అమ్మ నవ్వినా ఏడ్చినా కన్నీళ్లే

31 Oct, 2019 03:34 IST|Sakshi

అమ్మ ఏడుస్తుంది. ఎవరైనా తెలిసినవారు ఎదురుపడితే ఏడుస్తుంది. ఎవరైనా అయినవారు పలకరిస్తే ఏడుస్తుంది. ఎవరైనా బాధలో ఉంటే ఏడుస్తుంది. ఎక్కడైనా శుభకార్యం జరుగుతున్నా ఏడుస్తుంది. అమ్మకు ఏడుపు ఆగదు. 62 సంవత్సరాల అమ్మ ఏడుస్తూనే ఉంది. ఆమెకు కావలసింది ఏమిటి? ఆదరించే ఒక గుండె. వినే శ్రద్ధ ఉన్న రెండు చెవులు.

అప్పటికి ఇద్దరు కంటి డాక్టర్లు పరీక్షించి కంటిలో లోపం ఏమీ లేదని చెప్పారు. కన్నీళ్లు కారడం కంటి జబ్బు వల్ల కాదన్నారు. అవి లోపలి నుంచి వస్తున్నాయని, మనసు నుంచి వస్తున్నాయని, చూడబోతే ఆమె లోపల ఒక కన్నీటి సరోవరమే ఉన్నట్టుగా అనిపిస్తోందని డాక్టర్లు అన్నారు. ఇది కంటి డాక్టర్లు చూసే సమస్య కాదు. మరెవరు చూడాలి? అమెరికాలో సంధ్యమ్మ రెండు నెలలు ఇద్దరు కొడుకుల దగ్గర ఉండొచ్చింది. అక్కడకు వెళ్లిన రోజు నుంచి ఆమె ఊరికూరికే ఏడుస్తోంది. కొడుకులను చూస్తే ఏడుపు. కోడళ్లను చూస్తే ఏడుపు. బుజ్జి మనవడు, మనవరాళ్లను చూస్తే కూడా ఏడుపు. అక్కడ వారాంతంలో తెలిసినవారు రావడమో తెలిసినవారి ఫంక్షన్లకు వెళ్లడమో చేసేవారు కోడళ్లు. తోడుగా ఈమెను తీసుకెళ్లేవారు.

అక్కడకు వెళ్లగానే ఎవరితో ఒకరితో మాట్లాడుతూ ఆమె ఏడుపు మొదలెట్టేది. ఇది కోడళ్లకు ఇబ్బంది అయ్యి  ఈమె వల్ల మాకు చెడ్డపేరొస్తోంది అని మెల్లగా పంపించేసేందుకు సిద్ధమయ్యారు. ఇది గమనించిన సంధ్యమ్మ అమెరికాలోనే ఉన్న పెళ్లికాని మూడోకొడుకు దగ్గరకు వెళ్లింది అతడు బాగా సంపాదిస్తున్నాడు. చిన్న వయసులోనే పెద్ద భవంతి కూడా కొన్నాడు. అక్కడకు వెళ్లి ఆమె ఏడుస్తుంటే విసుక్కోవడం మొదలెట్టాడు. ‘నీకేం తక్కువని ఇక్కడ. చూడు ఎంత పెద్ద ఇల్లుందో. టీవీ చూడు. యూ ట్యూబ్‌లో భక్తి పాటలు విను. సినిమాలు చూడు. నాతో షికారుకు రా. కాని ఏడవకు. ఎందుకేడుస్తావ్‌ అలా? ఇంకా ఎన్నేళ్లని బతుకుతావ్‌ నువ్వు. ఉన్నన్ని రోజులు సంతోషంగా ఉండు’ అని అతనికి తోచిన పద్ధతిలో మాట్లాడటం మొదలుపెట్టాడు.

