సర్వోదయ బడి ఫస్ట్‌లేడీ సందడి

26 Feb, 2020 04:54 IST|Sakshi
హ్యాపీనెస్‌ క్లాస్‌ రూమ్‌లో మెలానియా

సంతోషం సగం బలం అంటారు. కానీ సంతోషమే సంపూర్ణ బలం. అవును ఇది నిజం. పువ్వుల్లా నవ్వే చిన్నారుల్ని చూసినా.. వారి పక్కనే కూర్చొని సంతోషంపై పాఠాలు నేర్చుకున్నా.. ధ్యానముద్రలో ఉంటూ అలౌకిక ఆనందాన్ని పొందినా.. సంతోషం ఎలా రెట్టింపవుతుందో అదే సంపూర్ణ బలంగా ఎలా మారుతుందో తెలుస్తుంది. అమెరికా ఫస్ట్‌ లేడీ మెలానియా ట్రంప్‌కి ఢిల్లీ పాఠశాల జీవితకాలానికి సరిపడా అద్భుతమైన అనుభూతినిచ్చింది. 

అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్‌ మంగళవారం ఢిల్లీలోని మోతీబాగ్‌లో సర్వోదయ బాలబాలికల ప్రాథమికోన్నత పాఠశాలను సందర్శించారు. విద్యార్థుల్లో విద్యార్థిగా కలిసిపోయారు. తరగతి గదిలో కూర్చొని హ్యాపీనెస్‌ క్లాసుల్ని శ్రద్ధగా విన్నారు. చిన్నారులతో ముచ్చట్లాడారు. హ్యాపీనెస్‌ పాఠ్యాంశాలు తనలో ఎంతో స్ఫూర్తిని నింపాయని, ఇవి విద్యార్థుల్లో ఆరోగ్యకరమైన ఆలోచనల్ని, సానుకూల దృక్ఫథం అలవడడానికి దోహదపడతాయని కూడా అన్నారు.

బొట్టుపెట్టి.. హారతిచ్చి  
డొనాల్డ్‌ ట్రంప్, నరేంద్ర మోదీతో చర్చలు నిర్వహిస్తున్న సమయంలో మెలానియా ఈ పాఠశాలకు వెళ్లి విద్యార్థులతో ఉల్లాసంగా గడిపారు. ఆమెకు స్వాగతం చెప్పడానికి పువ్వులు, కళాకృతులతో పాఠశాలని కంటికింపుగా అలంకరించారు నిర్వాహకులు. చాలా చోట్ల రంగు రంగుల ముగ్గులు వేశారు. చీరలు ఘాగ్రాచోళీలు ధరించి అందంగా ముస్తాబైన కొందరు విద్యార్థినులు ఆడుతూ, పాడుతూ మెలానియాకు స్వాగతం పలికారు. ఆమెకి పుష్ప గుచ్ఛాన్ని ఇచ్చి నుదుటన కుంకుమ బొట్టు పెట్టి, హారతి ఇచ్చి  లోపలికి ఆహ్వానించారు. 

‘హ్యాపీనెస్‌’ స్ఫూర్తి
మెలానియా పాఠశాల అంతా కలియ తిరిగారు. రీడింగ్‌ రూమ్‌కి వెళ్లారు. ఎల్‌కేజీ, యూకేజీ చిన్నారులకి ఆటపాటల్ని నేర్పే యాక్టివిటీ రూమ్‌కి వెళ్లారు. వారితో పాటు అక్కడే కూర్చొని చాలాసేపు గడిపారు. యోగా క్లాసుకి వెళ్లి విద్యార్థులతో మాట్లాడారు. వారితో కలిసి కాసేపు ధ్యానముద్రలో గడిపారు. ఆ ధ్యానం తనకు ఎంతో ప్రశాంతతనిచ్చిందని అన్నారు. ఆ తర్వాత పాఠశాల విద్యార్థులనుద్దేశించి మాట్లాడారు. భారత్‌కు రావడం ఇదే తొలిసారని, ఇక్కడి ప్రజలు ఎంతో దయామయులని కితాబునిచ్చారు. విద్యార్థుల మానసిక ప్రశాంతత కోసం మెడిటేషన్‌తో తరగతుల్ని ప్రారంభించడం, ప్రకృతితో మమేకం కావడం ఎంతో స్ఫూర్తిని కలిగిస్తాయని చెప్పారు. విద్యార్థులతో మంచి సమయాన్ని గడిపిన మెలానియా తిరిగి వెళ్లే ముందు విద్యార్థులు భారత్, అమెరికా జెండాలు పట్టుకొని బారులు తీరి నిల్చొని ఉల్లాసంతో, ఉత్సాహంతో ఛీర్స్‌ చెబుతూ ఆమెకు వీడ్కోలు చెప్పారు.

