రుతురాగాల బంటీ

5 Aug, 2019 08:21 IST|Sakshi
డా. బంటి (సత్యనారాయణ)

డా. బంటి (సత్యనారాయణ)

తల్లి గర్భం నుంచి బాలమురళిని అభ్యసించారు. టెలివిజన్  సీరియల్స్‌కు స్వరాలు అందించారు.తాతల నుంచి∙వైద్య వారసత్వం అందుకున్నారు. వైద్యుడిగా ఎందరికో ఉపశమనం కలిగించారు. పాటలతో పరవశింపచేశారు.. సంగీతకారుడిగా, వైద్యుడిగా పాతికేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా పాతిక సీరియల్‌ సాంగ్స్‌తో ఈ రోజు సంగీత విభావరి నిర్వహించబోతున్న  డా. బంటి (సత్యనారాయణ) తోసాక్షి ప్రత్యేక సంభాషణ.

టీవీ సీరియల్స్‌లోని పాటలతో సంగీత విభావరి చేయాలనే ఆలోచన ఎలా వచ్చింది?
బంటి:నా శ్రేయోభిలాషి సంజయ్‌ కిశోర్‌కి ఈ ఆలోచన వచ్చింది. మ్యూజిక్‌ చేయడం, పాడటం వరకే నా ఆలోచన పరిమితంగా ఉంటుంది. నా గురించి నేను ప్రోగ్రామ్‌ చేసుకోవడానికి దూరంగా ఉంటాను. ఎవరైనా సరదాగా పిలిస్తే వెళ్లి పాడతాను. అంతే. నేను సంగీతం చేసిన చక్రవాకం సీరియల్‌ సాంగ్‌ సంజయ్‌కి చాలా ఇష్టం. నేను ఎవరితో మ్యూజికల్‌ నైట్‌లో పాడుతున్నా, చక్రవాకం పాడటం తప్పనిసరిగా మారింది. అలా మా ఇద్దరి మధ్య అనుబంధం ఏర్పడింది. మా చెల్లెలు అలకనందతో కలిసి నన్ను ప్రోగ్రామ్‌ చేయమన్నారు. సొంత డబ్బా కొట్టుకున్నట్టు ఉంటుంది వద్దన్నాను. అయితే నేను పాడటం ప్రారంభించి పాతిక సంవత్సరాలు పూర్తయింది కనుక రజతోత్సవంగా చేద్దామన్నారు. వైద్యుడిగా కూడా పాతికేళ్లు దాటింది. అందుకని ఒప్పుకున్నాను.

సంగీతం నేర్చుకున్నారా?
బంటి: ఐదో తరగతి నుంచే పాడడం, మ్యూజిక్‌ కూడా చేయడం మొదలుపెట్టా. మా అమ్మ, పిన్ని సంగీతం బాగా పాడతారు. ఒకరోజు రాత్రి కరెంటు పోయిన సమయంలో మా పిన్ని ‘మూడు నాళ్లాయెరా మువ్వ గోపాలా’ అనే పదం నేర్పించింది. శృతిలో పాడాను. స్వరం బాగా పలుకుతోందని సంగీతం నేర్పించడం మొదలుపెట్టారు మా పిన్ని మనోరమ. ఆమే నా గురువు. కొన్నాళ్లు అమ్ముల సత్యవతిగారి దగ్గర వయొలిన్‌ నేర్చుకున్నాను. నన్ను, మా చెల్లెలిని జవహర్‌ బాలభవన్‌లో మల్లాది గిరిజ గారి దగ్గర చేర్పించారు. ఆ తరవాత రేడియోలో బాలల కార్యక్రమంలో పాడాం. రేడియో అక్కయ్య తురగా జానకీరాణి మమ్మల్ని బాగా ప్రోత్సహించారు. పాలగుమ్మి విశ్వనాథం, చిత్తరంజన్, సాయిబాబా, నిర్మల... అందరి స్వరకల్పనలో చిన్న పిల్లల పాటలు పాడాం. తొమ్మిదో తరగతి చదువుతున్నప్పుడు దూరదర్శన్‌లో ‘విశాల భారతి’ బ్యాలేకి సంగీతం సమకూర్చాను. దూరదర్శన్‌లో వచ్చిన నా మొట్టమొదటి సంగీత రచన అదే. ఆ తరవాత రెగ్యులర్‌గా నేను కంపోజ్‌ చేసిన పాటలు పాడేవాడిని. చిన్నప్పడు మా నాన్నగారు బ్యాంగో, క్యాసియో కొని ఇచ్చారు. అవి పెట్టుకుని పాటలు కంపోజ్‌ చేసేవాడిని. కొంతకాలం పాటు మా నాన్నగారే సొంత డబ్బులతో నా ప్రోగ్రామ్స్‌ ఏర్పాటుచేశారు. అలా నా సంగీత ప్రయాణం ప్రారంభమైంది.

