ఔషధో రక్షతి రక్షితః

18 Aug, 2013 23:27 IST|Sakshi
ఔషధో రక్షతి రక్షితః

ధర్మో రక్షతి రక్షితః... అన్నమాట మనమందరమూ విన్నదే. ధర్మాన్ని మనం రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుందన్నది దాని అర్థం. దీన్ని మనం చెట్లకూ వర్తింపజేసుకుని, వృక్షో రక్షతి రక్షితః అనుకున్నాం. అంటే... చెట్లను మనం రక్షిస్తే, మనల్ని అవి రక్షిస్తాయి. కానీ ఇప్పుడు దీన్ని యాంటీబయాటిక్స్‌కూ అనువర్తింపజేసుకోవాల్సిన సమయం వచ్చింది. విచక్షణ రహితంగా వాడటాన్ని అరికట్టి యాంటీబయాటిక్స్‌ను మనం రక్షించుకోలేకపోతే, భవిష్యత్తులో మన ముందు తరాలకు వాటితో మనకు ఒనగూరే ప్రయోజనాలను ఇవ్వలేం. అందుకే యాంటీబయాటిక్స్ విషయంలో మనం అనుకోవాల్సిన కొత్త సూక్తి... ‘ఔషధో రక్షతి రక్షితః’. ఈ మాటను యాంటీబయాటిక్స్ మందులకు ఎందుకు వర్తింపజేసుకుంటున్నామని తెలుసుకునేందుకు ఉపయోగపడేదే ప్రస్తుత కథనం.

మన దేహం అనేకానేక సూక్ష్మజీవులకు నిలయం. ఇందులో మనకు మేలు చేసేవి, హాని చేసేవి కూడా ఉంటాయి. మేలు చేసేవాటి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. హాని చేసేవాటిని తుదముట్టించి ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అందుకోసం మనం వాడే మందులే... ‘యాంటీబయాటిక్స్’. ప్రాణరక్షకాలైన ఈ మందులను అదేపనిగా వాడటంవల్ల లేదంటే అధిక మోతాదుల్లో వాడటం వల్ల ఎన్నో దుష్పరిణామాలు ఉన్నాయి. మనకు చెడుచేసే సూక్ష్మజీవులు ఈ మందులకు నిరోధకత (రెసిస్టెన్స్) సాధిస్తే... ఆ తర్వాత మనల్ని రక్షించుకోవడం కష్టం. అందుకే యాంటీబయాటిక్స్ పట్ల అవగాహన పెంపొందించుకోవాలి. యాంటీబయాటిక్స్ అంటే మన శరీరంలోని హానికరమైన బ్యాక్టీరియాను చంపేందుకు ఉపయోగపడే మందు. ఇది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్‌ను తగ్గించి, రోగి ప్రాణాలు కాపాడుతుంది. అంటే ఈ మందులు ఇన్ఫెక్షన్‌ను వ్యాపించకుండా నిరోధిస్తాయన్నమాట. రోగిలోకి అప్పటికే ఇన్ఫెక్షన్ పాకి, రక్తం విషపూరితం కావడాన్ని (సెప్సిస్‌ను) సైతం ఆపి, ప్రాణాన్ని రక్షిస్తాయి.

నైపుణ్యం కావాలి: రోగిలో బ్యాక్టీరియా వ్యాపించిన తీవ్రతను బట్టి ఏ మోతాదులో దీన్ని వాడాలో తెలిసి ఉండటం ఒక నైపుణ్యమే. రోగిలోని ఇన్ఫెక్షన్ తీవ్రతను సరిగ్గా అంచనా వేసి, ఆ మేరకు మాత్రమే మోతాదు ఇస్తే అది ఇన్ఫెక్షన్‌ను తుదముట్టిస్తుంది. అలాకాకుండా మోతాదును పెంచుకుంటూపోతే... రోగకారక క్రిములు క్రమంగా యాంటీబయాటిక్స్ తమపై పనిచేయని విధంగా నిరోధకత (రెసిస్టెన్స్)ను పెంచుకోవచ్చు. అందుకే యాంటీబయాటిక్స్‌ను ఎలా వాడాలి, ఎంతకాలం వాడాలి, ఏ మోతాదులో ఇవ్వాలి... అనే ఈ మార్గదర్శకాలను పాటించాలి. తక్షణ ఫలితాలను మాత్రమే ఆశించి, యాంటీబయాటిక్స్‌ను వాడటంతో కొన్ని దుష్పరిణామాలు సంభవిస్తున్నాయి.
 