ఫస్ట్‌ లేడీకి ప్రశ్నలు 
అమెరికా ఎంత పెద్దది ? ఇక్కడ నుంచి బాగా దూరమా? ఫస్ట్‌ లేడీ అంటే ఏం చేస్తారు? ఇలా సర్వోదయ పాఠశాలలో ఔత్సాహిక విద్యార్థులు మెలానియా ట్రంప్‌పై ప్రశ్నల వర్షం కురిపించారు. దాదాపు గంటకు పైగా ఆమె స్కూలులో గడిపారు. ఈ సందర్భంగా అక్కడి టీచర్లు మెలానియాను ఏమైనా అడగాలని అనుకుంటే అడగమని విద్యార్థుల్ని ప్రోత్సహించారు. దీంతో అమెరికా గురించి, అక్కడకి వెళ్లేందుకు పట్టే సమయం గురించి రకరకాల ప్రశ్నలు వేశారు. వాటన్నింటికి మెలానియా ఓపిగ్గా సమాధానమిచ్చారు. 

ఢిల్లీ సీఎం ట్వీట్‌ 
మెలానియా పాఠశాలకు రావడానికి ముందు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ఆమెకు స్వాగతం చెబుతూ ట్వీట్‌ చేశారు.‘‘ మా స్కూలులో హ్యాపీనెస్‌ క్లాస్‌కు అమెరికా ఫస్ట్‌ లేడీ హాజరవుతున్నారు. ఢిల్లీ ప్రజలకు మా పాఠశాల విద్యార్థులు, టీచర్లకు ఇది అద్భుతమైన రోజు. శతాబ్దాలుగా భారత్‌ ప్రపంచానికి ఆధ్యాత్మికతను బోధిస్తోంది. మా పాఠశాల నుంచి ఆమె ఆనందోత్సాహాలతో తిరిగి వెళతారు. అదే మాకు ఎంతో సంతోషాన్నిస్తుంది’’ అని కేజ్రీవాల్‌ ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు.
 
ఏమిటీ హ్యాపీనెస్‌ క్లాస్‌లు?!
ప్రస్తుత పోటీ ప్రపంచంలో పాఠశాలల్లో తరగతులంటే పాఠాలు బట్టీ పట్టడం, పరీక్షలు రాయడం, మార్కులు, ర్యాంకులు, అడుగడుగునా ఒత్తిళ్లు. ఈ విధానానికి చెక్‌ పెట్టి విద్యార్థుల మెదడుకి పదును పెడుతూ వారిలో సంతోషాన్ని పెంచే క్లాస్‌లివి. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రివాల్‌ తాను చేపట్టిన విద్యావ్యవస్థ సంస్కరణలో భాగంగా ఈ హ్యాపీనెస్‌ క్లాస్‌లను ప్రవేశపెట్టారు. ఈ విధానం ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది. ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలల్లో నర్సరీ నుంచి ఎనిమిదో తరగతి వరకు పాఠశాలల్లో 45 నిముషాల సేపు ఈ హ్యాపీనెస్‌ పీరియడ్‌ ఉంటుంది.

ఈ క్లాసులో పిల్లలందరి మానసిక ప్రశాంతత కోసం కాసేపు ధ్యానం చేయిస్తారు. విలువలతో ఎలా బతకాలో నేర్పిస్తారు. వారి మేధస్సుకు పదును పెట్టేలా, నిత్య జీవితంలో ఎదురయ్యే సమస్యలను తట్టుకొని ఆనందంగా జీవితాన్ని ఎలా గడపాలో వారికి బోధిస్తారు. ఆత్మ స్థైర్యంతో అనర్గళంగా మాట్లాడేలా చర్చలు నిర్వహిస్తారు. వారిలో కళని బయటకు తీసేలా చిన్నచిన్న నాటికలు వేయిస్తారు.  

మరిన్ని వార్తలు