క్రిస్మస్‌లోని క్రీస్తును మర్చిపోవద్దు!

20 Dec, 2015 01:37 IST|Sakshi
క్రిస్మస్‌లోని క్రీస్తును మర్చిపోవద్దు!

భయంకరమైన ఎడారిలో ఎంతో ఆనందంగా, తృప్తిగా జీవించాడు ఈజిప్టు తత్వవేత్త ఐరేనియస్. ఒకసారాయన అలెగ్జాండ్రియా మహా నగరానికొచ్చాడు. అక్కడి  హడావుడి, అంగళ్లు, సరుకులూ చూసి తెగ సంబరపడ్డాడు. ఈ ఆనందం ఎడారిలో నీకు కరువైందనే కదా దీనర్థం అని దెప్పి పొడిచారు గిట్టనివాళ్లు. ‘అదేం కాదు, నా ఆనందాన్ని, తృప్తిని అణుమాత్రం కూడా పెంచలేని అంశాలిన్ని ఉన్నాయని తెలిసి సంతోషిస్తున్నాను’ అన్నాడాయన.  
 
 
 జనాభా లెక్కల్లో నమోదయ్యేందుకు నజరేతు నుంచి బెత్లెహేముకు వచ్చిన యోసేపు, మరియమ్మలకు అక్కడ నివాస స్థలం దొరకలేదు. దాంతో పశువుల పాకలో తల దాచుకున్నారు. రక్షకుడైన యేసుక్రీస్తు జననం అక్కడే జరిగింది. అక్కడ పశువుల తొట్టి, పొత్తి గుడ్డలే ఆయనకు పూలపాన్పు, పట్టు పరుపులయ్యాయి. అయితే దైవ కుమారుడైన కీ స్తుకు ఈ లోకపరంగా తాము తల్లిదండ్రులమయ్యామన్న దివ్య భావనతో వారిద్దరూ పులకరించిపోయారు. చుట్టూ ఉన్న చీకటి, ఆకలి, వణికించే చలి, దూర ప్రయాణ బడలిక, నిద్ర లేమి, ఒంటరితనం, అక్కడివారి నిరాదరణ... ఇవేవీ యోసేపు, మరియల ఆనందాన్ని అణుమాత్రం కూడా తగ్గించలేకపోయాయి (లూకా 2:8-14).
 
 సచిన్ టెండూల్కర్ సెంచరీ కొడితే, అది చూసి చప్పట్లు కొట్టేవారు ఒక్కరూ లేకపోతే అతనికదెంత బాధాకరం! కాని మరియ, యోసేపుల ప్రయాస, ప్రత్యేకత తెలిసివారు, పూల దండ వేసి అభినందించేవారు అక్కడ ఒక్కరూ లేరు. అయినా కూడా అంతటి అనామక పరిస్థితుల్లో, కటిక పేదరికంలో కూడా వారు దేవునిలో ఆనందించారు. అంతటి భాగ్యాన్నిచ్చిన దేవుని స్తుతించారు. అదే నిజమైన ఆనందమంటే! బాహ్య పరిస్థితుల ప్రభావం దానిపై ఉండదు.
 
  అది విశ్వాసి హృదయపు లోతుల్లో నుండి పెల్లుబుకుతుంది. విశ్వాసంలో అత్యున్నత స్థాయికి ఎదిగి, దైవ సంకల్పాల్లో భాగమైనవారి ప్రత్యేకత ఇది. వారి ఆనందానికి అవధులుండవు. బాహ్య పరిస్థితుల ప్రభావం దానిపైన పడదు. డబ్బుతో పరుపు దొరుకుతుంది కాని నిద్ర దొరకదన్నది అందరికీ తెలిసిన నిజమే! అయినా పరుపుల అమ్మకాల జోరు తగ్గలేదు. నిజమైన నిద్రకు కారణమైన ‘శాంతి’ సాధనకు మానవ ప్రయత్నాలు ముమ్మరం కాలేదు సరికదా అత్యధునాతనమైన పరుపులు సొంతం చేసుకోడానికి జనం నిద్ర మాని మరీ పాకులాడటం రోజూ మనం చూస్తున్నాం.
 
  కోటి రూపాయలుంటే కొందరికానందం. కడుపు నింపే రెండు ముద్దల అన్నం దొరికితే మరికొందరికానందం. కాని త్రాసులో కడుపు నిండిన ఆనందమే ఎక్కువ తూగుతుంది. అయినా శాంతికోసం కాదు. శాంతితో సంబంధం లేని డబ్బు, అధికారం, అందం తదితరాల కోసమే లోకం వెంపర్లాడుతోంది. ఈ నేపథ్యంలోనే యేసుక్రీస్తు ద్వారా పరిమళించిన శాంతి సందేశాన్ని గుర్తు చేస్తోంది.
 శాంతి దూత, దాతయైన యేసు జనన సందేశం పామరులు, నిరుపేదలైన గొర్రెల కాపరులకు అర్థమయ్యింది.
 
  కాని పాలకులైన హేరోదు రాజుకు, పిలాతుకు, నాటి ప్రముఖులైన యూదు పెద్దలకు, యాజకులకు అర్థం కాలేదు. ఆ ఆనందం లభ్యం కాలేదు. రెండు ముద్దల అన్నం తీర్చగల ఆకలి కోసం రెండొందల మాత్రలు మింగడం, ఆద మరచి నిద్రపోలేక మద్యాన్ని, మాదక ద్రవ్యాలను ఆశ్రయించడమే మానవాళి సాధించిన ప్రగతి అయితే... క్రిస్మస్ శాంతి సందేశం, ఆనందం ముమ్మాటికీ వారికే. అందువల్ల క్రిస్మస్ వేడుకల్లో పడి క్రీస్తును విస్మరిస్తే... విందు భోజనం వదిలేసి విస్తరాకు నమిలినట్టే!!
 - రెవ. టి.ఎ.ప్రభుకిరణ్
 దుర్భర పరిస్థితుల్లో, కటిక పేదరికంలోనూ వారు దేవునిలో ఆనందించారు. అంతటి భాగ్యాన్నిచ్చిన దేవుని స్తుతించారు. అదే నిజమైన ఆనందమంటే! అది విశ్వాసి హృదయపు లోతుల్లో నుండి పెల్లుబుకుతుంది.
 

మరిన్ని వార్తలు