 ఎన్నో చోట్ల దుర్వినియోగ :
యాంటీబయాటిక్స్‌ను విచక్షణతో సరైన మోతాదును నిర్ణయించి రోగికి ఇవ్వాలి. కానీ వీటి దుర్వినియోగం ఎన్నో చోట్ల, వివిధ స్థాయుల్లో అవుతోంది. ఉదాహరణకు...
 
 రోగుల వద్ద:
ఒకసారి ఒక తరహా జబ్బుకు డాక్టర్ వద్దకు వచ్చి ఒక రకం యాంటీబయాటిక్స్ తీసుకున్న రోగి... ఆ తర్వాత అదే తరహా జబ్బుకు గాని, అదే లక్షణాలతో వ్యక్తమయ్యే మరికొన్ని ఇతర జబ్బులకు గాని డాక్టర్ సలహా లేకుండా అదే మందును సొంతగా వాడుతుంటాడు. ఇలా రోగుల స్థాయిలో యాంటీబయాటిక్స్ దుర్వినియోగమవుతుంటాయి.
 
 అర్హత లేని వైద్యుల వద్ద (క్వాక్స్): వైద్యం చేయడానికి అర్హత లేని వ్యక్తులు (వీళ్లను క్వాక్స్ అంటారు) కొందరు డాక్టర్ చేసే చికిత్సను గమనించి, పైన రోగి వ్యవహరించే తరహాలోనే ఈ మందులను వాడుతుంటారు.
 
 డాక్టర్ల వద్ద : కొందరు డాక్టర్లు సైతం విచక్షణరహితంగా యాంటీబయాటిక్స్‌ను వాడుతుంటారు. త్వరగా ఫలితం కనిపించాలని కోరుకునే కొందరు డాక్టర్లు వీటి దుష్పరిణామాలు తమకు తెలిసి కూడా ఉపయోగిస్తుంటారు.
 
 ఫార్మసిస్టుల వద్ద: మన దేశంలో మందుల షాపు వారికే తమ లక్షణాలను వివరించి మందులు పొందడం చాలా సాధారణం. దీంతో ఫార్మసిస్టుల స్థాయిలో కూడా యాంటీబయాటిక్స్ దుర్వినియోగం జరుగుతుంటుంది.
 
 వాడకూడనిచోట వాడకం...
 జలుబు, దగ్గు వంటి సాధారణ రుగ్మతలు ప్రధానంగా వైరస్ వల్ల సంక్రమిస్తాయి. వైరల్ జ్వరాలు, రుగ్మతలకు యాంటీబయాటిక్స్ ఉపయోగకరం కాదు. అయినప్పటికీ జలుబు, దగ్గు వంటి సమస్యలకు అజిథ్రోమైసిన్, సెఫిక్సిమ్, సెపోడోక్సిమ్ వంటి యాంటీబయాటిక్స్ వాడుతుంటారు. అలాగే నీళ్లవిరేచనాలు అవుతున్న సందర్భాల్లోనూ నార్‌ఫ్లాక్స్ వంటి మందులు వాడుతుంటారు. నీళ్ల విరేచనాల కారణం కనుగొని మందును సూచించాలి.
 
 సమస్యలు: ఆరోగ్యానికి చెరుపు చేసే బ్యాక్టీరియాను తుదముట్టించడం కోసం ఒక నిర్దిష్టమైన మోతాదులో, నిర్ణీతమైన వ్యవధి మేరకు మనం యాంటీబయాటిక్స్ వాడుతుంటాం. సరైన మోతాదులో, సరైన వ్యవధి మేరకు యాంటీబయాటిక్స్ వాడకపోవడంవల్ల రోగకారక బ్యాక్టీరియా మందు నుంచి నిరోధకతను పొందుతాయి. దీనివల్ల రోగికే కాదు... ఇతరులకూ ప్రమాదమే. ఉదాహరణకు ఒక జబ్బుతో బాధపడే వ్యక్తికి నిర్దిషమైన యాంటీబయాటిక్స్ ఇచ్చినా, అతడు సరిగ్గా వాడకపోవడం వల్ల, అతడిలో ఉన్న రోగకారకక్రిములు ఆ మందుతో ప్రభావితం కానివిధంగా మారతాయి. దాంతో ఆ రోగక్రిములు ఇతరులకు వ్యాపిస్తే... ఈ మందు వారికీ పనిచేయదు. దీనికి ఉదాహరణ మెథిలిసిన్ రెసిస్టెంట్ స్టెఫలోకాకస్ ఆరియస్ అనే జబ్బు. ఇది ఆసుపత్రుల్లో ఇన్ఫెక్షన్‌తో బాధపడే రోగులకు ఇచ్చే యాంటీబయాటిక్స్ దుర్వినియోగం కావడం వల్ల ఆసుపత్రుల్లో చేరేవారి పట్ల పరిణమించిన సరికొత్త జబ్బు లేదా రిస్క్‌గా మారింది.
 
