బాలింతలకు కఠిన పథ్యం అవసరం లేదు

7 Jan, 2016 22:48 IST|Sakshi

ఆయుర్వేద కౌన్సెలింగ్
 
నాకు పదిరోజుల క్రితం పాప పుట్టింది. ఇంటిలోని వాళ్లు అవి తినకూడదు, ఇవి తినకూడదు అంటూ రకరకాల ఆంక్షలు విధిస్తున్నారు. జన్మించింది. బాలింతనైన నేను ఏవిధమైన ఆహారం, జాగ్రత్తలు తీసుకోవాలో సూచింప ప్రార్థన.
 - స్నేహ, హైదరాబాద్

ప్రసవమైన మూడు నాలుగు వారాల వరకు తల్లీ బిడ్డలకు ఇన్ఫెక్షన్‌లు రాకుండా పరిశుభ్ర వాతావరణాన్ని పాటించడం అత్యవసరం. మీరుండే గదిలోనికి ఎవ్వరినీ రానీయవద్దు. తల్లి, వైద్యుడు, నర్సు తప్ప ఇతరులెవ్వరూ శిశువుని తాకకుండా చూసుకోండి.
 
సాధారణంగా ప్రసూతులలో (బాలింతలలో) కొంచెం రక్తహీనత ఉండవచ్చు. నడుంనొప్పి, పాదాలవద్ద కొద్దిగా వాపులు కొందరిలో కనిపించవచ్చు. మీరు పుష్టికరమైన ఆహారం తీసుకోవాలి. కఠిన పథ్యాలు చేయాల్సిన అవసరం లేదు. బయటి ఆహారం, ఫ్రిజ్‌లో నిల్వ చేసిన పదార్థాలు మంచివి కావు. వేడి ఆహారం, పీచుపదార్థాలు ఎక్కువగా ఉండే కాయగూరలు, తాజాఫలాలు, జీడిపప్పు, బాదంపప్పు, ఖర్జూరం వంటి ఎండు ఫలాలు మంచిది. ప్రతిరోజూ ఉదయం బార్లీనీళ్లు, ఆవుమజ్జిగ తాగండి. నువ్వులు, బెల్లం తినండి. రోజూ రెండు లీటర్ల ఆవుపాలు తాగితే మీకు స్తన్యం బాగా ఉత్పత్తి అవుతుంది. అల్లం, వెల్లుల్లి, ఆహారంలో తగురీతిలో తినడం మంచిది.
 
అదేపనిగా పడుకోకుండా కొంచెం శారీరక శ్రమ కలిగే తేలికపాటి వ్యాయామాలు చేయండి. రెండుపూటలా ఐదేసి నిమిషాల పాటు ప్రాణాయామం చేయండి. ప్రసవానంతరం ఆరోగ్యం కుదుటపడటానికి సహకరించే ఈ కింద సూచించిన ఆయుర్వేద మందులు వాడండి.
 పునర్నవాది మండూర (మాత్రలు): ఉదయం 1, రాత్రి 1  బాలింత కాఢ నెం. 1 (ద్రావకం): ఉదయం 2 చెంచాలు, రాత్రి రెండు చెంచాలు రెండు వారాలు తాగండి. ఆ తర్వాత...    బాలింత కాఢ నెం. 2 (ద్రావకం): ఉదయం 2 చెంచాలు, రాత్రి చెంచాలు రెండు వారాలు తాగండి.
 
శిశువునకు...
అరవిందాసవ (ద్రావకం): ఐదుచుక్కలు ఉదయం, ఐదు చుక్కలు సాయంత్రం తాగించాలి (తేనెతో). వీలుంటే శిశువుని (బట్టలు లేకుండా) ప్రభాత సూర్యకిరణాలలో ఐదు నిమిషాలు ఉంచితే మంచిది. ‘బలాతైలం’తో శిశువునకు మృదువుగా అభ్యంగం చేసి, అనంతరం సున్నిపిండితో, వేడినీటి స్నానం చేయించండి.
డాక్టర్ వృద్ధుల
లక్ష్మీనరసింహశాస్త్రి
ఆయుర్వేద నిపుణులు,
సౌభాగ్య ఆయుర్వేదిక్ క్లినిక్, హుమాయూన్‌నగర్, హైదరాబాద్
 
