గింజలతో నాజూకు నడుము!

14 Nov, 2017 23:34 IST|Sakshi

కొత్త సంగతులు

మీరు ఊబకాయంతో ఇబ్బంది పడుతున్నారా? నడుం చుట్టూ ఉన్న కొవ్వు ముడతలను తొలగించుకుని నాజూకుగా తయారవ్వాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే మీ ఆహారంలో గింజల వాడకాన్ని పెంచేయండి. అతిగా ప్రాసెస్‌ చేసిన వాటి కంటే గింజలన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల ఎక్కువ సమయం కడుపు నిండుగా ఉన్న అనుభూతి కలగడమే కాకుండా నడుం చుట్టూ పేరుకుపోయిన కొవ్వు కరుగుతుందని అంటోంది డెన్మార్క్‌కు చెందిన శాస్త్రవేత్తల బృందం. అంతేకాకుండా ఈ రకమైన ఆహారం వల్ల శరీరంలో ఇన్‌ఫ్లమేషన్‌ (వాపు/మంట) తగ్గడమే కాకుండా మధుమేహాన్ని కూడా నిరోధించవచ్చు అంటున్నారు వీరు. గుండెజబ్బులు, అధిక చెడు కొలెస్ట్రాల్, రక్తపోటు, పొట్టవద్ద కొవ్వు పేరుకుపోవడం వంటి లక్షణాలున్న కొందరిపై వీరు ప్రయోగాలు చేశారు.

వీరిని రెండు వర్గాలుగా విభజించి వారికి అందించే ఆహారాన్ని రెండుసార్లు మార్చారు. ఒక వర్గం ముందుగా ఎనిమిది వారాలు గింజధాన్యాలను ఆహారంగా తీసుకుంది. ఆ తరువాత ఆరు వారాల పాటు సాధారణ ఆహారం.. మళ్లీ ఎనిమిది వారాలు బాగా ప్రాసెస్‌ చేసిన ఆహారాన్ని తీసుకున్నారు. ఇంకో వర్గం ముందుగా ప్రాసెస్‌ చేసిన ఆహారం, ఆ తరువాత ఆరువారాలు సాధారణ ఆహారం... మళ్లీ ఎనిమిది వారాలు కేవలం గింజధాన్యాలు తిన్నారు. వీరి రక్తం, మలాన్ని పరిశీలించారు. మరి కొన్ని పరీక్షల ద్వారా వారు ఆరోగ్యంగా ఉంటూనే బరువు తగ్గినట్లు తెలిసింది. మనం తినే ఆహారంలో కనీసం నాలుగోవంతు గింజలు ఉండేలా చేసుకుంటే అది బరువు తగ్గేందుకు, నాజూకు నడుముకూ ఉపకరిస్తుందన్నది ఈ పరిశోధనల సారాంశం.

మరిన్ని వార్తలు