  సైడ్ ఎఫెక్ట్స్: ప్రతి మందుకూ ఏవో కొన్ని దుష్పరిణామాలుంటాయి. వైద్యశాస్త్రం చదివి, అన్నీ తెలుసుకుని వైద్యం చేసేవారు... వాటి ప్రయోజనం, దుష్పరిణామాలు... రెండింటినీ బేరీజు వేసుకుని, రోగి పరిస్థితిని బట్టి ప్రయోజనాలు గరిష్ఠంగా, దుష్పరిణామాలు (సైడ్‌ఎఫెక్ట్స్) కనిష్ఠంగా ఉండేలా మందును సూచిస్తారు. ఒకవేళ అవసరాన్ని బట్టి తప్పనిసరి పరిస్థితుల్లో సైడ్‌ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉండే మందులు వాడాల్సివస్తే, వాటిని తగ్గించే మందులను సైతం రాస్తారు. దుష్పరిణామాలు తెలియనివారు మందును ప్రిస్క్రైబ్ చేయడం వల్ల రోగికి జరిగే హాని ఎక్కువ.
 
 రోగిపై ఆర్థిక భారం: తెలిసీతెలియని విధంగా డాక్టర్లు వైద్యం చేసినా, గ్రామీణ ప్రాంతాల్లోని రోగులు అర్హతలేని వైద్యుల (క్వాక్స్) వద్ద చికిత్స చేయించుకున్నా, తెలిసీతెలియని పరిజ్ఞానంతో రోగులే సొంత వైద్యం చేసుకున్నా... యాంటీబయాటిక్స్ దుర్వినియోగంతో రోగికి జబ్బు మరింత ముదిరి, మందుకు లొంగకపోయినా ఆ ఆర్థిక భారమంతా రోగిపైనే పడుతుంది. అందుకే యాంటీబయాటిక్స్‌ను డాక్టర్లు సూచించిన విధంగా, సూచించిన మోతాదుతో, నిర్దిష్టమైన కాలపరిమితి ప్రకారం వాడాలి.
 
 కాలపరిమితి ప్రధానం:
ఒక యాంటీబయాటిక్‌ను నిర్దేశించిన కాల పరిమితికి తగ్గనివ్వకూడదు, మించనివ్వకూడదు. ఉదాహరణకు టీబీ జబ్బులో వాడే మందులు మొదలుపెట్టిన కొద్దిరోజుల్లోనే లక్షణాలన్నీ తగ్గిపోతాయి. కానీ రోగకారక క్రిమి ఇంకా శరీరంలో బతికే ఉంటుంది. ఒకవేళ లక్షణాలన్నీ తగ్గాయన్న కారణంగా ముందే మందులు మానేస్తే... శరీరంలోని రోగకారక క్రిమి మందు నుంచి నిరోధకత పొందుతుంది. ఇది మరింత ప్రమాదకరమైన జబ్బుకు కారణమవుతుంది.
 
