వెన్నునొప్పి వెంటాడుతోంది

12 Jan, 2016 00:32 IST|Sakshi

  హోమియో కౌన్సెలింగ్
 మా అమ్మగారి వయసు 65. ఈమధ్య కొంతకాలంగా విపరీతమైన దగ్గు, జలుబుతో బాధపడుతున్నారు. డాక్టర్‌కు చూపిస్తే బ్రాంకైటిస్ అని చెప్పి, యాంటీబయాటిక్స్ కోర్సు రాశారు. వాటివల్ల సైడ్‌ఎఫెక్టులు వస్తున్నాయి. హోమియోలో దీనికి పరిష్కారం ఉంటే చెప్పగలరు.
                                       - డి.ఎల్.అనూరాధ, కొత్తగూడెం

 
 శ్వాసకోశవ్యాధులలో బ్రాంకైటిస్ ఒకటి. వాయునాళాల లోపలి జిగురుపొరలు (మ్యూకస్ మెంబ్రేన్స్)తో కప్పి ఉంటుంది. ఇవి ఇన్ఫెక్షన్‌కు గురయినట్లయితే దానిని బ్రాంకైటిస్ అంటారు. ముక్కునుంచి గొంతువరకు ఉండే భాగం కూడా ఇన్ఫెక్షన్‌కు గురయినట్లయితే బ్రాంకైటిస్ వస్తుంది. ఇది సాధారణంగా ఎవరికైనా వస్తుంది.
 కారణాలు: దుమ్ము, ధూళి, పొగ, కెమికల్స్, బ్యాక్టీరియల్, వైరల్ ఇన్ఫెక్షన్స్, చల్లటి వాతావరణం, ఫ్లూ జ్వరం, చల్లని పదార్థాలు, చల్లని పానీయాలు సేవించడం
 
 లక్షణాలు: జ్వరం, చలి, జలుబు, ముక్కుదిబ్బడ, ముక్కు కారడం, గొంతునొప్పి, తలనొప్పి, కండరాల నొప్పులు, దగ్గు, ఛాతీనొప్పి, పిల్లికూతలు, ఆయాసం, ఎక్కువగా నడవలేకపోవడం.
 
 రకాలు: బ్రాంకైటిస్‌లో అక్యూట్ బ్రాంకైటిస్; క్రానిక్ బ్రాంకైటిస్ అని రెండు రకాలు ఉన్నాయి. అక్యూట్ బ్రాంకైటిస్‌లో జలుబు, దగ్గు, ఒళ్లునొప్పులు, నీరసం, జ్వరం, తలనొప్పి ఉంటాయి. క్రానిక్ బ్రాంకైటిస్‌లో ఏడాదికి మూడు నెలలపాటు దగ్గు, తెమడ ఉంటాయి. పొగతాగడం, వాతావరణంలో మార్పులు, కాలుష్యం, ఇన్ఫెక్షన్స్ వల్ల శ్వాసనాళాలు దెబ్బతింటాయి. ఇన్ఫెక్షన్ మూలంగా వాయునాళాలు కుచించుకుపోవడం వల్ల ఛాతీలో పిల్లికూతలు వినిపిస్తాయి. టాన్సిల్స్, సైనస్ వ్యాధులతో బాధపడే పిల్లలకు తరచుగా బ్రాంకైటిస్ వస్తూ, దీర్ఘకాలిక బ్రాంకైటిస్‌గా మారినట్లయితే ఇమ్యూనిటీ తగ్గి, ఆస్తమాకు దారితీస్తుంది.
 
 నిర్ధారణ: ఛాతీ ఎక్స్‌రే, ఈఎస్‌ఆర్, కఫం పరీక్ష, సీబీపీ మొదలైనవి.
 
 నివారణ: ధూమపానం మానేయడం, దుమ్మూధూళికి దూరంగా ఉండటం, చల్లని వాతావరణంలో తిరగకుండా, చల్లని ఆహారపదార్థాలు తీసుకోకుండా ఉండటం, మంచి నిద్ర, ఆహారం, విశ్రాంతి తీసుకోవడం, ఆహారంలో ఆకుకూరలు, పళ్లు ఎక్కువగా తీసుకోవడం, క్రమం తప్పకుండా యోగ, ధ్యానం, బ్రీతింగ్ ఎక్సర్‌సైజులు.
 
 హోమియో చికిత్స: హోమియోలో ఎటువంటి శ్వాసకోశవ్యాధులకైనా అధునాతన జెనెటిక్ కాన్‌స్టిట్యూషనల్ చికిత్స ద్వారా రోగనిరోధక శక్తిని పెంపొందించి, వ్యాధి తీవ్రతను తగ్గించి, క్రమక్రమంగా పూర్తిగా వ్యాధినిర్ధారణ జరుగుతుంది.
 