మీ అభిమాన గాయనీ, గాయకులు?
బంటి: ఎస్‌.పి. బాలసుబ్రహ్మణ్యం గారు నాకు గురుతుల్యులు. ఆయన అన్నిరకాల పాటలు పాడారు, పాడుతూనే ఉన్నారు. పాతిక సంవత్సరాల నా ప్రయాణానికి సంబంధించిన జ్ఞాపికను బాలు గారి చేతుల మీదుగా అందుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. సంగీత దర్శకులలో ఇళయరాజా అంటే అభిమానం. ఎం.ఎస్‌. విశ్వనాథన్, మహదేవన్, రమేశ్‌నాయుడు అందరి పాటలూ ఇష్టమే. కాని ఇళయరాజా సంప్రదాయ సంగీతాన్ని పాశ్చాత్య బాణీలో చేయడం బాగా నచ్చింది. ఇళయరాజాగారి ప్రేరణతో సంగీతం చేయడం ప్రారంభించాను. వసంతకోకిలలోని ‘కథగా కల్పనగా’ పాట విన్నప్పటి నుంచి నాకు ఆయనలాగ చేయాలనే కోరిక కలిగింది. ఒకసారి ఒక పాట కంపోజ్‌ చేశాను. నాకు తెలియకుండానే అది ఒక సంప్రదాయ రాగంలో వచ్చింది.

వైద్య వృత్తిని, సంగీతాన్ని ఏ విధంగా సమన్వయం చేసుకుంటున్నారు?
బంటి:ఏదో ప్రభుత్వ ఉద్యోగం చేసుకుంటూ, శనిఆదివారాలు సంగీతం చేసుకోవాలనుకునేవాడిని. కుదరలేదు. గుల్బర్గాలో మెడిసిన్‌ పూర్తి చేశాను. కాని నా సంగీత తృష్ణ నన్ను వెంటాడుతూనే ఉంది. ఎం. డి. చేయకుండా తప్పించుకోవడానికి ఎం.బి.ఏ., ఐఏయస్‌లకు ప్రిపేర్‌ అయ్యాను. బంధువులకు ఇచ్చిన వైద్యసలహాలు పనిచేయడంతో, క్లినిక్‌ ప్రారంభిస్తే అన్నీ కలిసి వస్తాయన్నారు. వాళ్ల కోరికమేరకు డాక్టర్‌ ప్రాక్టీస్‌ ప్రారంభించాను. దేవుడే పంపినట్లుగా ఒకసారి సుధాకర్‌ పల్లమాల (మంజులానాయుడు భర్త) వాళ్ల స్టూడియో బాయ్‌  నా దగ్గరకు వచ్చాడు ట్రీట్మెంట్‌ కోసం. అప్పట్లో వాళ్లు ‘ఆగమనం’ సీరియల్‌ తీస్తున్నారు. అలాంటివారి దగ్గర పనిచేస్తే బాగుంటుంది అని మనసులో అనుకున్నాను. ఒకరోజు మంజులానాయుడుగారి అబ్బాయి బండి మీద నుంచి పడిపోవడంతో, వారి ఆఫీస్‌ బాయ్‌ రిఫరెన్స్‌తో ఆ కుర్రాడిని నా దగ్గరకు తీసుకువచ్చారు. అయితే ఆ కుర్రవాడు ఫలానా అని నాకు తెలియదు. మాటల మధ్యలో వాళ్ల వివరాలు తెలుసుకున్నాను. అప్పటికే నేను కొన్ని మ్యూజిక్‌ ఆల్బమ్స్‌ చేశాను. మంజులానాయుడు గారి దగ్గరకు వెళ్లి, నా గురించి చెప్పాను. ఆవిడ, నాతో ‘‘బంటీ! నాకు వంద పరికరాలు వద్దు. చిన్న ట్యూన్‌ సింపుల్‌గా వినిపించు’’ అన్నారు. ఆవిడ కోరినట్లు వినిపించగానే ఆవిడ సంతోషపడ్డారు. అప్పుడు సుశీల సీరియల్‌ ప్రారంభిస్తున్నారు. ఆ సీరియల్‌కి ఆలాపన చేయమంటే అలాగే చేశాను. అది బాగా పాపులర్‌ అయ్యింది. వీటి కంటె ముందుగా నేను హరిత, అంకురం సీరియల్స్‌కి చేశాను.

