తల్లి ప్రేమ

18 Apr, 2020 09:48 IST|Sakshi
జూలీ జాన్‌

అది మార్చి నెలలో ఓ రోజు. అమెరికాలోని న్యూజెర్సీ. అర్ధరాత్రి. డాక్టర్‌ జూలీ జాన్‌కు మెలకువ వచ్చింది. శ్వాస కష్టంగా ఉంది. తలనొప్పి, జ్వరం కూడా ఉంది. ఆమె అంతకుముందు వారమంతా కోవిడ్‌ పేషెంట్‌లకు చికిత్స చేసి వారాంతంలో ఇంటికొచ్చింది. ఏ పరీక్షలూ అక్కరలేకుండానే తన కండిషన్‌ ఏమిటో ఆమెకు అర్థమైంది. మంచం మీద తన పక్కనే నిద్రపోతున్న పిల్లలను ప్రేమగా ఒకసారి తడమబోయి వెంటనే చేతిని వెనక్కు తీసుకుంది. పాపకు ఎనిమిది, బాబుకు ఆరేళ్లు. మెల్లగా మంచం దిగింది. పిల్లల కోసం దేవుడిని ప్రార్థించింది. పిల్లలకు వీడ్కోలు చెప్పింది. ప్రార్థన చేయడాన్ని, వీడ్కోలు చెప్పడాన్ని వీడియో తీసింది. ‘ఈ వీడియోను ఐదేళ్ల తర్వాత నా పిల్లలకు చూపించండి’ అని మెసేజ్‌ కూడా పెట్టింది జూలీ. ఆ వీడియోలో ఆమె... తన పిల్లలతో  వైద్యవృత్తి గొప్పదని చెబుతూ, వారిని కూడా ప్రపంచానికి వైద్యం చేయమని కోరింది. ఇదంతా చేస్తున్నప్పుడు ఆమె డాక్టర్‌ కాదు, ఇద్దరు బిడ్డలకు తల్లి మాత్రమే!

పిల్లలతో జూలీ జాన్‌
కోవిడ్‌ తగ్గింది
మార్చి నెలలో అలా ఇంటి నుంచి బయటకు వచ్చిన జూలీ ఇంకా ఇంటికి వెళ్లనే లేదు.  హాస్పిటల్‌కు వచ్చి పరీక్షలకు శాంపిల్స్‌ ఇచ్చి క్వారంటైన్‌లోకి వెళ్లిపోయింది. మూడు వారాలు గడిచింది. ఇప్పుడామె కోలుకున్నది. మళ్లీ శాంపిల్స్‌ ఇచ్చి నెగెటివ్‌ రిపోర్టు కోసం ఎదురు చూస్తోంది. పిల్లల కోసం తీసిన వీడియోను ఐదేళ్ల తర్వాత చూపించమనే మెసేజ్‌ ఎందుకు పెట్టారని అడిగినప్పుడు ‘‘అప్పటికైతే నా పిల్లలకు పదమూడేళ్లు, పదకొండేళ్లు వస్తాయి. నేను వాళ్లకు ఏం చెప్పదలుచుకున్నానో వాళ్లు అర్థం చేసుకోగలుగుతారు. నేనే  లేకపోతే... నేను చెప్పదలుచుకున్న విషయాన్ని వాళ్లకు ఎవరు చెబుతారు. అందుకే ఈ వీడియో’’ అన్నదామె. రిపోర్టులు నెగెటివ్‌ వస్తే, వెంటనే పిల్లలను చూడాలనే ఆత్రుత కనిపిస్తోందామె మాటల్లో. జూలీ మనసును చెప్పడానికి ‘తల్లి ప్రేమ’ అనే మాట సరిపోతుందా? ఇంకే పదం ఉన్నా అది తల్లి ప్రేమ కంటే గొప్ప పదం కాలేదేమో!

డాక్టర్‌ జూలీ జాన్‌ పుట్టింది కేరళలో. ఆమె అమ్మానాన్న మలయాళీలే. ఆమె పుట్టిన రెండేళ్లకే వాళ్లు అమెరికాకు వెళ్లిపోయారు. ఆమె అక్కడే మెడిసిన్‌ చదివి వైద్యవృత్తిలో స్థిరపడ్డారు. కోవిడ్‌ కేసులు ఎక్కువగా నమోదవుతున్న న్యూ జెర్సీలో ఆమె ఉద్యోగం.– మంజీర

మరిన్ని వార్తలు