గ్యాస్ట్రోఎంటరాలజీ కౌన్సెలింగ్
 
నా వయసు 50 ఏళ్లు. నాకు ఏడాది క్రితం కడుపునొప్పి, కామెర్లు వచ్చాయి. ఒళ్లంతా ఒకటే దురద. డాక్టర్‌ను కలిస్తే పరీక్షలు చేసి, గాల్‌బ్లాడర్‌లో రాళ్లు ఉన్నాయని చెప్పారు. ఈఆర్‌సీపీ టెస్ట్ చేసి స్టెంట్ వేశారు. నెల రోజుల నుంచి మళ్లీ కళ్లు పచ్చబడుతున్నాయి. జ్వరం వస్తోంది. నాకు సరైన సలహా ఇవ్వగలరు.
 - సుకుమార్, నందిగామ

 మీరు గాల్‌స్టోన్స్‌తో పాటు సీబీడీ స్టోన్స్ అనే సమస్యలతో బాధపడుతున్నారు. మీకు ఇటీవల వేసిన బిలియరీ స్టెంట్ మూసుకుపోయి ఉండవచ్చు. దాంతో మీకు కామెర్లు, జ్వరం వస్తున్నాయి. మీరు మళ్లీ వీలైనంత త్వరగా ఈఆర్‌సీపీ పరీక్ష చేయించుకోండి. దీనివల్ల మీకు సీబీడీలో రాళ్లు ఉన్నా తొలగించడానికి వీలవుతుంది. అలాగే  మూసుకుపోయిన స్టెంట్ స్థానంలో కొత్త స్టెంట్ కూడా అమర్చవచ్చు. ఈఆర్‌సీసీ తర్వాత మీరు లాపరోస్కోపీ ద్వారా గాల్ బ్లాడర్‌ను తొలగించుకోవాల్సి ఉంటుంది. లేకపోతే ఇదే సమస్య మళ్లీ మళ్లీ వచ్చే అవకాశం ఉంది.
 
 నేను రోజూ ఆల్కహాల్ తీసుకుంటూ ఉంటాను. నాకు ఈ మధ్య కడుపులో నీరు రావడంతో పాటు, కాళ్లవాపులూ వచ్చాయి. మా దగ్గర స్థానికంగా ఉండే డాక్టర్‌ను సంప్రదిస్తే కొన్ని టాబ్లెట్స్ ఇచ్చారు. కొన్నాళ్ల పాటు సమస్య తగ్గింది. కానీ మళ్లీ అదే సమస్య వచ్చింది. దయచేసి నాకు సరైన సలహా ఇవ్వండి.
 - రమాకాంతరావు, కంచికచర్ల

 కడుపులో నీరు రావడం, కాళ్ల వాపులు వంటి లక్షణాలను బట్టి మీకు లివర్, కిడ్నీ లేదా గుండెజబ్బు ఉన్నట్లుగా అనుమానించాల్సి ఉంటుంది. ఆల్కహాల్ అలవాటు ఉందంటున్నారు కాబట్టి ఒకసారి కడుపు స్కానింగ్, లివర్ ఫంక్షన్ పరీక్ష, కిడ్నీ ఫంక్షన్ పరీక్ష, కడుపులో నీటి పరీక్ష చేయించుకోవాలి. ఆ రిపోర్టులతో గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్‌ను కలవండి. మీ టెస్ట్ రిపోర్టు ఆధారంగా మీకు చికిత్స అందించాల్సి ఉంటుంది.
 
నా వయసు 41 ఏళ్లు. నేను చాలా ఏళ్ల నుంచి అసిడిటీతో బాధపడుతున్నాను. దాదాపు మూడు నెలల పాటు రకరకాల మందులు వాడాను. ఇప్పుడు దాంతోపాటు మలబద్ధకం, తలనొప్పి వంటి సమస్యలతోనూ బాధపడుతున్నాను. అయితే నాకు డయాబెటిస్‌గానీ, హైబీపీగాని లేవు. దయచేసి నా సమస్యలు తీరేలా తగిన సలహా ఇవ్వండి.
 - రాజ్‌కుమార్, కరీంనగర్

మీరు రాసిన ఉత్తరంలో మీరు ఎండోస్కోపీ చేయించుకున్నారా లేదా అన్న వివరాలు లేవు. మీరు ఒకవేళ ఎండోస్కోపీ చేయించుకోకపోతే ఒకసారి గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్‌ను సంప్రదించి ఎండోస్కోపీ చేయించుకోండి. అందులో వచ్చే ఫలితాన్ని బట్టి వైద్య చికిత్స అందించాల్సి ఉంటుంది.
 