మీకు ఋతురాగాలతో మంచి గుర్తింపు వచ్చింది కదా!
బంటి: ఋతురాగాలు సీరియల్‌కి. బలభద్రపాత్రుని మధు మంచి పాట రాశారు. దానికి నేను సంగీతం సమకూర్చాను. ప్రముఖ దర్శకులు బాపు, గాయకులు పి.బి. శ్రీనివాస్, ఎస్‌. జానకి, పి. సుశీల... వీరంతా ఋతురాగాలు పాటను మెచ్చుకున్నారు. బలభద్రపాత్రుని మధుగారు నా ఇలవేలుపు. ఆ తరవాతా మా ఇద్దరి కాంబినేషన్‌లో ఎన్నో మంచి పాటలు వచ్చాయి. సీరియల్స్, పాటలు కలిపి వంద వరకు చేశాను.
నాకు మెయిన్‌గా ఋతురాగాలు, చక్రవాకం, మొగలిరేకులు, కస్తూరి, త్రివేణీ సంగమం, కొంగుముడి, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, జయప్రదం.. సీరియల్స్‌ బాగా పేరు తెచ్చాయి. మా ఇంటి ఆడపడుచు, చక్రవాకం సీరియల్స్‌కి గాయకుడిగా రెండు నంది అవార్డులు గెలుచుకున్నాను. కెరటాలు సీరియల్‌కి సంగీతం విభాగంలో అవార్డు వచ్చింది. ‘హైదరాబాద్‌ బ్లూస్‌’తో కలిపి మొత్తం పది చిత్రాలకు సంగీతం సమకూర్చాను. నాకు సీరియల్స్‌లో ఫ్రీడమ్‌ ఉంది. అందుకే హ్యాపీగా ఉంది.

ఎం. డి. అంటే మ్యూజిక్‌ డైరెక్టర్‌
తూ.గో. జిల్లా రాజోలు నా స్వస్థలం. గోదావరి నీళ్లు తాగితే సంగీతం వస్తుందంటారు. నిజమేనేమో మరి. నేను ముందుగా సంగీత దర్శకుడిని. ఆ తరవాతే డాక్టరు అయ్యాను. నువ్వు ఏం చదువుతావురా అంటే ఎం.డి. అన్నాను. అది డాక్టర్లు చదివే ఎం. డి. కాదు. మ్యూజిక్‌ డైరెక్టరుకి షార్ట్‌ ఫామ్‌.  దేవుడి దయ వల్ల డాక్టరుగా మంచి పేరు తెచ్చుకున్నాను. ఎక్కువగా మెడికల్‌ క్యాంప్స్‌లో పాల్గొని సేవ చేస్తున్నాను. గ్రామాలను దత్తత తీసుకుని, అక్కడ ప్రతి నాలుగో ఆదివారం ఫ్రీ మెడికల్‌ క్యాంపు నిర్వహిస్తుంటాం. – సంభాషణ: వైజయంతి పురాణపండ,ఫొటోలు: ఎస్‌. ఎస్‌. ఠాకూర్‌

>
మరిన్ని వార్తలు