 డాక్టర్ శ్రీకాంత్ మోర్లావర్
 ఫౌండర్ చైర్మన్
 హోమియోకేర్ ఇంటర్నేషనల్,
 హైదరాబాద్
 
 
 స్పైన్ కౌన్సెలింగ్
 నా వయసు 30 ఏళ్లు. నేను ఒక ఐటీ కంపెనీలో పనిచేస్తున్నాను. మా ఇంటి నుంచి ఆఫీసు చేరడానికి నేను కనీసం రోజూ 35 కి.మీ. బైక్ మీద వెళ్తుంటాను. ఆఫీసులో అంతా డెస్క్ పనే. కాబట్టి కూర్చొనే పనిచేస్తుంటాను. నాకు మూడు నెలల క్రితం తీవ్రమైన వెన్నునొప్పి వచ్చింది. ఇప్పుడు డాక్టర్‌కు చూపించుకున్నాను. మందులు రాసిన్చారు. ఒక వారం పాటు వాడాను. నొప్పి తగ్గింది. ఈమధ్య వారం రోజుల నుంచి వెన్నుతో పాటు మెడ భాగంలో కూడా తీవ్రమైన నొప్పి వస్తోంది. దయచేసి నా సమస్యకు తగిన సలహా చెప్పగలరు.
                                                            - రేవంత్, హైదరాబాద్

 
 ఈమధ్య వయసుతో నిమిత్తం లేకుండా ఎక్కువ మందిలో ఈ వెన్నునొప్పులు సాధారణమైపోయాయి. చిన్నవయసులోనే ఈ నొప్పి బారిన పడుతున్నవారు చాలా ఉన్నారు. ఇక మీ సమస్య విషయానికి వస్తే రెండు కారణాలు కనిపిస్తున్నాయి. ఒకటి మీరు టూ-వీలర్ మీద చాలా లాంగ్ డ్రైవింగ్ చేయడం. మీ ఇంటి నుంచి మీరు పనిచేసే ప్రదేశానికి 35 కి.మీ. అన్నారు. అంటే రానూపోనూ సుమారు 70 కి.మీ. దూరం మీరు ప్రయాణం చేస్తున్నారు. అందునా తీవ్రమైన ట్రాఫిక్ సమస్య, రోడ్డు మీద ఉండే గతుకుల మధ్య ఇంత దూరం టూ-వీలర్‌పై ప్రయాణం చేయడం ఎంతమాత్రమూ మంచిది కాదు. ఏకధాటిగా అంతసేపు మీరు బైక్ మీద ప్రయాణం చేయడం వల్ల మీ వెన్ను (స్పైన్) తీవ్రమైన ఒత్తిడికి గురవుతుంది.
 
  ఇక రెండో విషయానికి వస్తే ఒకే భంగిమలో అదేపనిగా కొన్ని గంటపాటు కూర్చొని పనిచేయడం వల్ల కూడా మీ వెన్ను తీవ్రమైన ఒత్తిడికి గురవుతోంది. అంతేకాకుండా కంప్యూటర్ మీద అన్ని గంటలు పనిచేయడం వల్ల కూడా మీకు వెన్నుతో పాటు మెడ నొప్పి కూడా వస్తున్నట్లు అనిపిస్తోంది. ఇది చాలా ప్రమాదకరం. మీరు వెంటనే మీ దగ్గరలో ఉన్న సీనియర్ స్పైన్ సర్జన్‌ను కలవండి. వారు కొన్ని పరీక్షలు చేయించి, వాటిని బట్టి మీ సమస్యకు తగిన పరిష్కారం వారు సూచిస్తారు. అయితే ఈలోగా మీ వెన్నునొప్పి తగ్గడానికి  ఈ కింద పేర్కొన్న కొన్ని సూచనలు పాటించండి.
 
  మీ సీటుకు ముందు భాగాన ఉండే కంప్యూటర్ డెస్క్‌ను మీ తలకు సమానంగా ఉండేలా అమర్చుకోండి. దానికి అనుగుణంగా ఉండేలా మీరు ఆఫీసులో కూర్చునే భంగిమ మార్చుకోండి  కొన్ని సాధారణ వార్మ్‌అప్ వ్యాయామాలు చేయండి  వెన్ను, మెడ తీవ్రమైన ఒత్తిడికి, వేగవంతమైన కదలికలకు గురికాకుండా చూసుకోండి. ఇలా చేయడం వల్ల కాస్త రిలీఫ్‌గా ఉంటుంది.
 డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల
 సీనియర్ స్పైన్ సర్జన్
 యశోద హాస్పిటల్స్
 సికింద్రాబాద్
 