కాని ఆమెకు ఏడుపు ఆగేది కాదు. ఆగదు కూడా. మెల్లగా ఆమె ఇండియా వచ్చేసింది. సొంత ఇంట్లో పనిమనిషిని పెట్టుకొని ఒక్కత్తే ఉంటోంది. ఆమెకు ఇద్దరు సోదరులు. ఇద్దరూ చనిపోయారు. భర్త చనిపోయి సంవత్సరం. కొడుకులు ముగ్గురూ అమెరికాలో. ఆమెకు ప్రస్తుతం తోడు ఉన్నది కన్నీరు. కన్నీరు. కన్నీరు.‘ఏమ్మా.. ఎలా ఉన్నావ్‌?’ అని అడిగాడు సైకియాట్రిస్ట్‌. ఆ చిన్న ప్రశ్నకు, ఆ ఒక్క ప్రశ్నకు ఆమెకు ఏడుపు తన్నుకురాబోయింది. ‘ఆగమ్మా. ఆగు. నా ప్రశ్నకు నువ్వు ఏడవకుండా సమాధానం చెప్పగలిగితే మనం ఈ సమస్యను సగం అధిగమించినట్టు’ అన్నాడు సైకియాట్రిస్ట్‌. సంధ్యమ్మ కొంచెం సంభాళించుకోవడానికి ప్రయత్నించింది. ‘ఏం చెప్పను డాక్టర్‌... నా ప్రమేయం లేకుండానే నాకు ఏడుపు వస్తోంది’ అందామె. ‘ఏం పర్లేదమ్మా. నీకు ఈ సమస్య. మరొకరికి మరో సమస్య. సమస్య లేకుండా ఎవరూ ఉండరు.

మనం ప్రయత్నించి, డాక్టర్‌ సాయం తీసుకుని, అయినవారి సాయం తీసుకుని వాటి నుంచి బయటపడాలి’ ‘నాకెవరూ లేరు డాక్టర్‌’ అందామె గంభీరంగా. ‘అదేంటమ్మా’ ‘అవును. పెళ్లయినప్పుడు ఎవరూ లేరు. పిల్లలు పుట్టాక ఎవరూ లేరు. భర్త ఉండగా ఎవరూ లేరు. భర్త లేనప్పుడూ ఎవరూ లేరు. నాకెవరూ లేరు’ అందామె. మెల్లగా ఆమె తన కథను డాక్టర్‌కు చెప్పడం మొదలుపెట్టింది. సంధ్యమ్మది పెద్దలు కుదిర్చిన పెళ్లి. భర్త ఆర్‌ అండ్‌ బిలో ఇంజనీరు. కాని అతనిది ముక్కుసూటి వ్యవహారం. ఉద్యోగానికి సంబంధించిన కొన్ని లోపాయికరమైన వ్యవహారాలు తెలిసేవి కావు. మనసులో ఏదీ దాచుకోడు. ఎవరు తనవాళ్లో ఎవరు శత్రువులో తెలియక పై ఆఫీసర్ల గురించి ఏదో ఒక మాట అనేసేవాడు. దాంతో అతడికి ఉద్యోగంలో నిత్యం సమస్యలు ఉండేవి. ఒక్కోసారి ట్రాన్స్‌ఫర్లు, ఒక్కోసారి తనే లాంగ్‌లీవ్‌లు. బంధువులదగ్గర సంధ్యమ్మకు ఇదంతా తలకొట్టేసే పనిగా ఉండేది. పైగా ప్రతిసారీ ముగ్గురు పిల్లలను వేసుకొని ట్రాన్స్‌ఫర్ల మీద ఊర్లు తిరగాలంటే చాలా కష్టం.

వాళ్ల చదువు, పెంపకం ఆమెకు కష్టంగా ఉండేది. ఏమైనా అతనికి హితవు చెప్పబోతే చాలా కర్కశంగా ఎదురు తిరిగేవాడు. అసలు ఆమె మాటే అతని దగ్గర చెల్లుబాటయ్యేది కాదు. ఒకరోజు రెండు రోజులు కాదు... అతడు మరణించేవరకు ఆమెకు అదే శిక్ష. పిల్లలు వాళ్ల లోకంలో వాళ్లు ఉండేవారు. ఆమెకు తన బాధలు ఎవరితోనైనా చెప్పుకోవాలని ఉండేది. వినడానికి ఎవరూ ఉండేవారు కాదు. చెప్పాలన్నా మళ్లీ భర్తకు తెలిస్తే ఏమవుతుందోనని ఆ భయం. అలాగే నిన్న మొన్నటి వరకూ కృశించింది. ఎంతగా అంటే భర్త మరణించాక దుఃఖం కలగడంతోపాటు కొంత రిలీఫ్‌గా కూడా అనిపించేంత. కాని ఆ తర్వాతే ఆమె సమస్య మొదలయ్యింది. దారిలో ఏ కొత్త జంట స్కూటర్‌ మీద వెళుతున్నా తన పెళ్లయ్యాక అలా వెళ్లలేదే అని ఏడుపు. ఎవరు సంతోషంగా కబుర్లు చెప్పుకుంటున్నా తన భర్తతో అలా చెప్పుకోలేదే అని ఏడుపు. పిల్లలు ఆడుకుంటుంటే తన పిల్లల ఆటపాటలు చూసేంత తీరిక తనకు లేకపోయాయని ఏడుపు.

