పఠించడం కాదు... పారాయణం చేయాలి!

7 Nov, 2017 23:42 IST|Sakshi

ఆత్మీయం

రామాయణం జీవనధర్మ పారాయణం. అందులోని విషయాలు నిత్యజీవితంలో ఎంతగానో ఉపయోగ పడతాయి.  రాముని వంటి (పితృవాక్య) పరిపాలకుడు, సీతవంటి మహాసాధ్వి, వశిష్ఠుని వంటి గురువు, సుమంత్రుని వంటి మంత్రి, లక్ష్మణ భరత శతృఘ్నుల వంటి సోదరులు, గుహుని వంటి ఉదారుడు, హనుమంతుని వంటి బంటు, సుగ్రీవుని వంటి స్నేహితుడు, విభీషణుని వంటి శరణార్థి, రావణ బ్రహ్మ వంటి ప్రతినాయకుడు మరే ఇతర కావ్యంలోనూ కాదు... కాదు ఈ విశ్వవిశాల ప్రపంచంలోనే కానరారు. రాముని కాలంలో ధర్మం నాలుగు పాదాలా నడిచింది. అందుకే నేటికీ ప్రజలు రాముని వంటిరాజుకోసం– రామరాజ్యం నాటి పాలన కోసం పరితపిస్తుంటారు. తులసీదాసు, రామదాసు, కబీరు దాసు వంటి వారందరూ ...‘‘అంతా రామ మయం.... ఈ జగమంతా రామ మయం’’ అని ప్రస్తుతించారు.

లక్ష్మణుడు కైక మీద కోపంతో ఆమెను నిందిస్తుంటే ‘వివేకం కలవారెవరయినా తమకు ఎవరిమీద అభిమానం ఉంటుందో వారిని ప్రశంసించాలే కాని ఇతరులను నిందించడం ధర్మం కాదు’ అని శ్రీరాముడు లక్ష్మణునికి హితవు చెబుతాడు. అంతేకాక ఒకరి గొప్పతనాన్ని ఎక్కువ చేసి చెప్పడానికి, మరొకరిలో ఉన్న  అవలక్షణాలనూ, క్రూరత్వాన్ని బయటపెట్టడం కూడా సక్రమమార్గం కాదని లక్ష్మణునికి రామచంద్రుడు వివరించాడు. ఈ బోధ దేశకాలాతీతంగా మానవత్వం ఉన్న వారందరూ మననం చేసుకుని ఆచరించాలి. ఇలా మన నిత్యజీవితంలో ఆదర్శంగా నడవడానికీ లోక కల్యాణానికి వినియోగపడే రీతిలో బ్రతకడానికి అవశ్యమయిన అనేకానేక ధర్మసూక్ష్మాలు, నీతివాక్యాలూ రామాయణ సాగరంలో దొరికే ముత్యాలు.

మరిన్ని వార్తలు