పిల్లల్లో చొల్లు కారుతోందా?

13 Feb, 2020 11:20 IST|Sakshi

ఇలా పిల్లలు నోట్లో వేలు పెట్టుకుని చొల్లు కారుస్తూ ఉన్నా చాలా అందంగా, క్యూట్‌గా కనిపిస్తుంటారు. ఆర్నెల్ల వయసు నుంచి 18 నెలల వరకు పిల్లలు ఇలా చొల్లు కార్చుకోవడం అన్నది చాలా సాధారణం. దీనికో కారణం ఉంది. నోరు, దవడ భాగాల్లోని ఓరల్‌ మోటార్‌ ఫంక్షన్స్‌ అని పిలిచే నాడీ వ్యవస్థ అభివృద్ధి చెందకపోవడమే దీనికి కారణం. ఆ ఓరల్‌ మోటార్‌ ఫంక్షన్స్‌ అభివృద్ధి చెందగానే చొల్లు కారడం ఆగిపోతుంది. ఇలా పిల్లల్లో చొల్లు/జొల్లు కారుతూ ఉండే కండిషన్‌ను ‘సైలోరియా’  అంటారు. అయితే నాలుగేళ్లు దాటాక కూడా పిల్లలు చొల్లు కారుతుంటే దాన్ని మాత్రం అబ్‌నార్మాలిటీగా పరిగణించాలి. 

పెద్ద పిల్లల్లో చొల్లు
కాస్తంత పెద్ద వయసులో ఉన్న చిన్న పిల్లల విషయానికి వస్తే... కొన్నిసార్లు వారి ముక్కులు విపరీతంగా బిగుసుకుపోయినా, దంత (డెంటల్‌) సమస్యలు ఉన్నా, మింగలేకపోవడానికి ఇంకేమైనా సమస్యలు ఉన్నా (ఉదా: సివియర్‌ ఫ్యారింగో టాన్సిలైటిస్‌ వంటివి) కూడా చొల్లు/జొల్లు కారుతుంటుంది. ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు చొల్లు కారవడం ఎక్కువైనా దాని గురించి ఆందోళన పడాల్సిన అవసరం ఉండదు. కారణం... పెద్దపిల్లల్లో కనిపించే ఇవన్నీ కేవలం తాత్కాలికమే.

కానీ కొంతమంది పెద్దపిల్లల్లో మానసిక సమస్యలు, నరాల బలహీనతక సంబంధించిన రుగ్మతలు ఉన్నప్పుడు చొల్లు కారే లక్షణం కనిపిస్తుంటుంది. కారణం... వాళ్లలో నోట్లో స్రవించిన లాలాజలాన్ని తమంతట తామే మింగలేరు. అందుకే పెద్దపిల్లల్లో చొల్లు కారుతుంటే మొదట న్యూరాలజిస్టుకు చూపించి, ఇతరత్రా సమస్యలేమీ లేవని నిర్ధారణ చేసుకోవడం ప్రధానం.

చొల్లు కారే సమస్యనుఅధిగమించడానికి...
ఇలా పెద్ద పిల్లల్లో ఇలా చొల్లు/జొల్లు కారడం సమస్య ఉన్నప్పుడు వాళ్లంతట వాళ్లే లాలాజల స్రావాన్ని మింగేలా అలవాటు చేయాలి.  లాలాజల స్రావం చాలా ఎక్కువగా ఉన్న పిల్లల్లో కొన్ని ప్రత్యేకమైన దంత ఉపకరణాలు (స్పెషల్‌ డెంటల్‌ అప్లయెన్సెస్‌) ఉపయోగించి వాలంటరీగా మింగడం అలవాటు చేయించవచ్చు. మరికొందరిలో కొన్ని ప్రత్యేక సందర్భాల్లో (ముఖ్యంగా పెద్దవాళ్లలో, పెద్ద పిల్లల్లో) కొన్ని మందులు వాడాల్సి ఉంటుంది. ఇటీవలి కాలంలో బొట్యులినం టాక్సినమ్‌ అనే పదార్థాన్ని లాలాజల గ్రంథుల్లోకి ఇంజెక్ట్‌ చేయడం కూడా చేస్తున్నారు.

ప్రత్యేకమైన జాగ్రత్తలివే...
చొల్లుకారే పిల్లల్లో కొన్ని ప్రత్యేకమైన జాగ్రత్తలు కూడా తీసుకోవడం మేలు చేస్తుంది. అవి...
మంచి నోటి పరిశుభ్రత (గుడ్‌ ఓరల్‌ హైజీన్‌)
తరచూ మింగడం అలవాటు చేయడం
నోటి కండరాల కదలికలను మెరుగు పరచడం (ఇంప్రూవ్‌మెంట్‌ ఆఫ్‌ టోన్‌ అండ్‌ మూవ్‌మెంట్‌ ఆఫ్‌ ఓరల్‌ మజిల్స్‌).
పైన పేర్కొన్న చర్యలతో ఒకింత పెద్ద వయసు వచ్చాక కూడా చొల్లు/జొల్లు కారుతుంటే, దాన్ని ఆపేందుకు దోహదపడతాయి. అప్పటికీ పెద్ద పిల్లల్లో చొల్లుకారే అలవాటు అప్పటికీ ఆగకపోతే పిల్లల డాక్టర్‌కు/ న్యూరాలజిస్ట్‌కు తప్పక చూపించాలి.- డా. రమేశ్‌బాబు దాసరిసీనియర్‌ పీడియాట్రీషియన్,రోహన్‌ హాస్పిటల్స్, విజయనగర్‌ కాలనీ, హైదరాబాద్‌

మరిన్ని వార్తలు