అయ్యో! పిల్లలకిక చాక్లెట్లు ఉండవా?

23 Feb, 2018 00:03 IST|Sakshi
కకోవా : చాక్లెట్‌ చెట్టు 

అవునా!

ప్రపంచవ్యాప్తంగా ఆబాలగోపాలం అందరూ ఇష్టంగా తినే చాక్లెట్లు కొన్నాళ్లకు ఇక కనిపించకపోవచ్చు. మరో మూడు దశాబ్దాల తర్వాత చాక్లెట్లు పూర్తిగా అంతరించిపోవచ్చని పర్యావరణ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చాక్లెట్ల తయారీకి కకావో వాడతారు. ప్రపంచంలోని కకావో మొక్కల్లో సగానికి పైగా మొక్కలు పశ్చిమాఫ్రికాలోని రెండు దేశాల్లోనే ఉన్నాయి. వీటి ద్వారానే చాక్లెట్‌ తయారీ కంపెనీలకు భారీ పరిమాణంలో ముడి సరుకు సరఫరా అవుతోంది. అయితే, పర్యావరణ మార్పులు ఇదే తీరులో కొనసాగితే, 2050 నాటికి సగటు ఉష్ణోగ్రతల్లో 2.1 డిగ్రీల సెల్సియస్‌ పెరుగుదల నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని, ఆ పరిస్థితుల్లో మనుగడ సాగించలేక కకావో మొక్కలు పూర్తిగా అంతరించే ప్రమాదం ఉందని యూఎస్‌ నేషనల్‌ ఓషియానిక్‌ అండ్‌ అట్మాస్ఫియరిక్‌ అడ్మినిస్ట్రేషన్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు.

కకావో ఎక్కువగా పండే ఆఫ్రికా దేశాల్లో కకావో సాగు పద్ధతులు శతాబ్దాలుగా ఒకే తీరులో కొనసాగుతున్నాయని, సాగు పద్ధతులు ఆధునికతను సంతరించుకోకపోవడం వల్ల కూడా కకావో మొక్కలు ముప్పు అంచులకు చేరుకున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే, ప్రముఖ చాక్లెట్‌ తయారీ సంస్థ ‘మార్స్‌’ ఆర్థిక సహకారంతో బర్కిలీలోని యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియాకు చెందిన శాస్త్రవేత్తలు కకావో మొక్కలు అంతరించిపోకుండా కాపాడేందుకు పరిశోధనలు ప్రారంభించారు.

>
మరిన్ని వార్తలు