 
యాండ్రాలజీ/యూరాలజీ కౌన్సెలింగ్
 నా వయసు 24 ఏళ్లు. పెళ్లయి ఏడాదిన్నర అవుతోంది. పెళ్లయిన నాలుగు నెలలకు టీబీ వచ్చింది. ఆర్నెలలు మందులు వాడాక నెగెటివ్ రిపోర్టు వచ్చింది. అయితే పెళ్లయిన తర్వాత అంటే... మందులు వాడుతున్న సమయంలో నా భార్యకు ముద్దులు పెట్టడం, సెక్స్‌లో పాల్గొనడం వంటివి చేశాను. ఇప్పుడు నా భార్యకు దగ్గు వస్తోంది. తగ్గినప్పుడు తెమడ (కళ్లె) కూడా పడుతోంది. నా భార్యకు టీబీ వచ్చి ఉంటుందా? అప్పుడు నేను సెక్స్‌లో పాల్గొనవచ్చా? దయచేసి తగిన సలహా ఇవ్వండి.
                     - కె.జి.డి., సిద్ధిపేట


 టీబీ అంటువ్యాధి. ఇది దగ్గడం, తుమ్మడం వల్ల ఒకరినుంచి మరొకరికి సోకుతుంది. మందులు వాడటం మొదలుపెట్టిన ఒక వారం తర్వాత వ్యాధిగ్రస్తుల నుంచి వేరేవాళ్లకు సోకడం అరుదు. ఒకవేళ మీ భార్యకు టీబీ సోకి ఉంటే, అది మందులు వాడకముందు సోకి ఉండాలి. మందులు వాడటం మొదలు పెట్టిన తర్వాత ఇద్దరూ సెక్స్‌లో పాల్గొనడం ఏమాత్రం అభ్యంతరకరం కాదు. అయితే మీ భార్యకు దగ్గు వస్తోందంటున్నారు కాబట్టి ఆమెకు టీబీ పరీక్ష చేయించుకుని నిర్ధారణ చేసుకోవడం మంచిది.
 
 మా అబ్బాయి వయసు ఏడు నెలలు. అతడికి మూత్రం అంగం చివరిభాగం నుంచి కాకుండా కింది భాగంలోంచి వస్తోంది. అతడి పురుషాంగం కూడా చిన్నదిగా ఉండి లోపలికి ముడుచుకుపోయినట్లు అనిపిస్తోంది. డాక్టర్ దగ్గరికి వెళ్తే శస్త్రచికిత్స అవసరమని చెప్పారు. ఇంత చిన్నవాడికి సర్జరీ చేయచ్చా?
 - ఆర్.వి.ఎమ్., కందుకూరు
 
 మీ బాబుకు ఉన్న కండిషన్‌ను హైపోస్పైడియాస్ అంటారు. ఈ పరిస్థితి ఉన్నవారిలో   అంగం వంకరగా ఉండటం  మూత్ర ద్వారం పురుషాంగం చివరనగాక, దానికి కింది వైపున ఉండటాన్ని గమనించవచ్చు. ఈ సమస్య ఉన్నవాళ్లలో పురుషాంగం చక్కగా ఉండేట్లు చేయడంతో పాటు, మూత్ర ద్వారం పురుషాంగం చివరికి వచ్చేలా చేయడం అనే రెండు సర్జరీలు చేయాల్సి ఉంటుంది.
 
  ఆర్నెల్ల వయసు నుంచి మూడేళ్ల వరకు ఒక దశగా గాని, రెండు సార్లు గాని సర్జరీ చేస్తే, బాబు స్కూలుకు వెళ్లేనాటికి అతడిపై ఈ అంశం వల్ల కలిగే మానసిక ఒత్తిడి లేకుండా చేయడం వీలవుతుంది. ఇప్పుడు వైద్యవిజ్ఞానంలో వచ్చిన పురోగతి వల్ల చిన్నపిల్లలకూ సురక్షితంగా మత్తుమందు ఇచ్చే పరిజ్ఞానం అందుబాటులో ఉంది. కాబట్టి మీరు నిర్భయంగా యూరాలజిస్ట్‌ను సంప్రదించి నిశ్చింతగా మీ బాబుకు ఆపరేషన్ చేయించండి.
 
 డాక్టర్ వి. చంద్రమోహన్
 యూరో సర్జన్ అండ్ యాండ్రాలజిస్ట్
 ప్రీతి యూరాలజీ అండ్ కిడ్నీ హాస్పిటల్, కెపిహెచ్‌బి
 హైదరాబాద్
 

>
మరిన్ని వార్తలు