నాకు ఆ నమ్మకం ఉంది!

8 Jan, 2019 00:23 IST|Sakshi

చెట్టు నీడ

ఒక ఊరిలో ఇద్దరు స్నేహితులున్నారు. వారిలో ఒకరు భక్తిపరుడు. ప్రతిరోజూ పూజ చేసేవాడు. పూజలో భాగంగా దేవుడికి రకరకాల పండ్లను, పదార్థాలను నైవేద్యంగా సమర్పించి, అందులో ఒక ఫలాన్నో, ఆహార పదార్థాన్నో ప్రసాదంగా కళ్లకద్దుకుని తినేవాడు. రెండోవ్యక్తికి దైవం అంటే నమ్మకం ఏ మాత్రం లేదు. ఒకరోజు ఇతను వచ్చేటప్పటికి దైవభక్తుడైన మిత్రుడు దేవుడికి నైవేద్యం పెడుతున్నాడు. అది చూసి నాస్తిక మిత్రుడు ఎగతాళిగా ‘‘నువ్వు రోజూ దేవునికి నైవేద్యం పెడుతున్నావు. ఆ పండు నువ్వు పెట్టిన చోటే ఉంటోంది. దానిలో ఎలాంటి మార్పూ రావడం లేదు. దీనిని బట్టి నీకిష్టమైన వాటిని దేవుని పేరు చెప్పి, ఆయన ముందుపెట్టి, ఆనక నువ్వే తింటున్నావు. నువ్వు చేసేది పొట్ట పూజే కానీ దైవపూజ కాదు’’ అంటూ నవ్వాడు. 

అందుకు ఆ భక్తుడు చిరునవ్వుతో ఇలా సమాధానం చెప్పాడు. ‘‘గీతలో కృష్ణుడు– భక్తులు భక్తితో తనకు పువ్వు, పండు లేదా కనీసం నీటిని సమర్పించినా, దానిని తాను స్వీకరిస్తానన్నాడు. దానిని బట్టే నేను సమర్పించేదానిని ఆయన తప్పక తీసుకుంటాడన్న భావనతో ప్రతిరోజూ నైవేద్యం పెడుతున్నాను. ఆయన సర్వశక్తి మంతుడైనందువల్ల ఆ ఫలాన్ని లేదా పదార్థాన్ని పూర్తిగా అదృశ్యం చేయవచ్చు లేదా దానిని వినియోగించినా కూడా అలాగే ఉండేటట్లు చేయగలడు. నాకు సంబంధించినంతవరకు భగవంతుడు ఆరగించిన తరువాత మిగిలిన ఫలాన్నే నేను ప్రసాదంగా స్వీకరిస్తున్నాను. ఇప్పుడు నేనొక చిన్న ప్రశ్న అడగవచ్చా?’’ అన్నాడు. 

‘‘సరే, అడుగు’’ అన్నాడు నాస్తిక మిత్రుడు. ‘‘మనం రోజూ వార్తాపత్రికలు చదువుతాం కదా, అందులోని అక్షరాలు ఏమైనా మాయం అవుతున్నాయా?’’ అనడిగాడతను.  ‘‘లేదు. అయినా, అలా ఎలా మాయం అవుతాయి?’’ అనడిగాడితను.  ‘‘అవి మాయం కాకుండానే వాటి సారం మీకు తెలుస్తోందా లేదా? ఇదీ అంతే అని ఎందుకనుకోవు? మరో విషయం– ఈ మధ్య నీ అభిమాన నటుడు ఒకతను మన ఊరికి వచ్చినప్పుడు మీరందరూ ఆయనకు పూలదండలు వేశారు. తనకు వేసిన దండల్లో ఒకదానిని ఆయన తిరిగి నీకే ఇస్తే, సంతోషంతో తీసుకున్నావా లేదా? అలాగే ఆయన కొన్ని పూలదండలను తన అభిమానుల మీదికి విసిరితే అందరూ ఆనందించారా లేదా? నీ అభిమాన నటుడు తనకు వేసిన పూలదండలన్నింటినీ తన దగ్గర ఉంచుకోక పోయినా మీరు పూలదండలు వేయడం మానుకున్నారా? అలాగే నేను చిత్తశుద్ధితో దేవునికి నైవేద్యం సమర్పించి, దానిని ప్రసాదంగా స్వీకరిస్తున్నాను.?’’ అన్నాడు. అంగీకార సూచకంగా తల ఊపాడు నాస్తిక మిత్రుడు.
– డి.వి.ఆర్‌.  

మరిన్ని వార్తలు