శుభకార్యాలకు వెళితే తాను సరిగ్గా ఏ శుభకార్యంలోనూ హాయిగా గడపలేదని గుర్తుకొచ్చి ఏడుపు. రాను రాను సంతోషానుభూతికి విషాదానుభూతికి తేడా తెలియని స్థితికి ఆమె చేరుకుంది. ఒక మనిషికి అసలైన విషాదం మాట్లాడే గొంతు లేకపోవడం కాదు. ఎదురుగా వినే రెండు చెవులు లేకపోవడం అని ఆమెను చూస్తే సైకియాట్రిస్ట్‌కు అనిపించింది. ఇదే బాధ కొంచెం అటు ఇటుగా ఇవాళ చాలామంది స్త్రీలు అనుభవిస్తున్నారని అనిపించింది. ‘చూడమ్మా. నీ కష్టం అర్థమైంది. నీ కష్టానికి మందు ఏమిటంటే నువ్వు చెప్పడం నేను వినడం. ఎంత చెప్పుకుంటావో చెప్పు. రోజూ వచ్చి నువ్వు పడ్డ కష్టాలన్నీ చెప్పు’ అని అన్నాడు సైకియాట్రిస్ట్‌. ఆమె నాలుగు వారాల పాటు అప్పుడప్పుడు వచ్చి డాక్టర్‌తో ఒక గంట కూచుని మాట్లాడి వెళ్లేది. తనలో బాగా గుచ్చుకుపోయిన అనుభవాలు చెబుతూ చెబుతూ వాటి ఉచ్చు నుంచి మెల్లగా బయటపడటం మొదలుపెట్టింది.

ఇక ఆమెకు కావలసింది రోజూ మాట్లాడే మనుషులు. వినే మనుషులు. ‘చూడమ్మా. నీ పిల్లల గురించి నేనేం చెప్పలేను. కాని నీలాంటి స్థితిలో ఉన్న మనుషులు ఉన్న ఓల్డ్‌ ఏజ్‌ హోమ్‌లు ఉన్నాయి. వారితో గడపడం నీకు కొంత లాభించవచ్చు. లేదా నీ కాలనీలో నీ వంటి మనుషులతో స్నేహం చేసి రోజూ మీరంతా ఒకచోట కలుస్తుంటే మరింత లాభం చేకూర్చవచ్చు. అసలు నీ మాటలు అందరూ ఎందుకు వినాలి.. అందరి మాటలు నువ్వు విని నీ అనుభవంతో సలహాలు ఇవ్వొచ్చు కదా అనుకుంటే నువ్వే అందరికీ ఆప్తురాలివైపోతావ్‌. అందరూ నీ కోసం ఎదురు చూసే దానివిలా మారిపోతావ్‌. నువ్వు రోగిగా కాదు ఉండాల్సింది. డాక్టర్‌గా. నీ కోసం నువ్వు బతికే నలుగురి కోసం బతికే డాక్టర్‌గా’ అన్నాడతను. ఆ సలహా పని చేసింది. సంధ్యమ్మ ఇప్పుడు కొంచెం బిజీగా ఉంటోంది. ఎదుటివారి మాటలు వింటోంది. నవ్వే విషయాలకు నిజంగా నవ్వుతోంది. నిజంగా ఏడ్వాల్సిన విషయాలకు కూడా దిటవు ప్రదర్శిస్తోంది. సంధ్యమ్మ గతం నుంచి వర్తమానం నుంచి కూడా విముక్తం అయ్యి జీవితాన్ని తన చేతుల్లోకి తీసుకోగలిగింది.
– కథనం: సాక్షి ఫీచర్స్‌ డెస్క్‌
ఇన్‌పుట్స్‌: డాక్టర్‌ కల్యాణ చక్రవర్తి, సైకియాట్రిస్ట్‌

మరిన్ని వార్తలు