డాక్టర్ భవానీరాజు
సీనియర్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్
కేర్ హాస్పిటల్స్
బంజారాహిల్స్
హైదరాబాద్
 
ఆర్థోపెడిక్ కౌన్సెలింగ్
 
నా కూతురికి 23 ఏళ్లు. గత రెండేళ్లుగా అప్పుడప్పుడూ ఆమెకు కుడివైపున పొత్తికడుపులో నొప్పి వస్తోంది. శారీరకమైన శ్రమ చేసినప్పుడు  ఈ నొప్పి మరీ ఎక్కువగా వస్తోంది. అయితే గత మూడు నెలల నుంచి ఈ నొప్పి రోజూ వస్తోంది. నొప్పి తీవ్రత కూడా ఎక్కువే. డాక్టర్ దగ్గరికి వెళితే ఎక్స్-రే తీసి ఆమెకు తుంటి భాగం సరిగా ఏర్పడలేదని అన్నారు. దాంతో మేం షాక్‌కు గురయ్యాం. పుట్టుక నుంచే ఈ సమస్య ఉన్నప్పుడు... ఈ మధ్యనే నొప్పి ఎందుకు వస్తోంది? ఆమెకు తుంటి భాగాన్ని మళ్లీ అమర్చాల్సి వస్తే... అది ఎప్పటికి కుదురుకుంటుంది? ఆమెది చిన్న వయసు. పైగా ఇప్పుడు పెళ్లి చేయాల్సిన సమయం. కాబట్టి ఈ సమయంలో ఆమెకు ఈ ఆపరేషన్ చేయడం వల్ల ఆమె వైవాహిక జీవితానికి గాని, పిల్లల పుట్టుకకు గానీ ఏదైనా సమస్య వస్తుందా? దయచేసి వివరించండి.
 - స్నేహలత, గుంటూరు
 
మీరు చెప్పినట్లుగా ఈ వయసులో ఏదైనా సమస్య బయట పడటం, పైగా జీవితంలో  కుదురుకోవాల్సిన సమయంలో పుట్టుకతో సమస్య ఉన్నట్లుగా తెలియడం బాధాకరమే. మీరు చెప్పిన అంశాలను బట్టి ఆమెకు ఉన్న కండిషన్‌ను ‘డిస్‌ప్లాస్టిక్ హిప్’ అంటారు. పిల్లలు ఎదుగుతున్న కొద్దీ వాళ్లలోని మృదులాస్థి / చిగురు ఎముక... అంటే అసలు ఎముక చివరిభాగంలో ఉండే కార్టిలేజ్ అరిగిపోయి సమస్యతో పాటు, తీవ్రత కూడా  బయటపడుతుంది. అయితే కొంతమందిలో ఈ సమస్య బాల్యదశలోనే వెల్లడి అవుతుంది. వాళ్లలో ఆర్థరైటిస్‌తో పాటు తీవ్రమైన నొప్పి వల్ల ఈ కండిషన్ తెలుస్తుంది.
 
సాధారణంగా కీళ్ల మార్పిడి ఆపరేషన్‌ను ఈ సమయంలో చేయరు. కానీ ఆమెకు ఉన్న కండిషన్ వల్ల మరో ప్రత్యామ్నాయం లేదు. అయితే మీరు అంతగా నిరాశ చెందాల్సిన అవసరం లేదు. ఆమెకు అవసరమైన ఆపరేషన్ చేయడం వల్ల భవిష్యత్తులో 30-40 ఏళ్ల వరకూ మళ్లీ సమస్య తలెత్తే అవకాశాలు చాలా తక్కువ. నొప్పి కూడా ఉండదు. ఆమె తన రోజువారీ వ్యవహారాలు చూసుకోడానికి గానీ లేదా పెళ్లికి, బిడ్డలను కనేందుకు ఈ శస్త్రచికిత్స వల్ల ఎలాంటి సమస్యా రాదు. కాబట్టి మీరు అంతగా బాధపడకుండా, మీకు దగ్గరలోని ఆర్థోపెడిక్ సర్జన్‌ను కలిసి, తగిన చికిత్స తీసుకోండి.
 
డాక్టర్ కె. సుధీర్‌రెడ్డి
చీఫ్ ఆర్థోపెడిక్ సర్జన్
ల్యాండ్‌మార్క్ హాస్పిటల్స్
హైదరాబాద్

మరిన్ని వార్తలు