మీ పార్టనర్‌తో గొడవ పడ్డారా ?

20 Nov, 2018 15:01 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

రిలేషన్‌షిప్‌లో ఉన్నపుడు గొడవలు రావడం సర్వసాధారణం. అయితే ఈ చిన్న గొడవలు బంధాన్ని మరింతగా పటిష్టం చేస్తాయని అమెరికాలో చేసిన తాజా సర్వేలో వెల్లడైంది. అదే నిజమట.... నమ్మలేకపోతున్నారా ?

గొడవ పడేవారే సంతోషంగా ఉన్నారు...
క్రూషియల్‌ కన్వెర్జేషన్‌ అనే పుస్తక సహ రచయిత జోసెఫ్‌ గ్రెన్నీ ఈ విషయాన్ని కనుగొన్నారు. దీనికై రిలేషన్‌షిప్‌లో ఉన్న 1000 మందిని ఆయన ఎంచుకొని సర్వే నిర్వహించారు. గొడవ పడే జంటలు ఇతరులతో పోలిస్తే పది రెట్లు ఆనందంగా ఉన్నట్లు ఈ సర్వేలో తేలింది. వీరు తమ పార్ట్‌నర్‌లో నచ్చని విషయాలను వెంటనే చెబుతారని అందుకే తరచూ గొడవ పడతారని ఆయన అన్నారు. సెన్సిటివ్‌ విషయాలను సైతం వారు పంచుకొని చర్చించుకుంటున్నారని, మిగిలిన జంటలు తమ సమస్యలను పార్ట్‌నర్‌కు తెలియకూడదు అనుకుంటున్నారని అందుకే సంతోషంగా లేరని సర్వేలో వెల్లడైంది.  అలాగే తమ రిలేషన్‌షిప్‌ ముగిసి పోకూడదని కొన్ని విషయాలలో మౌనంగా ఉండడం వల్ల సంతోషం దూరమౌతోందని తేలింది.

పొరపాటు ఎ‍క్కడ జరుగుతోంది...
తమను ఇబ్బందికి గురిచేస్తున్న,  తమకు నచ్చని విషయాలను పార్టనర్‌తో పంచుకోకపోవడం వల్లే ఇలా జరుగుతోందని గ్రెన్నీ అభిప్రాయపడ్డారు. ఏదైనా విషయం సడెన్‌గా చెబితే అది ఎదుటి వారు తట్టుకోలేకపోతే రిలేషన్‌షిప్‌ ఎక్కడ దెబ్బ తింటుందో అని మౌనంగా ఉండిపోతున్నారని ఆ సర్వే స్పష్టం చేసింది.

కమ్యూనికేషనే అసలు సమస్య...
సర్వేలో పాల్గొన్న ప్రతీ అయిదుగురిలో నలుగురు తాము కమ్యూనికేషన్‌ సరిగా చేయలేకపోతున్నామని అందుకే సంతోషంగా ఉండలేకపోతున్నామని తెలిపారు. తమ భావాలను సరిగా వ్యక్తీకరించడంలో ఎదురయ్యే సమస్యలతోనే జంటలు ఇబ్బంది పడుతున్నారని గ్రెన్నీ అన్నారు. తమ మనోభావాన్ని భ​యం లేకుండా చెప్పేవారే రిలేషన్‌షిప్‌ను ఎంజాయ్‌ చేయగలుగుతున్నారు.

గొడవలకు కారణమవుతున్న అంశాలు...
రిలేషన్‌షిప్‌లో ఉన్న వారి మధ్య గొడవలకు కారణమవుతున్న అంశాలను ఈ స​ర్వేలో తెలుసుకున్నారు. డబ్బు, సెక్స్‌, చెడు అలవాట్ల గురించి వచ్చే చర్చలే గొడవలకు ప్రధాన కారణాలని ఈ సర్వే తేల్చింది. 

ఓపెన్‌గా చెప్పడమే మేలు
సమస్య ఏదైనా, విషయం ఏదైనా సూటిగా చెప్పి గొడవ పడడమే ఉత్తమమని, అదే రిలేషన్‌షిప్‌ విజయానికి దోహదం చేస్తుందని ఈ సర్వే తేల్చి చెప్పింది. నిజమైన ప్రేమ గొడవలు జరుగుతాయని భయపడదని, నిజం చెప్పడానికే ప్రయత్నిస్తుందని గ్రెన్నీ వివరించారు.

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు