంద్రంలోని మూడు మంత్రిత్వ శాఖలకు లేఖలు రాశాను. న్యాయం కోసం ఇంకెన్నాళ్లు ఎదురుచూడాలి నేను? మనఃశరీరాలను మెలిపెట్టే ఈ వేదన నుంచి నాకు విముక్తి ఎప్పుడు? (సౌమ్య కేస్‌ స్టడీ) – వి.ఉదయలక్ష్మి

ఐసీసీ తీర్మానాలకు కట్టుబడాల్సిందే..
లైంగిక వేధింపుల నిరోధక చట్టం ప్రకారం –  అంతర్గత ఫిర్యాదుల కమిటీ (ఐసీసీ) చేసిన రికమండేషన్లను సంస్థల యాజమాన్యాలు తప్పకుండా అమలు చేయాలి. కానీ సౌమ్య కేసులో అలా జరగలేదు. ఒకవేళ ఐసీసీ సిఫారసుల పట్ల అసంతృప్తిగా ఉన్నట్టయితే సంస్థ మళ్లీ విచారణ జరిపించవచ్చు. కొన్ని కార్పొరేట్‌ సంస్థల్లో మాదిరిగా ఎథిక్స్‌ కమిటీ వేసి, కేసును పరిశీలనకు పెట్టొచ్చు. ఇలాంటి కేసుల్లో యాజమాన్యాల వైపు నుంచి న్యాయం జరగనప్పుడు లేదా ఐసీసీ రికమండేషన్లపై అసంతృప్తి ఉన్నప్పుడు.. న్యాయవ్యవస్థను ఆశ్రయించాలంటోంది చట్టం.

కానీ, ఐసీసీ విచారించిన కేసును మళ్లీ కోర్టు ముందుకు తోయడమంటే.. చట్టంలో లోపమున్నట్టే. అసలు సున్నితమైన ఇలాంటి అంశాల్లో కోర్టులకు వెళ్లేందుకు దాదాపు ఎవ్వరూ ఇష్టపడరు కూడా. ఈ నేపథ్యం నుంచే చట్టం రూపుదిద్దుకుంది. చట్టం ఐసీసీల ఏర్పాటును తప్పనిసరి చేసింది. మినీ కోర్టుల్లాంటి ఐసీసీల సిఫారసుల విషయంలో సంస్థలు సెన్సిటివ్‌గా ఉండాలి. ఆ సెన్సిటివిటీ లోపించడం వల్లే సౌమ్య కేసులో జాప్యం జరుగుతున్నట్టు అగుపిస్తోంది. ఈ జాప్యాన్ని నివారించేగలిగే / పరిస్థితిని చక్కదిద్దగలిగే మెకానిజమ్‌ ఏర్పాటు కావాల్సిన అవసరముంది. చట్టంలో లోపాల్ని సవరించాల్సి వుంది. – బి. గిరిజ, తెలంగాణ స్టేట్‌ ప్రాజెక్ట్‌ మేనేజర్, ‘సఖి’

ప్రశ్నించే ఫోరమ్స్‌ పెంచుకుందాం
వేధింపులు సహా స్త్రీలు ఎదుర్కొనే రకరకాల హింసల్నీ, వాళ్ల హక్కుల్నీ హేళన చేసే వాతావరణం మన చుట్టూ అలముకుంది. (సౌమ్య కేసులో ఇదే జరిగింది.) సీరియల్స్‌లో ఇలాంటి వాతావరణమే కనిపిస్తోంది. కుటుంబ హింస, రేప్‌ వంటివన్నీ ఇందులో ఉంటాయి. కానీ వాటిని ఎలా డీల్‌ చేయాలనేదానిపై ఒక సైంటిఫిక్‌ – థియరిటికల్‌ యాటిట్యూడ్‌ లేదు. పోలీస్‌స్టేషన్‌కు వెళ్లిన బాధితురాలితో – ఎక్కువ మాట్లాడితే నువ్వే వేధిస్తున్నట్టు కేసు పెడతానంటాడు పోలీసు.

మరోవైపు, నెగిటివ్‌ క్యారెక్టర్‌ కుటుంబ హింస జరగకపోయినా జరిగినట్టు కేసు పెట్టించగలుగుతుంది. ఈ సీరియల్స్‌ ప్రకారం.. కోడళ్లందరూ అత్తలను హింసిస్తారు. కానీ తమను అత్తలే హింసిస్తున్నట్టు కేసులు పెడతారు. పోలీసులు వాటిని స్వీకరిస్తారు. ఈ తరహా ఇమేజస్‌ సమాజాన్ని ప్రభావితం చేస్తున్నాయి. దాదాపు అన్ని సీరియల్స్‌ ఇలాంటి తప్పుడు భావనలే వ్యాప్తి చేస్తున్నాయి. ఇలాంటి ధోరణుల్ని ప్రశ్నించే ఫోరమ్స్‌ మరిన్ని ఏర్పడాలి. ‘హింస’మీద డిబేట్‌ జరగాలి. – కె. సజయ, సామాజిక కార్యకర్త

కౌన్సెలింగ్‌ అవసరం
సౌమ్యలో యాంగ్జయిటీ, డిప్రెషన్‌ లక్షణాలు కనిపిస్తున్నాయి. వీటి నుంచి బయటపడాలంటే కౌన్సిలింగ్‌కు సిద్ధపడాలి. అవసరాన్ని బట్టి మందులూ వాడాలి. ఆమెను బలహీనపరచే ఆలోచనల్ని కౌంటర్‌ చేయాలంటే ఒక సిస్టమాటిక్‌ – సైంటిఫిక్‌ అండ్‌ స్ట్రక్చరల్‌ అప్రోచ్‌ అవసరం. సైకాలజిస్టును కలసినట్టయితే – బాధితురాలికి బాధల నుంచి, ఆమెను వ్యాకులపరిచే ఆలోచనల నుంచి ఎలా బయటపడాలో నేర్పిస్తారు. కుటుంబ సభ్యులు ఆమె సమస్యల పట్ల సహానుభూతితో స్పందించడం, ‘నీకు మేమున్నాం’ అనే భరోసా ఇవ్వడం చాలా ముఖ్యం. – డాక్టర్‌ సి.వీరేందర్, కౌన్సెలింగ్‌ సైకాలజిస్ట్‌

మరిన్ని వార్తలు