ఆకలి లౌకికమా?!

23 Aug, 2018 00:18 IST|Sakshi

చెట్టు నీడ

పండిట్‌ శేఖరమ్‌ గణేష్‌ దియోస్కర్‌ హితవాది పత్రిక సంపాదకుడిగా సుప్రసిద్ధుడు. ఒకరోజు ఆయన తన మిత్రులిద్దరితో స్వామి వివేకానందను కలుసుకోవడానికి వచ్చాడు. ఆ ఇద్దరి మిత్రులలో ఒకరు పంజాబీ అని తెలుసుకున్న స్వామీజీ, అప్పుడు పంజాబ్‌లో నెలకొని ఉన్న తీవ్ర ఆహార కొరతను గురించి వారితో ఆదుర్దాగా మాట్లాడారు. ఆ సమయంలో భారతదేశంలో తాండవిస్తున్న కరువు కాటకాలను గురించే స్వామీజీ మనస్సులో మథన పడుతున్నారు. అందువల్ల వచ్చిన సందర్శకులతో ఆయన ఆధ్యాత్మిక విషయాల గురించి అసలు మాట్లాడనే లేదు.  స్వామీజీ నుంచి సెలవు పుచ్చుకునే సమయంలో ఆ పంజాబీ వ్యక్తి అసంతృప్తి వెలిబుచ్చుతూ ఇలా అన్నాడు : ‘‘మహాశయా, ఆధ్యాత్మికపరమైన విషయాలను మీ ముఖతా వినాలని మేము ఆసక్తితో ఎదురు చూశాం. కాని దురదృష్టవశాత్తూ మన సంభాషణ లౌకిక విషయాల మీదకు వెళ్లింది. మన సమయం వృథా అయిందని భావిస్తున్నాను’’ అన్నారు.

ఈ మాట వినగానే స్వామీజీ గంభీర ముద్ర దాల్చి ఇలా స్పందించారు : ‘‘మహాశయా! నా దేశంలో ఒక వీధి కుక్క సైతం పస్తున్నా, దానికి ఆహారం ఇచ్చి రక్షించడమే అప్పటికి నా వంతు అవుతుంది’’ అన్నారు. స్వామీజీ మహాసమాధి తర్వాత కొన్ని సంవత్సరాలకు పండిట్‌ దియోస్కర్‌ ఆ సంఘటనను ప్రస్తావిస్తూ, ఆనాటి స్వామీజీ వచనాలు తన మనస్సులో చెరగని ముద్రవేసి దేశభక్తి అంటే ఏమిటో నిజమైన ఆర్థాన్ని ప్రప్రథమంగా తెలియజేశాయని చెప్పాడు. మంటే మట్టి కాదు.. ఆధ్యాత్మికత అంటే కేవలం పూజలు, జప తపాలు మాత్రమే కాదు అని దీని అర్థం.  

మరిన్ని వార్తలు