వాళ్లు వాడేశారు... వీళ్లు పాడేశారు!

14 Feb, 2017 23:29 IST|Sakshi
వాళ్లు వాడేశారు... వీళ్లు పాడేశారు!

కాలంపాట

వాడి పడేసిన వస్తువులకు ఏ విలువా ఉండదు. ఒకవేళ విలువ ఉందీ అంటే ఆ వస్తువును వాడి పడేసింది ఎవరో ప్రముఖులై ఉండాలి. ఈ ఫోన్‌ను చూడండి. రెండో ప్రపంచ యుద్ధ కాలం నాటిది! దీన్ని వాడిందెవరో తెలుసా? జర్మనీ నియంత అడాల్ఫ్‌ హిట్లర్‌. గిర్రున డయల్‌ తిప్పి కాల్‌ చేసి, ‘చంపేయండి’ అని అదేశాలు జారీచేసి లక్షల మంది యూదు జాతీయుల్ని ఈ ఫోన్‌ ద్వారానే హిట్లర్‌ హతమార్చాడు. అందుకే దీనికి ‘డెత్‌ ఫోన్‌’ అనే పేరొచ్చింది. హిట్లర్‌ చనిపోయాక ఇది బ్రిటిష్‌ వాళ్ల చేతికొచ్చింది. ఇప్పుడు దీన్ని యు.ఎస్‌.లోని ‘అలెగ్జాండర్‌ హిస్టారికల్‌ ఆక్షన్స్‌’లో ఈ నెల 19న వేలం వేస్తున్నారు. 5 లక్షల డాలర్లకు అమ్ముడుపోవచ్చని అంచనా. సుమారు 3 కోట్ల 35 లక్షల రూపాయలు. ఈ సందర్భంగా.. ప్రసిద్ధ వ్యక్తులు వాడిన ఇలాంటి కొన్ని వస్తువులను, వేలంలో వాటికి వచ్చిన ధరను ఒకసారి చూద్దాం.

జె.కె.రోలింగ్‌ ఛెయిర్‌
హ్యారీ పోటర్‌ రచయిత్రి జె.కె.రోలింగ్‌ తొలినాళ్లలో ఈ కుర్చీమీద కూర్చొనే తన నవలల్ని రాశారు. గత ఏడాది న్యూయార్క్‌లోని హెరిటేజ్‌ ఆక్షన్‌లో ఇది 3,94,000 డాలర్లకు అమ్ముడుపోయింది! సుమారు 2 కోట్ల 64 లక్షల రూపాయలు.

క్వీన్‌ ఎలిజబెత్‌ 2 ప్యాంటీలు
రాజ కుటుంబాల వస్తువులు అరుదుగా వేలం పాటలో దర్శనం ఇస్తాయి. అందుకే ఎక్కువ ధరకు అమ్ముడుపోతాయి. 1968లో రాణిగారి ప్యాంటీల జత ఉన్న లగేజీ పొరపాటున విమానంలో ఉండిపోయింది. ఆ తర్వాత అటు తిరిగి ఇటు తిరిగి ఆ ప్యాంటీలు 2012లో ఈబే అక్షన్స్‌కు వచ్చాయి. 18,000 డాలర్లకు ఎగిరిపోయాయి! సుమారు 12 లక్షల రూపాయలు.

అబ్రహాం లింకన్‌ కళ్లజోడు
2008 హెరిటేజ్‌ ఆక్షన్‌లో జరిగిన వేలంలో అమెరికా అధ్యక్షుడు అబ్రహాం లింకన్‌ కళ్లజోడు 1,79,250 డాలర్లు çపలికింది! సుమారు కోటీ 20 లక్షల రూపాయలు.

మహాత్మాగాంధీ బౌల్, ఫోర్క్, స్పూన్లు
పుణెలోని ఆగా ఖాన్‌ ప్యాలెస్‌లో, ముంబైలోని పామ్‌ బన్‌ మౌస్‌లో ఖైదీగా ఉన్నప్పుడు జాతిపిత మహాత్మాగాంధీ వాడిన ఈ పాత్రలు, స్పూన్లు ‘ఫాల్‌ ఫ్రేజర్‌ కలెక్టిబుల్స్‌’ (ఇంగ్లండ్‌) లో ఇప్పుడు వేలానికి రాబోతున్నాయి. ఇవి మొత్తం కలిపి 94,000 డాలర్లు పలకవచ్చని అంచనా. సుమారు. 62 లక్షల 83 వేల రూపాయలు.

మైఖేల్‌ జాక్సన్‌ ఫెడోరాi
ఫెడోరా అంటే మగాళ్ల టోపి. 1984 అక్టోబర్‌లో చికాగోలో జరిగిన స్టేజ్‌ షోలో పాప్‌ కింగ్‌ మైఖేల్‌ జాక్సన్‌ ఈ ఫెడోరాను ధరించాడు. గత ఏడాది జూలియన్స్‌ ఆక్షన్‌లో ఇది 10,240 డాలర్లకు పోయింది. సుమారు 6 లక్షల 84 వేల రూపాయలు.

మరిన్ని వార్తలు