 కొందరు డాక్టర్ సూచించిన వ్యవధి తర్వాత కాకుండా, అదే మందును మరికొంతకాలం కొనసాగించి, అప్పుడు డాక్టర్ వద్దకు వస్తారు. అలా వ్యక్తిగతంగా రోగి డాక్టరు వద్దకు రాలేని సందర్భాల్లో ఏదో విధంగా డాక్టర్‌ను సంప్రదించి, ఆ మందును తాము మళ్లీ డాక్టర్‌ను కలిసేవరకు కొనసాగించడం మంచిదో కాదో తెలుసుకోవాలి. ఒకవేళ ముందే అలా రాలేమని తెలిసినవారు, ముందుగానే ఆ విషయాన్ని డాక్టర్‌కు తెలియపరచి అలా కొనసాగించవచ్చా లేక ఆ నిర్దిష్ట కాలం తర్వాత ఆ మందు ఆపేయాలా అన్న విషయాన్ని ముందే తెలుసుకోవాలి.  వివిధ కారణాల వల్ల మందుల షాపుల్లో ఓవర్ ద కౌంటర్ మందులు ఇవ్వడం అనే సంప్రదాయం కొనసాగుతోంది. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు తీసుకోవడం మంచిదికాదన్న విషయాన్ని గ్రహించి, అలా చేయడం మనకే మంచిదికాదని అందరూ గుర్తించి, ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు ఇవ్వకూడదు, తీసుకోకూడదని తెలుసుకోవాలి. ప్రిస్క్రిప్షన్ లేకుండా మందుల లభ్యతను నిరోధించే విధానం గట్టిగా అమలయ్యేలా చూడాలి * యాంటీబయాటిక్స్ ఏ సందర్భాల్లో పనిచేస్తాయో తెలిసిన డాక్టర్లు, ప్రతి చిన్న సమస్యకూ వాటిని సూచించరు. అలా ప్రిస్క్రైబ్ చేయని సందర్భాల్లో తప్పనిసరిగా తమ లక్షణాలు తగ్గడానికి మందు ఇవ్వమని డాక్టర్‌ను బలవంతం చేయకండి. ఉదాహరణకు జబులు, గొంతునొప్పి, ఆక్యూట్ బ్రాంకైటిస్, ఫ్లూ, గొంతులో అసౌకర్యం వంటి కొన్ని సమస్యలు వైరస్‌ల కారణంగా వస్తాయి. ఇక మధ్య చెవిలో ఇన్ఫెక్షన్ వంటి కొన్ని సమస్యలకు కూడా యాంటీబయాటిక్స్ వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు. అలాంటి సందర్భాల్లో డాక్టర్ మీ మేలుకోరి మందులు రాయకపోతే వాటిని లక్షణాలను బట్టి యాంటీబయాటిక్స్ కోసం పట్టుపట్టకండి. వాటికి బదులు డాక్టర్ సలహాతో గృహవైద్యం... అంటే గొంతునొప్పి కోసం ఉప్పు వేసిన గోరువెచ్చని నీటితో పుక్కిలించడం, జబులు, ఫ్లూ వంటి సమస్యలకు ఆవిరిపట్టడం లేదా గొంతునొప్పి, సోర్‌థ్రోట్ వంటి సమస్యలకు వేణ్ణీళ్లలో కొద్దిగా నిమ్మరసం, తేనె కలుపుకుని తాగడం వంటివి చేయాలి.
 
 వ్యాక్సిన్స్ తీసుకోవడం ద్వారా: చాలా జబ్బులకు వాటిని ముందే నివారించే చాలా రకాల వ్యాక్సిన్స్ మనకు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. చికిత్స కంటే నివారణ ప్రధానం అన్న సూక్తిని గుర్తెరిగి, వ్యాక్సిన్స్ తీసుకోండి. దీనివల్ల చాలా రకాల ఆర్థిక బాధలు, జబ్బు వల్ల కలిగే బాధలు నివారితమవుతాయి.
 
 భవిష్యత్ తరాలకు మిగలనివ్వండి...
 మనకు అందుబాటులో ఉన్న యాంటీబయాటిక్స్ అన్నీ చాలా విలువైనవి. అవి రకరకాల ఇన్ఫెక్షన్‌లను అరికట్టి కోటానుకోట్లమంది రోగులకు ప్రాణరక్షణ చేస్తున్నాయి. వాటిని మనం దుర్వినియోగం చేసి, వాటివల్ల రెసిస్టెన్స్ వచ్చే పరిస్థితిని కల్పించుకుంటే అవి భవిష్యత్తులో నిరుపయోగం అవుతాయి. గత శతాబ్దిలో కనుగొన్నవి మినహా కొత్త యాంటీబయాటిక్స్ పెద్దగా రూపొందలేదు. రూపొందే అవకాశమూ పెద్దగా కనిపించడం లేదు. అందుకే వీటన్నింటినీ దురుపయోగంతో నిరుపయోగం చేసేసి, భవిష్యత్తరాలను రోగగ్రస్థులను చేయకుండా చూడాల్సిన బాధ్యత మనందరిపైనా ఉంది.
 
 దుర్వినియోగం అవుతున్న యాంటీబయాటిక్స్ ఇవే...
 మనకు కారణం తెలియకుండానే, నిర్దిష్టంగా ఏయే యాంటీబయాటిక్స్ ఏయే జబ్బులకు పనిచేస్తాయో అవగాహన లేకుండానే యాంటీబయాటిక్స్ అన్న పేరుంటే చాలు... వాటిని దుర్వినియోగం చేస్తున్నాం. అవి... ఎరిథ్రోమైసిన్, అజిథ్రోమైసిన్, సెఫిక్సిమ్, సెపొడోక్సిమ్, ఓఫ్లాక్సిన్, నార్‌ఫ్లాక్సిన్, సిఫ్రాన్, నార్‌ఫ్లాక్స్, సెప్ట్రాన్, మోనోసెఫ్,  పైపర్‌సిలిన్ టాజోబాక్టమ్ మొదలైనవి.
 

మరిన్ని వార్తలు